సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 02:23:05

భగీరథ దేశానికే స్ఫూర్తి

భగీరథ దేశానికే స్ఫూర్తి
  • భగీరథ ఆర్కిటెక్ట్‌ని నేనే..
  • ఈ పథకంలో నేను జీవించిన..
  • నల్లగొండలో ఫ్లోరైడ్‌ను పారదోలినం
  • రాజగోపాల్‌ సంతకం అబద్ధమా?..
  • ఇలాంటివాళ్లు సభలో అవసరమా?..
  • స్పీకర్‌ ఆలోచించాలి: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మిషన్‌ భగీరథ ఒక అద్భుతమైన స్కీం అని సీఎం కేసీఆర్‌ అన్నారు. దాని డిజైన్‌ అర్కిటెక్ట్‌ను తానేనని పునరుద్ఘాటించారు. ఈ పథకాన్ని చూసి యావత్‌ భారతదేశం ఆశ్చర్యపోయిందని.. పదకొండు రాష్ర్టాలు ప్రశంసించాయని చెప్పారు. కేంద్రం కూడా ఈ స్కీంను స్ఫూర్తిగా తీసుకొని 2024 కల్లా దేశమంతా నీళ్లిస్తమని చెప్పిందని గుర్తుచేశారు. ఇంతమంచి స్కీంను చూసి కాంగ్రెస్‌ సభ్యులు విమర్శించారని.. సమాధానం చెప్తే వినే దమ్ములేక పారిపోయారని ఎద్దేవాచేశారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లోని ప్రజలు ఎలాంటి నీళ్లు తాగుతున్నారో.. మిషన్‌ భగీరథతో అదిలాబాద్‌ అడవి బిడ్డలు, నల్లగొండ ఫ్లోరైడ్‌ ప్రాంతాల ప్రజలు, ఖమ్మం జిల్లా కోయ ప్రజలు, అమ్రాబాద్‌ అడవి బిడ్డలు కూడా అవే నీళ్లు తాగుతున్నారన్నారు.  


‘నేను ఆధారాలు మొత్తం తెచ్చిన. ఆ పథకంలో నేను జీవించిన. నేను శాసనసభ్యుడిగ ఉన్నప్పుడు లోయర్‌మానేరు డ్యాం నుంచి నీళ్లు తెచ్చి సిద్దిపేటకు ఇచ్చిన. దానిని తెలంగాణ అంతట విస్తరించినం. దాని డిజైన్‌, ఆర్కిటెక్ట్‌ నేనే. ఆయన (రాజగోపాల్‌రెడ్డి) ఎమ్మెల్యేగా ఉన్న నల్లగొండ జిల్లాల ఫ్లోరైడ్‌ నీళ్లు తాగి ప్రజలకు నడుములు వంగిపోయినయి. అది వీళ్ల (కాంగ్రెస్‌) పరిపాలన పుణ్యమే. మిషన్‌ భగీరథకు అక్కడనే శిలాఫలకం వేసిన. స్వయానా భారత జలశక్తి మంత్రిత్వశాఖ నుంచి సంబంధిత వైద్యులు వచ్చి పరీక్షలు చేసినరు. మిషన్‌ భగీరథ పుణ్యాన నల్లగొండల ఫ్లోరైడ్‌ బంద్‌ అయిందని ప్రకటించినరు. ఆయన మిషన్‌ భగీరథ నీళ్లు తాగి, ఎమ్మటి తెచ్చుకున్న బాటిల్‌ నీళ్లను కూడా పడేసినరు’ అని సీఎం అన్నారు.  


ఆయన సంతకం అబద్ధమా? మాటలు అబద్ధమా?

మిషన్‌ భగీరథ కింద మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఆవాసానికి నీళ్లు వచ్చాయంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన సంతకం అబద్ధమా? అని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ నల్లా వచ్చిందని సర్పంచ్‌ సంతకంతోకూడిన గ్రామ పంచాయతీ తీర్మానం, ఆయా నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో ఈ పథకం కింద నీళ్లొచ్చాయని ఎమ్మెల్యేల సంతకాలు తీసుకురావాలని చెప్పగా.. ఇప్పటికే 8,600 పైచిలుకు గ్రామపంచాయతీల తీర్మానాలు కూడా వచ్చాయన్నారు. ఎవరైతే ఇష్టమొచ్చినట్లు పిచ్చికూతలు కూసినారో (ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డి) ఆయన నియోజకవర్గంలో కూడా 334 ఆవాసాల్లో మిషన్‌ భగీరథ నీళ్లు వచ్చినట్టు గ్రామపంచాయతీల తీర్మానాలు ఉన్నాయని చెప్పారు. 


‘ఇంకా గొప్పతనం ఏందంటే.. ఆ నియోజకవర్గంలోని చండూరు, చౌటుప్పల్‌, మర్రిగూడ, మునుగోడు, నాంపల్లి, నారాయణపూర్‌ మండలాల్లోని అన్ని గ్రామాలకు నీళ్లొచ్చినట్లుగా ఇప్పటిదాకా వీరంగం ఎత్తి, చొక్కాలు చింపుకొన్న శాసనసభ్యుడి సంతకం కూడా ఉన్నది. మర్రిగూడలోని 12,492 ఇండ్లకు కనెక్షన్లు ఇచ్చినట్లు సంతకం పెట్టినరు. మరి ఇది అబద్ధమా? ఇంతకుముందు ఆయన మాట్లాడింది అబద్ధమా? తేలాలి. స్కీం తప్పుడుదైతే ఏ సర్పంచయినా కాళ్లు మొక్కినా సంతకాలు చేస్తడా? ఊరోళ్లు ఆయన్ని తంతరు. నిజంగా నీళ్లు రాకుంటే మా ఎమ్మెల్యేలు ఊరుకుంటరా? మమ్మల్ని అడుగరా? మా మంత్రిని బతకనిస్తరా?’ అని సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మిషన్‌భగీరథ కింద ఉన్న 37వేల పైచిలుకు ట్యాంకుల్లో 18,500 వరకు పాతవని, మిగిలినవి తమ ప్రభుత్వ హయాంలో కట్టామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.


వనపర్తికి సంబంధించి రామన్‌పాడు నుంచి ఇన్‌టేక్‌ పాయింట్‌ పెట్టారని, ఇప్పటికే జూరాల దగ్గర తండ్లాట జరుగుతున్నందున అది శాశ్వతం కాదని, శ్రీశైలం దగ్గర ఇన్‌టేక్‌ పాయింట్‌ పెట్టాలని తానే సూచించానని తెలిపారు. ‘ప్రతి సందర్భంలో అడ్డగోలుగా మాట్లాడినరు. ఇంత దుర్మార్గంగా, సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడే వ్యక్తులు ఈ సభలో ఉండొచ్చునా? తీసి అవతల పారేద్దామా? ఆలోచన చేయాలి. ఎక్కడనో ఓకాడ సురుకు తగులాలి. శాసనసభ అత్యున్నత ప్రజాస్వామ్యవేదిక. ప్రజాసమస్యలు చర్చించాలిగానీ ఆక్రోశాలు వెళ్లగక్కే వేదిక కాదు. అడ్డం, పొడుగు వీరంగాలు వేసే వేదిక కాకూడదు. గతంలో కూడా గవర్నర్‌ మీద వీళ్ల (కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డ్డి) అన్న మైకు విసిరేస్తే బహిష్కరించినం. ఎక్కడ్నో దెబ్బ కొట్టకపోతే ఇది మంచిది కాదు. ఏం అక్కరుంది.. ఈ సంతకం అబద్ధమా? నేను చెప్పింది అబద్దమా? తేలాలి. 


