మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 15, 2020 , 02:30:23

ప్రజల నమ్మకం పాలకుడి ధైర్యం

ప్రజల నమ్మకం పాలకుడి ధైర్యం
  • చార్జీల పెంపు నిర్ణయానికి జనామోదం
  • సేవల్లో నాణ్యతే ప్రధానం.. భారం మోసేందుకు సిద్ధం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి పన్నుల పెంపు తప్పదని, ఇలాంటి నిర్ణయాల విషయంలో ఓట్ల గురించి భయపడబోమని సీఎం కేసీఆర్‌ ఏకంగా అసెంబ్లీ వేదికగా ప్రకటించడం సాహసోపేతమైన నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వ్యవస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు విద్యుత్‌ చార్జీలను, మున్సిపల్‌, గ్రామపంచాయతీల్లో పన్నులను కొంతమేర పెంచక తప్పదని ముఖ్యమంత్రి శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. స్తోమత ఉన్నవారి నుంచే ఎక్కువ పన్నులు వసూలుచేస్తామని, పేదలపై భారం పడకుండా జాగ్రత్త వహిస్తామని కూడా వివరించారు. 


ఏ ప్రభుత్వమైనా ఇంత సూటిగా, శాసనసభను వేదికగా చేసుకొని మరీ చార్జీలు, పన్నుల పెంపును ప్రకటించడం అత్యంత అరుదని సీనియర్‌ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత పౌర సమాజం నుంచిగానీ, ప్రజల నుంచిగానీ ఇసుమంతైనా వ్యతిరేకత వ్యక్తంకాకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నిర్ణయాలకు ఉన్న ప్రజామోదాన్ని ఇది సూచిస్తున్నదని ఆయన విశ్లేషించారు. సాధారణంగా పెద్ద మెజారిటీ ప్రభుత్వాలు కూడా పన్నుల పెంపు  నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. రాజకీయంగా జరిగే నష్టాన్ని బేరీజు వేసుకుంటాయి. రాష్ట్ర ప్రయోజనమా? రాజకీయ ప్రయోజనమా? అన్న మీమాంస తలెత్తిన సందర్భంలో రాజకీయ ప్రయోజనంవైపే మొగ్గు చూపుతాయి. ఇక్కడే కేసీఆర్‌.. తనకు, ఇతర నాయకులకు మధ్య ఉన్న తేడాను చూపిస్తున్నారని ఒక సీనియర్‌ నాయకుడు పేర్కొన్నారు. 


రాష్ట్ర ప్రయోజనమా? రాజకీయ ప్రయోజనమా? అన్న సందర్భంలో కేసీఆర్‌ రాష్ట్ర ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారని ఆయన తెలిపారు. తన నిర్ణయాలను ప్రజలు ఆమోదిస్తారని విశ్వాసం ఉండటమే అందుకు కారణమని అభిప్రాయపడ్డారు. ‘ప్రజలు కేసీఆర్‌ను నమ్ముతున్నారు. అందుకే ఆయన కఠిన నిర్ణయాలు తీసుకున్నా ఆమోదిస్తున్నారు. తొలుత ఆ నిర్ణయం సరికాదని అనుకున్నవారు కూడా తర్వాత కేసీఆరే కరెక్టని అంగీకరిస్తున్నారు. అనేకసార్లు ఇది రుజువైంది’ అని ఆయన వివరించారు. ‘సాధారణంగా ఏ సమాజంలోనైనా కొన్ని ప్రెషర్‌ గ్రూపులుంటాయి. తమ ప్రయోజనాల సాధనకు అవి సంఘటితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాయి. బలమైన నాయకులు సైతం రాజకీయ ప్రయోజనాల కోసం వాటికి లొంగిపోతుంటారు. అందుకోసం ఇతర పేద, అసంఘటిత, నోరులేని వర్గాల ప్రయోజనాలను పణంగా పెడుతుంటా రు. కానీ విచిత్రంగా కేసీఆర్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసం, పేదలకు అమలుచేసే సంక్షేమ పథకాల అమలుకోసం ప్రెషర్‌ గ్రూపులతో తలపడుతున్నారు. వాటి ఒత్తిడి ఎత్తుగడలకు లొంగకుండా చిత్తు చేస్తున్నారు. ఇది ఆసక్తికరంగా కనిపిస్తున్నది’ అని విశ్లేషించారో కాలమిస్టు. ఆర్టీసీ సమ్మె, పీఆర్సీ, రెవెన్యూ, కొత్త మున్సిపల్‌ చట్టం తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు. 


వ్యతిరేకత ఎందుకు లేదంటే!

