గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 11:05:07

భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదు: సీఎం కేసీఆర్‌

భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదు: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఉదయం సభ ప్రారంభంకాగానే దీనిపై తీర్మానం ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్‌ చర్చను ప్రారంభించారు. అనంతరం అన్ని పక్షాల అభిప్రాయం మేరకు తీర్మానాన్ని ఆమోదించనున్నారు. 

'పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పార్లమెంట్‌లో కూడా సీఏఏ బిల్లును టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించింది. వందల సంవత్సరాల మెట్రో పాలిటన్‌ కల్చర్‌ ఉన్న దేశంలో మన వైఖరేంటో చెప్పాల్సిన అవసరం ఉంది. విశ్వమానవ సౌభ్రాతృత్వం కోరుకుంటున్న సమయంలో ఇలాంటి చట్టాలు దేశ ప్రతిష్టను దిగజారుస్తాయి.  కేరళ, పంజాబ్‌, ఢిల్లీ, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీల్లో కూడా సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయి. దేశంలో మొదటగా సీఏఏకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం చేసిందని' సీఎం వివరించారు.  

'దేశ జీడీపీకి అతి ఎక్కువ దోహదపడే అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తీర్మానంలో సోదాహరణంగా వివరించాం. గోలీమారో నినాదాలు బాధ కలిగించాయి.  సీఏఏ కారణంగా దేశ ప్రతిష్ట మంటగలుస్తోంది. లౌకిక, ప్రజాస్వామ్యవాదులు సీఏఏపై తమ తమ పద్ధతుల్లో నిరసనలు తెలుపుతున్నాయి. సీఏఏ చట్టం దేశవ్యాప్తంగా అనుమానాలకు ఆందోళనలకు దారితీసింది. సీఏఏపై కేంద్రం పునఃసమీక్షించుకోవాలి. స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ, ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తున్నామని' కేసీఆర్‌ పేర్కొన్నారు. 


logo