బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 17:40:51

సజల, సుజల, సస్యశ్యామల తెలంగాణను చేసే వరకు విశ్రమించను

సజల, సుజల, సస్యశ్యామల తెలంగాణను చేసే వరకు విశ్రమించను

హైదరాబాద్‌: 'నిరుద్యోగ యువతను మోసం చేయడం మానుకోవాలి. నిరుద్యోగులను అడ్డంపెట్టుకుని ఎంతకాలం మోసం చేస్తారని' ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు.  శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌  మాట్లాడారు. 

'వాస్తవాలు చెబితే ప్రజలు గౌరవిస్తారు. దేశంలో తొలిసారిగా అభివృద్ధి పనుల ఖర్చుల వివరాలు బహిరంగంగా వెల్లడించాం. ప్రజల సమస్యలే ఇతివృత్తంగా..పరిష్కారం కోసం పనిచేస్తున్నాం. హైదరాబాద్‌ పరిధిలో అభివృద్ధి పనులకు రూ.10వేల కోట్లు కేటాయించాం. వందశాతం రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తాం. కరోనా..ఆర్థిక మాంద్యం పీడిస్తున్నా..వనరులు బాగానే ఉన్నాయి. ఏడాదిలో గోదావరి నుంచి 530 టీఎంసీలు తీసుకునే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. హైదరాబాద్‌ పరిధిలో అభివృద్ధి పనులకు రూ.10 వేల కోట్లు కేటాయించాం. ఎగువ, దిగువ రాష్ట్రాల సమన్వయంతో ప్రాజెక్టులు చేపడుతున్నామని' సీఎం వివరించారు. 

రైతును రాజు చేసే వరకు ఖర్చుకు వెనుకాడేదిలేదు. 

 'పేగులు తెగేదాకా కొట్లాడి తెలంగాణ తెచ్చింది టీఆర్‌ఎస్‌ పార్టీ.  తెలంగాణ రైతులు, ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం రానివ్వం. 530 టీఎంసీలు గోదావరి నుంచి ఢంకా భజాయించి తీసుకుంటాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎన్నో కేసులు వేశారు. మిషన్‌ కాకతీయ చాలా వరకు పూర్తయింది. రెండేళ్లలో 1200 చెక్‌ డ్యాంలు పూర్తి చేయబోతున్నాం. వ్యవసాయ రంగం ద్వారా జీఎస్డీపీ పెంచే ప్రయత్నం చేస్తున్నాం. రైతును రాజు చేసే వరకు ఖర్చుకు వెనుకాడేదిలేదు. సజల, సుజల, సస్యశ్యామల తెలంగాణను చేసే వరకు విశ్రమించను' అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 


logo