2000 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కరంట్‌ చార్జీలను పెంచినపుడు వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను, జరిగిన ఆందోళనను, అప్పడు తెలుగుదేశంలో ముఖ్య నేతగా కొనసాగిన నాయకుడొకరు గుర్తుచేశారు. ఇప్పుడు కేసీఆర్‌ కరంట్‌ చార్జీలను పెంచుతామని ప్రకటించినా ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకతా లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ‘ఆరోజు మేం సరఫరా చేసిందే విద్యుత్తు. కోతలు, బ్రేక్‌డౌన్లకు తోడు చార్జీలు కూడా పెంచడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ ఇప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని రంగాలకూ 24 గంటల నాణ్యమైన కరంట్‌ ఇస్తున్నది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందిస్తున్నది. ఇం డ్లకు కోతల్లేని కరంట్‌ అందుతున్నది. దీంతో ఇన్వర్టర్ల ఖర్చు తప్పిపోయింది. గృహ వినియోగదారుల్లో గణనీయ సంఖ్యలో రైతు లు కూడా ఉన్నారు. వీ రంతా తమకు అందుతున్న సౌకర్యానికి ప్రతిఫలంగా కొంత భారం మోయడానికి సిద్ధపడుతున్నారు. వ్యతిరేకత రాకపోవడానికి అసలు కారణం ఇదీ’ అని ఆయన విశ్లేషించారు.


కౌటిల్యుడి బాటలోనే..

పన్నులు చెల్లించాలంటే ప్రజలకు పన్నులు చెల్లించే సామర్థ్యం ఉండాలి. లేదా ప్రభుత్వం వారికి ఆ సామర్థ్యాన్ని కల్పించాలి. ‘పన్నుల వ్యవస్థ పండ్ల తోట వంటిది. కసుగాయల్ని కోయడం రైతుకూ నష్టం, పంటకూ నష్టం. పౌరులకు చెల్లించే స్తోమత తెచ్చిన తర్వాతే ప్రభుత్వాలు పన్నులను పెంచాలి’ అంటాడు అర్థశాస్త్రవేత్త కౌటిల్యుడు. కేసీఆర్‌ కూడా ఇదే చేస్తున్నారని ఆర్థిక నిపుణుడొకరు వివరించారు. ‘దశాబ్దాల ఉమ్మడి పాలనతో, దశాబ్దానికి పైగా సాగిన ప్రత్యేక ఉద్యమంతో తెలంగాణ నీరసించి ఉన్న తరుణంలో, కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా వచ్చారు. రాష్ట్ర మనుగడపై  అనుమానాలు ఉన్న సమయంలో పగ్గాలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితిని గుర్తించి, ప్రజల్లో నమ్మకాన్ని ప్రోదిచేయడం తక్షణ కర్తవ్యంగా భావించారు. మన కాళ్లపై మనం నిలబడగలమని నిరూపించారు. 


ప్రజల ఆర్థిక శక్తి పెంచారు. ఉద్యోగులకు 43% ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. పేదలకు భారీ ఎత్తున పెన్షన్లు ఇచ్చారు. అనేక సంక్షేమ పథకాలను అమలుచేశారు. విడిపోతే చిమ్మచీకట్లలో మగ్గుతారు అంటూ శాపనార్థాలు వినవచ్చిన తరుణంలో ఏకంగా అన్నిరంగాలకు 24 గంటల కరంట్‌ ఇచ్చారు. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం వంటి పథకాల ద్వారా వ్యవసాయానికి సాగునీటిని, 24 గంటల ఉచిత విద్యుత్తును అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా ప్రజల ఆర్థిక స్థితిగతులు కుదుటపడ్డాయి. ఆదాయ మార్గాలు, జీవన నాణ్యత పెరిగాయి. ఫలితంగా పన్నులు చెల్లించే సామర్థ్యం కూడా మెరుగుపడింది. చార్జీల పెంపు పట్ల వ్యతిరేకత వ్యక్తంకాకపోవడానికి ఇదే ప్రధాన కారణం’ అని ఆ ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం దేశ సగటు కంటే ఎక్కువ ఉండటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. 


జాతీయంగా, అంతర్జాతీయంగా ఆర్థిక ఒడిదుడుకులు ఎదురవుతున్నా తెలంగాణ స్థిర వృద్ధిని సాధిస్తుండటం కూడా ప్రజలకు ప్రభుత్వ పనితీరుపై నమ్మకం పెంచే అంశాల్లో ఒకటని ఆయన తెలిపారు. ‘సరైన మౌలిక వసతులు కల్పిస్తే, మరింత పన్ను చెల్లించేందుకు ప్రజలెప్పుడూ సిద్ధంగానే ఉంటారు. లాజిక్‌ ఏమిటంటే.. మౌలికవసతులతో ప్రజలు ఎక్కువ సంపాదించుకుంటారు. కొంత ప్రభుత్వానికి చెల్లించడానికి వారికి ఇబ్బంది ఉండదు. ఇది ఇద్దరికీ లాభదాయకం కదా! గతంలో జరుగనిదీ, తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నదీ ఇదే’ అని ఆయన విప్పి చెప్పారు. విద్యుత్తు, సాగునీరు, పల్లె, పట్టణ ప్రగతి వంటి అంశాల్లో మౌలిక వసతుల కల్పన కోసం జరుగుతున్న భారీ వ్యయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని, అందులో ఉడతా భక్తిగా తమవంతు భారం పంచుకోవడానికి సిద్ధపడుతున్నారని, దాని ఫలితమే చార్జీల పెంపునకు ప్రజల ఆమోదమని ఆయన విశ్లేషించారు.


