మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 02:11:25

లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నాం.. ఇస్తున్నాం

లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నాం.. ఇస్తున్నాం
  • నిరుద్యోగ భృతి ఈఏడాది సాధ్యంకాదు: సీఎం

‘ఇంటికో ఉద్యోగం ఇస్తామని అనలేదు. ఇదే సభలో నిలబడి చెప్పాను. వాళ్లు యువతను పెడదారి పట్టించేమాటలు మాట్లాడుతున్నారు’ అని  సీఎం కేసీఆర్‌ అసహనం వ్యక్తంచేశారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలే లేవని చెప్పానని, 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలపై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఉద్యమసభల్లో కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదని, ఇతరప్రాంతాల వాళ్లు పోతే మనకు లక్ష ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పామని, 50 వేల ఉద్యోగాలు భర్తీచేశామని, ఈ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. పోలీసు నియామకాలు కూడా కలిపితే 80 వేల మందికి ఉద్యోగాలు లభించినట్టని వివరించారు. 


ప్రభుత్వ ఉద్యోగాలు వేలల్లో ఉంటాయని, ప్రైవేట్‌లో లక్షల మంది పనిచేస్తున్నారని.. ఐటీరంగంలో ఏడు లక్షల మంది పనిచేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో ఇతర పరిశ్రమల్లో ఎనిమిది లక్షల మంది, భవననిర్మాణ రంగంలో సుమారు 15 లక్షల మంది పనిచేస్తున్నారని వివరించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా గోల్‌మాల్‌ చేస్తే వచ్చేదేమిటని ప్రశ్నించారు. ‘నిరుద్యోగ భృతిపై ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినం. దాన్ని అమలుచేస్తం.  ఆర్థికమాంద్యం నేపథ్యంలో నిరుద్యోగభృతి ఈ ఏడాది అమలుచేయం. నిరుద్యోగి ఎవరనేది గందరగోళంగా ఉన్నది. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పరిశీలించి అమలుచేస్తాం’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.


తెలంగాణలో సుస్థిరాభివృద్ధి

తెలంగాణ రాష్ట్రం సుస్థిరాభివృద్ధి సాధించిందని నీతిఆయోగ్‌ ప్రశంసించిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 2004 నుంచి 2014 వరకు  క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ తెలంగాణలో రూ.59 వేల కోట్లుంటే, గత ఐదేండ్లలో 1.6 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. ఇది కాంగ్రెస్‌కు, టీఆర్‌ఎస్‌కు ఉన్న తేడా అని వివరించారు. జీఎస్డీపీలో అప్పుడు రూ.4 లక్షల కోట్లు ఉంటే, ఈ రోజు రూ.8.66 లక్షల కోట్లు ఉందని, 2020-21లో రూ.9.5 లక్షల కోట్లకు వెళ్తుందని కాగ్‌ అంచనా వేస్తున్నదని చెప్పారు. 


logo
>>>>>>