స్పీకర్‌ కూడా తీవ్రంగా పరిగణించి మా హక్కుల్ని కాపాడాలి. ఒక్కర్ని కాదు.. మంత్రులు, అందరి మీద కోపానికి వచ్చుడే. పరిశీలన చేయండి, మీ చాంబర్‌కు సంబంధిత మంత్రి, ఈఎన్సీ, అధికారులందరినీ పిలిపించి మాట్లాడి, విచారణచేయండి. ఇలాంటివి సహించకూడదు. సభ తరఫున కోరుతున్నం.. సభను ఇంత ఘోరంగా తప్పుదోవ పట్టించే వ్యక్తులు సభలో ఉండేందుకు అర్హులా? కఠిన చర్యలు తీసుకోవాలి. మీరే నిర్ణయం తీసుకోవాలి’ అని సీఎం కేసీఆర్‌ సభాధిపతిని కోరారు. సభలో సభ్యులు ఏదిపడితే అది మాట్లాడకుండా రూల్స్‌ తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.  ఎవరిని పడితే వారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, దానికి పద్ధతి ఉండదా అని ప్రశ్నించారు. సింగపూర్‌లో ఎవరైనా ఆరోపణచేస్తే చేసినవారే రుజువుచేసేలా రూల్‌ ఉన్నదని.. ఆ రూల్‌ను పరిశీలించాలని కోరారు. 


జిల్లాలపైనా ఉల్టా మాటలే

జిల్లాల ఏర్పాటుపైకూడా రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా సీఎం కేసీఆర్‌ ఆగ్రహించారు. 33 జిల్లాల ఏర్పాటు వద్దని కాంగ్రెస్‌ అంటే, తమకు జిల్లాలు కావాలని ఆ పార్టీకి చెందిన నేతలే భిన్న డిమాండ్లు వినిపించారని గుర్తు చేశారు. కొందరు వద్దని, మరికొందరు కావాలని అంటున్నారని, వాళ్లలో వాళ్లకే బేదాభిప్రాయాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ములుగు జిల్లా కావాలని, గద్వాల జిల్లా కావాలని కాంగ్రెస్‌ నేతలు చేసిన డిమాండ్‌ను గుర్తుచేశారు. ములుగు జిల్లా ఏర్పాటు సమయంలో ఛత్తీస్‌గఢ్‌ సీఎస్‌ తనకు ఫోన్‌చేసి ప్రశంసించారని గుర్తు చేశారు.  తెలంగాణ స్ఫూర్తితో ఏపీలో కొత్తగా 25 జిల్లాలు ఏర్పాటుచేసే అవకాశం ఉన్నదని చెప్పారు. 


30 ఏండ్ల వరకు సమృద్ధిగా తాగునీరు

దేశానికే స్ఫూర్తిగా నిలిచిన మిషన్‌ భగీరథ పథకం వల్ల రాష్ట్రంలో రాబోయే 30 ఏండ ్లవరకు తాగునీటికి ఢోకా ఉండదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. పట్టణ, గ్రామీణ, పారిశ్రామిక అవసరాలకు నీళ్లు సరఫరాచేసేలా మిషన్‌ భగీరథ పథకాన్ని తీసుకొచ్చామని వివరించారు. నిర్మాణంచేసి వదిలేయకుండా, నిరంతరం సక్రమంగా నిర్వహణ కొనసాగేలా తీర్చిదిద్దిన ఇలాంటి పథకం నిర్వహణకు నిధులు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘాన్ని విజ్ఞప్తిచేశామని చెప్పారు. మిషన్‌ భగీరథ నిర్వహణ కోసం 2,700 మంది సిబ్బంది ఉన్నారని, వారి సంఖ్యను ఇంకాపెంచి సమర్థంగా నిర్వహించేందుకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు.


