మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 13, 2020 , 02:51:06

పౌల్ట్రీకి బాజాప్తా సహకారం

పౌల్ట్రీకి బాజాప్తా సహకారం
  • రాయితీలిస్తే కుంభకోణమంటారా?
  • కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం
  • మక్కల స్కాం దుష్ప్రచారమే
  • భట్టి వ్యాఖ్యలపై మంత్రి ఈటల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నవారికి ప్రభుత్వం పారిశ్రామిక రాయితీలు ఇస్తూ ఉంటుందని.. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉండేదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అలాగే రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న పౌల్ట్రీరంగానికి బేజాప్తాగా కాదు.. బాజాప్తాగా సహకరిస్తామని స్పష్టంచేశారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌ పౌల్ట్రీరంగం గురించి మాట్లాడుతుండగా.. సీఎం కేసీఆర్‌ కలుగజేసుకున్నారు. పౌల్ట్రీరంగంపై కాంగ్రెస్‌ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, రాయితీలు ఇస్తే కుంభకోణం జరిగిందంటూ దుష్ప్రచా రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 


ఇలాంటి తీరుతోనే కాంగ్రెస్‌ను అన్నిఎన్నికల్లోనూ ప్రజలు తిరస్కరించి, టీఆర్‌ఎస్‌కు పట్టం కడుతున్నారని చెప్పారు. ఈ విషయం లో కాంగ్రెస్‌ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవుపలికారు. ‘నాదాన్‌ దుష్మన్‌' తరహాలో కాంగ్రెస్‌ నేతలున్నారని, ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదని అసహనం వ్యక్తంచేశారు. అంతకుముందు మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. తప్పుడు వార్తల వల్లే పౌల్ట్రీరంగం కుప్పకూలిపోయిందని అన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రూ.1000 కోట్లు నష్టం జరిగిందని.. గడిచిన 45 రోజుల్లో తనపౌల్ట్రీయే రూ.10 కోట్లు కోల్పోయిందని తెలిపారు. కోళ్లు, గుడ్లు మంచి ప్రొటీన్‌ అని, ఎలాంటి అనుమానాలు లేకుండా తినాలని.. పరిశ్రమను ఆదరించాలని కోరారు. కాంగ్రెస్‌ పక్షనాయకులు భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా ఈటల తిప్పికొట్టారు.


పౌల్ట్రీరంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చి సాయం చేస్తే.. స్కాంలు జరిగాయని ఆరోపించడం సరికాదన్నారు. పౌల్ట్రీరంగాన్ని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభు త్వం ఎంతో చేసిందని గుర్తుచేశారు. పౌల్ట్రీ వ్యాపారి రామిరెడ్డికి లక్షా 24 వేల మెట్రిక్‌ టన్నుల మక్కలు ఇచ్చినట్టు ఆరోపిస్తున్నారని.. ఆయనకు ఇచ్చింది 62వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమేనని అన్నారు. ఎస్సార్‌ హేచరీస్‌కు కూడా ఇచ్చింది 98,500 మెట్రిక్‌ టన్నులు కాదని.. 35 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమేనని చెప్పారు. పౌల్ట్రీ బ్రీడర్స్‌, రైతులకు కలిపి వినియోగం ప్రకారమే మక్కలు కేటాయించినట్టు తెలిపారు. మక్కలపై ఒక్కపైసా కూడా సబ్సిడీ ఇవ్వలేదని.. టన్నుకు రూ.18 వేల చొప్పున విక్రయించామని తెలిపారు. ఎవరికీ ఉచితంగా ఇవ్వలేదని, వందల కోట్ల స్కాం జరిగిందనడం అర్థరహితమని ఈటల కొట్టిపారేశారు.


logo
>>>>>>