శనివారం 30 మే 2020
Telangana - Apr 07, 2020 , 02:39:21

పైసల కంటే ప్రాణాలే ముఖ్యం

పైసల కంటే ప్రాణాలే ముఖ్యం

  • రోజుకు 430 కోట్లు రావాలి  
  • ఐదు రోజుల్లో వచ్చింది ఆరుకోట్లే
  • బతికుంటే బలుసాకు తినొచ్చు  
  • ప్రాణాలు పోతే తేగలమా?
  • మీడియాతో ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఆర్థికంగా నష్టమొచ్చినప్పటికీ.. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పైసలు పోతే పోయినయి.. ప్రాణాలు తేగలమా? అని ప్రశ్నించారు. ‘మన తెలంగాణ సంగతికి వస్తే సగటున రోజుకు రూ.430-440 కోట్ల ఆదాయం రావాల్సి ఉన్నది. మార్చిలో మొద టి 15 రోజులు ఆదాయం వచ్చింది. లాక్‌ డౌన్‌ నుంచి ఏమీరాలేదు. హళ్లికి హళ్లి.. సున్నకు సున్న. ఏప్రిల్‌లో ఆరురోజుల్లో రూ.2300-2500 కోట్ల ఆదాయంరావాలి. కానీ, రూ.6 కోట్లే వచ్చింది. పైసలు పోతే పోయినయి. కానీ సచ్చుడు బతుకుడు చూసుకుంటే మన దగ్గర తక్కువగానే ఉన్నది. గదొక్కటి సంతోషంగా ఉన్నది. మనకు అమెరికా, స్పెయిన్‌, ఇటలీలో ఉన్నట్లుగా శవాల గుట్టలైతే లేవు. బతికుంటే బలుసాకు తిని బతుకుతాం. ఆకలి నుంచి ప్రజల్ని ఏ విధంగానైనా కాపాడుకోవచ్చు. కలోగంజో తాగి బతుకుతాం. ఎకానమీ ఎట్లనైనా చేసుకుంటాం. కష్టపడుతాం. తిరిగి రివైవ్‌ అవుతాం. కానీ, ప్రజల జీవితాలను, బతుకును రివైవ్‌ చేసుకోలేం. అందుకే మనకు ప్రాణాలు ముఖ్యం’ అని సీఎం అన్నారు. 

ఆపదలో ఉన్నవారిని ఆదుకుందాం

‘ఆర్థికంగా ఒడిదుడుకులు, సంక్షోభాలు ఎదురైనప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు ఏమిచేయాలనేదానిపై దేశాలకు పాలసీలు, కార్యాచరణ ఉంటాయి. ఒక దినపత్రికలో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాంరాజన్‌ రాసిన ఆర్టికల్‌లో బాగా విశ్లేషించారు. ‘రెండునెలలు లాక్‌డౌన్‌ తిప్పలు పడాలి. లాక్‌డౌన్‌ ఇంపాక్ట్‌ దేశంపైన చాలా భయంకరంగా ఉంటుంది. దీనిపై ఆర్థిక నిపుణులు, మేధావులు సమాలోచనలు చేయాలి’ అని సూ చించారు. మంచిని కాంక్షించేవాళ్లు ఇలాంటి సూచనలు చేస్తరు. కాబట్టి ప్రధాని కూడా ఆర్థికవేత్తలు, రాష్ర్టాలతో సమావేశాలు నిర్వహించాల్సిందే. ప్రజల ఆరోగ్యం, తిండి, బట్ట, కష్టనష్టాలపై ఆలోచన చేయాలి. ఈ విపత్కర పరిస్థితుల్లో బిర్యానీ తినకున్నా, ఉన్నంతలో తిండికి, పాలకు కొరత లేకుండా, ఇతర సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఒక నెల లాక్‌డౌన్‌ చేసుకుని మూడునెలలు ఆర్థికంగా కష్టాలు పడినా మంచిది కానీ.. ఆగమాగంకావడమెందుకు? ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరు కూడా ఉపవాసం ఉండరాదు. ఎవరైనా ఆపదలో ఉంటే ఎమ్మార్వో, స్థానిక ప్రజాప్రతినిధులకు లేదా ఇతర అధికారులకు సమాచారమివ్వండి. ఏప్రిల్‌ నెలకు 12 కిలోల బియ్యం ఇచ్చాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బియ్యం పంపిణీ చేస్తున్నాయి. రాజకీయాలు వద్దు.. అందరం కలిసి ఎవరికి ఎంత అవసరముంటుందో అంతే సరఫరా చేయాలని ప్రధాని కూడా చెప్పారు. ఏదైనా ప్రజల సొత్తే.. కలిసి పంపిణీ చేస్తం’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

అందరి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నం


‘ట్రాన్స్‌జెండర్స్‌తోపాటు భిచ్చగాళ్లు కూడా లెక్కల్లోకి వచ్చారు. వాళ్లకు కూడా భోజన ఏర్పాట్లుచేస్తున్నారు. ఆకలితో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయా లో అన్నీచేస్తున్నం. మొత్తానికి దుకాణం బందయితే ప్రజలను ఎలా సాదుకోవాలి? ఉద్యోగులకు అప్పులు తెచ్చి జీతాలు ఇవ్వా లి. మొన్న ప్రధాని ఎంపీ లాడ్స్‌ ఇవ్వొద్దు అనుకుంటున్నం.. వేతనాల్లో 30% కోత పెడుదామనుకుంటున్నం అన్నారు. 30% ఎందుకు 50% కోత పెట్టమని చెప్పిన. మేం 75% కోత విధించినమని చెప్పిన. ఎల్లుండి అన్నిపార్టీల ఫ్లోర్‌లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ఉన్నది. ఈ కాన్ఫరెన్స్‌లో మా పార్టీ నుంచి కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు పాల్గొంటారు. వేతనాల్లో కోతను సపోర్ట్‌ చేయాలని చెప్పాను. దేశంముందు వేరే గత్యంతరం లేదు. ఉన్నంతలో మన మార్గాలు మనం వెతుక్కొని ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని చాలా సంయమనంతోని ధీరత్వాన్ని ప్రదర్శించాల్సిన సమయమిది’ అని సీఎం చెప్పారు.


logo