భగీరథతో ఫ్లోరైడ్‌ బంద్‌

నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు లోయర్‌ మానేరు డ్యాం నుంచి నీళ్లు తెచ్చి సిద్దిపేటకు ఇచ్చిన. దానిని తెలంగాణ అంతట విస్తరించినం. దాని డిజైన్‌ ఆర్కిటెక్ట్‌ నేనే. ఆయన (రాజగోపాల్‌రెడ్డి) ఎమ్మెల్యేగా ఉన్న నల్లగొండ జిల్లాల ఫ్లోరైడ్‌ నీళ్లు తాగి ప్రజలకు నడుములు వంగిపోయినయి. అది వీళ్ల (కాంగ్రెస్‌) పాలన పుణ్యమే. మిషన్‌ భగీరథకు అక్కడనే శిలాఫలకం వేసిన. స్వయా నా భారత జలశక్తి మంత్రిత్వశాఖ నుంచి సంబంధిత వైద్యులు వచ్చి పరీక్షలు చేసినరు. మిషన్‌ భగీరథ పుణ్యాన నల్లగొండల ఫ్లోరైడ్‌ బంద్‌ అయిందని ప్రకటించినరు. మిషన్‌ భగీరథ నీళ్లు తాగి.. ఎమ్మటి తెచ్చుకున్న బాటిల్‌ నీళ్లను కూడా పడేసినరు.


కరోనా రానీయం.. యుద్ధం చేస్తం


రాష్ట్రంలో కరోనా లేదని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ‘కరోనా వస్తే మాస్క్‌లు ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నరు.. ఇక్కడ ఒక్కరి కన్నా మాస్క్‌ ఉన్నదా? మాస్క్‌ లేకుంటే సచ్చిపోతరా? వైద్యార్యోగశాఖ మంత్రి కూడా సభకు వచ్చారు. ఆయనకు మాస్క్‌లేదు కదా’ అని సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 31 మందికి వస్తే అందులో ఒక్కరు మా త్రమే మన రాష్ట్రానికి వచ్చారని, వచ్చిన అతనిని మంత్రి ఈటల రాజేందర్‌ వెంటనే దొరకబట్టి గాంధీ దవాఖానలో చికిత్స చేయిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క మనిషికి కూడా కరోనా రాలేదని, అవసరమైతే రూ.వెయ్యి కోట్లు ఖర్చుపెట్టి అయినా సరే కరోనా రానీయం. వస్తే ఎదుర్కొంటాం అని సీఎం కేసీఆర్‌ సభకు స్పష్టం చేశారు. ‘నాకు ఒక సైంటిస్ట్‌ ఫోన్‌చేసి కరోనా వస్తే హైరానా పడాల్సినపని లేదు. జ్వరం వచ్చినప్పుడు వేసుకొనే పారాసిటమాల్‌ వేస్తే సరిపోతుందని చెప్పారు’ అని సీఎం పేర్కొన్నారు. 22 డిగ్రీల ఉష్ణోగత్రలు దాటితే వైరస్‌ బతుకదని, మన దగ్గర 30 డిగ్రీలు ఉన్నదని, రమ్మన్నా కరోనా రాదని చెప్పారు.


కరోనాను రానీయం

దేశవ్యాప్తంగా 31 మందికి కరోనా వస్తే అందులో ఒక్కరే మన రాష్ట్రానికి వచ్చారు. అతనిని మన ఈటల రాజేందర్‌ దొరకబట్టి గాంధీ దవాఖానలో చికిత్స చేయిస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క మనిషికి కూడా కరోనా రాలేదు. అవసరమైతే వేయి కోట్లు ఖర్చు పెట్టి అయినా సరే కరోనా రానీయం. వస్తే ఎదుర్కొంటాం. నాకు ఒక సైంటిస్ట్‌ ఫోన్‌ చేసి కరోనా వస్తే హైరానా పడాల్సిన పనిలేదు. జ్వరం వచ్చినప్పుడు వాడే పారాసిటమల్‌ వేస్తే సరిపోతుంది అని తెలిపారు. 22 డిగ్రీల ఉష్ణోగత్రలు దాటితే వైరస్‌ బతకదు. మన దగ్గర 30 డిగ్రీలు ఉన్నది. రమ్మన్నా కరోనా రాదు. 


logo