భారీ ప్రాజెక్టులు, సంక్షేమం జోడెడ్లుగా..

సాధారణంగా దార్శనికత ఉన్న ఏ ప్రభుత్వమైనా రెండు కీలక వ్యూహాల మధ్య సంతులనంతో పనిచేస్తుంది. అందులో ఒకటి స్వల్పకాలికమైనది కాగా, మరొకటి దీర్ఘకాలికమైనది. ‘సంక్షేమ పథకాల వంటివి బడుగులకు తక్షణ ఉపశమనాన్ని అందిస్తే, సాగునీటి ప్రాజెక్టుల వంటివి రాష్ర్టానికి దీర్ఘకాలంలో భారీ ప్రయోజనాలను కలిగిస్తాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలను, భారీ ప్రాజెక్టులను బండికి జోడెడ్లలా ముందుకు తీసుకుపోతున్నది. తాము చెల్లించే, చెల్లించబోయే పన్నులు సద్వినియోగం అవుతున్నాయని ప్రజలు నమ్ముతున్నారు. పన్నుల రూపంలో తాము ఖజానాకు చెల్లించిన సొమ్ము పక్కదారి పట్టడం లేదని, తిరిగి అది తమకే చెందుతున్నదని విశ్వసిస్తున్నారు. పెన్షన్లు, సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల రూపంలో ఇది వారి కండ్లముందే కనిపిస్తున్నది. అందుకే చార్జీలు, పన్నుల పెంపు పట్ల ప్రజల్లో ఏమాత్రం వ్యతిరేకత లేదు’ అన్నారు ఒక సామాజిక నిపుణుడు. 


ప్రజల్లో కేసీఆర్‌పై నమ్మకం

గ్రామాలు, మునిసిపాలిటీల్లో చార్జీల పెంపునకు కూడా క్షేత్రస్థాయిలో ఎలాంటి వ్యతిరేకతా లేదని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మండల నాయకుడొకరు అన్నారు. ‘తెలంగాణ వచ్చాక ఇప్పటిదాకా పెద్దగా చార్జీలను పెంచలేదు. కేసీఆర్‌ ఏం చేసినా తమకోసమే చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉన్నది. అదే రీతిలో కేసీఆర్‌ కూడా.. ఎమ్మెల్యేల వేతనాలను తగ్గించైనా పల్లెప్రగతికి నిధులు ఇస్తానని ప్రకటించారు. కేంద్రం ఇచ్చే రూ.1847 కోట్లకు సమానంగా మరో 1847 కోట్లను జతచేసి పంచాయతీలకు ఇస్తామని చెప్పారు. ప్రజలు కూడా దాన్ని నమ్ముతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు గతంలో కేంద్రం నుంచి (ఫైనాన్స్‌ కమిషన్‌) నిధులు సరిగా విడుదలయ్యేవి కాదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచీ అంతే. దీనితో గ్రామపంచాయతీలు ఎప్పుడూ నిధుల కొరతతో సతమతమయ్యేవి. గనులున్న ప్రాంతాల్లో మాత్రమే పంచాయతీలకు కాస్త నిధులు వచ్చేవి. వసూలు చేసిన పన్నులను జీపీ ఖాతాలో జమచేసి సిబ్బంది జీతాలు తీసుకునేవారు. చాలాసార్లు జీతాలకు కూడా ఇబ్బంది పడాల్సివచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దీనికి తోడు పల్లెప్రగతి, పట్టణప్రగతి వంటి కార్యక్రమాలు పౌరస్పృహను పెంచాయి. ప్రభుత్వం తమ నిధుల్ని తమకోసమే ఖర్చు చేస్తున్నదనే నమ్మకం ప్రజల్లో కుదిరింది’ అని ఒక సర్పంచ్‌ వివరించారు. 


పరిపాలన రెండు రకాలు!

తాము చేయబోయేదాన్ని  ధైర్యంగా, స్పష్టంగా, బాహాటంగా చెప్పకుండా, లీక్‌ చేసి, జనం నాడి తెలుసుకునే ఎత్తువేసి,  ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించి, అది సాధ్యం కాక, రాజకీయంగా బేజారైతమనుకుంటే జారి, పారిపోవటం!


రాష్ట్ర హితం కోసం తానిది చేయాలనుకుంటున్నట్టు సూటిగా, సుత్తి లేకుండా, ఉన్నదున్నట్టు, బాజాప్తాగా ప్రకటించి, ప్రజాహిత అంశాల్లో రాజకీయ లాభనష్టాల గురించి ఆలోచించబోమని పౌరులకు నివేదించడం, వారి సంపూర్ణ ఆమోదాన్ని, సహకారాన్ని పొందటం!


ఉమ్మడి రాష్ట్రంలో మనం మొదటి తరహా పరిపాలనను చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో రెండో తరహా పరిపాలనను చూస్తున్నాం. 


logo
>>>>>>