శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 06, 2020 , 03:20:46

మేలోనే టెన్త్‌ పరీక్షలు

మేలోనే టెన్త్‌ పరీక్షలు

  • నేటినుంచి ఇంటర్‌ వాల్యుయేషన్‌
  • 1 నుంచి 9వ తరగతి దాకా పరీక్షలు రద్దు
  • పై తరగతులకు  ప్రమోషన్‌ .. విద్యాశాఖ ఉత్తర్వులు 
  • భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తాం
  • అవసరమైతే పరీక్షా కేంద్రాలు పెంచుతాం
  • విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతాం
  • వచ్చే విద్యాసంవత్సరంపై త్వరలోనే నిర్ణయం
  • మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన పదో తరగతి పరీక్షలను ఈ నెలలోనే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. మార్చిలో మూడు పరీక్షలు నిర్వహించిన తర్వాత కరోనా భయాలతో హైకోర్టు ఆదేశాలమేరకు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంకా ఎనిమిది పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మంగళవారం క్యాబినెట్‌ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్‌ హైకోర్టు సూచించిన నిబంధనల ప్రకారం మిగతా 8 పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్షలపై సీఎం మాట్లాడుతూ గతంలో ఏర్పాటుచేసిన దాదాపు 2500 పరీక్షా కేంద్రాలను అవసరమైతే 5000కు పెంచుతాం. ఇంకా అవసరమైతే 5500 చేస్తాం. భౌతిక దూరం పాటిస్తూ ఒక హాల్‌లో తక్కువ విద్యార్థులుండేలా ఏర్పాట్లు చేస్తాం. పరీక్ష గదులను పూర్తిగా శానిటైజ్‌ చేస్తాం. 

పరీక్ష రాసే విద్యార్థులకు మాస్కులు అందిస్తాం. దీనిపై విద్యాశాఖ మంత్రి నిర్ణయం తీసుకుంటారు. పరీక్షల నిర్వహణపై క్యాబినెట్‌ నిర్ణయం తీసుకొని అడ్వకేట్‌ జనరల్‌కు ఆదేశాలిచ్చింది. తక్షణమే కోర్టులో అప్లయ్‌ చేయమన్నాం. సీజే ముందు అప్లయ్‌ చేసి కన్సంట్‌ తీసుకోమన్నాం. కోర్టు కూడా పర్మిషన్‌ ఇస్తుందని భావిస్తున్నాం. పిల్లలు, తల్లిదండ్రులు టెన్షన్‌లో ఉన్నారు. వీరికోసం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటాం. విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటుచేసి. పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లి మళ్లీ తీసుకొస్తాం. ధనవంతుల పిల్లలుంటే వాళ్లకు స్పెషల్‌ కారు పాసులు కూడా ఇస్తాం. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎస్‌ఎస్‌సీ పరీక్షలను మే నెలలోనే పూర్తి చేస్తాం. ఎందుకంటే ఎస్‌ఎస్‌సీ ఆధారంగానే ఇతర అడ్మిషన్స్‌, ఇంటర్మీడియట్‌ చదువు ఆధారపడి ఉంటుంది అని సీఎం పేర్కొన్నారు.


ఇంటర్‌ స్పాట్‌ షురూ..

ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి కాబట్టి పేపర్లు దిద్దే కార్యక్రమం, స్పాట్‌ వాల్యుయేషన్‌ బుధవారం నుంచి ముమ్మరంగా చేపడతామని సీఎం తెలిపారు. ఇంటర్‌ విద్యార్థులకు కూడా ఇబ్బందులు లేకుండా చేస్తాం. విద్యాశాఖ మంత్రి, కార్యదర్శి, క్యాబినెట్‌ సబ్‌ కమిటీ కూర్చుని ఫైనల్‌ చేస్తారు. ఇందుకోసం ఏ పద్ధతిని ఫాలో కావాలనే విషయంలో ఒక మాడ్యుల్‌ తయారు చేస్తారు. కరోనాతో మనం కలిసి బతకాల్సిందే. కాకపోతే కాస్త తెలివి కావాలె. ఉపాయమున్నోడు అపాయం నుంచి తప్పించుకుంటాడు. కాబట్టి మనం ఉపాయంతో బతకాలె. తెలివిని ఇప్పుడు మనం సంతరించుకోవాలె. రేపో ఎల్లుండో పోయే గండం కాదు. ఇది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పటివరకూ కొంత ఉపాయంతో రక్షించుకున్నాం. ఇక నుంచి ఉపాయంతో మనల్ని మనమే రక్షించుకోవాలె. ఎవరో వచ్చి మనల్ని కాపాడరు. పదో తరగతి పరీక్షలను నిర్వహించడంతో పాటు ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ పూర్తి చేస్తాం. వచ్చే అకమిక్‌ ఇయర్‌ పదిహేను రోజులు ఆలస్యమవుతదా? జూన్‌కే ఉంటదా? జూలైకి పోతదా? ఏది ఉత్తమం? ఎట్లా చేయవచ్చు? రాష్ట్రం, దేశంలో కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని షార్ట్‌ పీరియడ్‌లో డిక్లేర్‌ చేస్తాం అని ముఖ్యమంత్రి వివరించారు.  


logo