గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 02:02:42

పరిస్థితులు మారుతాయి

పరిస్థితులు మారుతాయి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులు బాగుండాలె, గ్రామాలు మంచిగుండాలె, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠం కావాలన్నదే తన ఆలోచన అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. జనగామ జిల్లాలో రైతువేదిక ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ పరిస్థితులు ఎప్పుడూ ఒక్కతీరు ఉండయి. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు మనలను ఎవరైనా పట్టించుకున్నరా? రైతుబంధు, రైతుబీమా ఎవరన్న పెట్టిన్రా? 24 గంటల కరంటు ఇచ్చిన్రా? ఎరువులు పోలీస్‌స్టేషన్ల పెట్టి సరఫరా చేశిన్రు. రెండుమూడు రోజులు చెప్పులు లైన్లల్ల పెట్టి ఎరువులు తెచ్చుకున్నం. ఇప్పుడు కాలం మారలేదా? తెలంగాణ వచ్చినంక ఇవన్నీ మారలేదా? రైతులు కొద్దిగ నిమ్మలం అయితున్నరు కదా? ఇంకా కావాలె. నేను కేసీఆర్‌గా కోరేదొక్కటే.. రైతులు బాగుండాలె. గ్రామాలు మంచిగుండాలె. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠం కావాలె. ఇప్పటికీ నడుస్తున్న కులవృత్తులు బలోపేతం కావాలె.  కేసీఆర్‌ మొండోడని మీకు తెలుసు. కిరికిరిగాళ్లకు ఏం పని ఉండది? పొద్దుగాళ లేస్తనే ఏదో ఒక పంచాయితీ కావాలె. మొన్న ఇదే వరంగల్‌ జిల్లాల ఒకడు ధర్నా చేసిండు. గొర్రెలు పంచుమని నన్ను ఎవరు అడిగిన్రండి? ధర్నా చేసిన సిపాయి నాకేమన్నా దరఖాస్తు ఇచ్చిండా? పింఛన్‌ రూ.2వేలు ఇయ్యమని ఎవరు చెప్పిన్రు? ఇయ్యాల దయాకర్‌రావు పల్లె ప్రకృతి వనానికి తీసుకపోయిండు. చూసి చాలా ఆనందపడ్డా. ప్రతి ఊరికి నర్సరీ వస్తదని జిందగీల అనుకున్నమా? కలగన్నమా? మంచినీళ్లకు ఎంత బాధలు పడ్డం. ఇప్పుడు ఎంత మంచిగ నీళ్లు వస్తున్నయి. ఎవరన్న ధరఖాస్తు వెట్టి అడిగిండ్రా? మేము కూడా పెదవులు సప్పరియొచ్చు. అట్ల చేయలే. ఐదేండ్లల్ల మారుమూల తండాలకు కూడా నీళ్లు ఇస్తమని చాలెంజ్‌ చేసిన.. నెరవేర్చిన. 

సర్పంచ్‌లందరికీ సెల్యూట్‌

పల్లె ప్రగతి కార్యక్రమంలో సర్పంచుల నాయకత్వంలో మీరే కష్టపడి బాగుచేసుకున్నరు. ఇప్పుడు పల్లెలకు మొఖం తెలివొచ్చింది. ఇప్పుడు వైకుంఠధామాలు కట్టినం. డంప్‌ యార్డు తయారైంది. జిందగీల అనుకుంటిమా? సర్పంచ్‌లందరికీ సెల్యూట్‌ చేస్తున్నా. అధికారులను అభినందిస్తున్నా. ఈ ఐకమత్యమే రైతుల్లో రావాలె. హైదరాబాద్‌ నుంచి ఒక మెసేజ్‌ రైతుబంధు కమిటీలకు వస్తే 2,600 క్లస్టర్లు ఫాలో అయితరు. రైతుల ఐకమత్యం చూపిస్తరు. నిండు మనసుతోని ఒక రైతుగా చెప్తున్నా.. నేను కలగనే రైతురాజ్యం వచ్చి తీరుతది. రేపు రైతుబంధు కమిటీల ఆధ్వర్యంలో మార్కెట్‌లో జోకెటోడెంత? కొలిశేటోడెంత? తెలుసుకొని ఏ ఊరు ఏ రోజు మార్కెట్‌కు పోవాలో నిర్ణయం అయితది. బాధ లేకుండా రెండు గంటల్లో కాంటా అయిపోయి పైసలు తీసుకొని వాపస్‌ వస్తరు.

ఏం చేయాలో చెప్పనా!

నేను కాపోన్నే. నేను సన్న వడ్లు వేసిన. నా పొలంలో పది ఎకరాలు సన్న వరి తెలంగాణ సోన ఏసిన. పెద్దవానలు పడి మిషన్లు దిగబడుతున్నాయి. నేను ఇంకా పొలం కోయలేదు. ఈ వారంలో వస్తయి సన్నాలు. నేను ఊకుంటనా? నిర్ణయం చేయనా? సన్నాలు వేయమని చెప్పినోడిని ఏం చేయాలో చేయనా? రాకముందే, కాకముందే.. బజార్ల పడి ధర్నాలు చేసినట్లు, పొలం కాలబెట్టినట్లు గిన్ని దొంగ మాటలా. ఇది విధానమా. నిర్మాణాత్మకంగా పనిచేసే రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీలు చేసే పద్ధతేనా. దయచేసి ఆలోచన చేయాలె. వాళ్లకు ఓట్లు కావాలె. ఏం చేసినా కేసీఆర్‌ను బద్నాం చేయాలె. నిజాయితీలేని ప్రభుత్వాన్ని చేయగలుగుతవు. గుండెలనిండ నిజాయితీ ఉన్న ప్రభుత్వాన్ని ఏం చేయగలుగుతవు? ఎన్ని రకాల అపవాదులు, ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తరంటే.. వీటన్నింటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. భయకంరమైన మోసాలు చేస్తరు జాగ్రత్త!

ధర్నాలు ఎవని కడుపు నింపినయి

తెలుగుదేశం అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ ధర్నా. కాంగ్రెస్‌ ఉంటే టీడీపీ ధర్నా. ఈ ధర్నాలు ఎవరి కడుపు నింపినయి. ప్రభుత్వం ఎప్పుడన్నా బస్‌ కిరాయిలు పెంచితే ధర్నా చేస్తరు. వాళ్లే అధికారంలోకి వచ్చినంక ఒక్క పైసానన్న తక్కువ చేస్తడా? మరి ఎందుకు ఈ పిచ్చి ధర్నాలు? కాబట్టి రైతుల మధ్య అపార్థాలు పెట్టి, తగాదాలు పెట్టి ఐక్యత రాకుండా చేసే శక్తులుంటయి. సన్నవడ్లు ఏస్తే మార్కెట్‌లో మంచి ధర వస్తదని చెప్పిన. కేసీఆర్‌ కదా కచ్చితంగా దొరికిపిస్త. రూ.1880కి దొడ్డు వడ్లు కొంటున్నరు. సన్నవాటితోని నూరు నూటాయాబై అన్నా ఎక్కువ రావాలె కదా. వందశాతం ఇప్పిస్తా. దానికి అనుమానమే అవసరం లేదు.

ఇందుకు ఏ పద్ధతి అవలంబించాల్నో ఏం ప్యాకేజీ పెట్టాల్నో, భారత ప్రభుత్వం పెట్టిన ఆంక్ష ఎట్లా అధిగమించాల్నో ఇప్పుడే సీఎస్‌, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన్రు. కానీ కిరికిరిగాళ్లు ఉంటరు కదా. వాళ్ల కథ ఎట్లుంటదో తెల్సా. షబ్బీర్‌ అలీ అని కాంగ్రెస్‌ మాజీ మంత్రి. మెదక్‌ జిల్లాల్లో జప్తిశివునూరు అనే గ్రామం ఉంది. సర్వే నంబర్లు 408 నుంచి 413 దాకా ఆయన భూములే. ఫామ్‌హౌజ్‌లో వరి వేశారు. పంట కోసుకున్నరు అయిపోయింది. ఒట్టి గడ్డి కాలబెట్టిండ్రు. సన్న వడ్లు నువ్వు పెట్టుమంటేనే పెట్టిన, నేను నష్టపోయిన అని డ్రామా మొదలు పెట్టిన్రు. రైతులు పంట కాలబెట్టినట్లు ప్రచారం చేసిన్రు. ఇది షబ్బీర్‌అలీ కథ. గింత దొంగ ముచ్చట్లా. ఇదేనా రైతులకు మార్గం చూపేది. ఆ దిక్కుమాలిన సోషల్‌ మీడియా ఒకటి. అది యాంటీ సోషల్‌ మీడియా అయిపోయింది. డ్రామా మొదలు పెట్టాలె ప్రజలను మోసం చేయాలె. అమాయక రైతులు చూసి అబ్బ నిజంగానే రైతులు ఎంత ఆగం అయితున్నరు అనుకోవాలె’ అని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు.