గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 01:38:14

అత్యవసర సేవలు యథాతథం

అత్యవసర సేవలు యథాతథం

  • సరుకు రవాణా వాహనాలకు  అనుమతి    
  • ప్రజారవాణా వాహనాలు పూర్తిగా బంద్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ సమయంలో ప్రజారవాణా మొత్తం బంద్‌చేస్తామని, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, ఆటోలు, ప్రైవేటు ట్యాక్సీలను నిలిపివేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేలు కూడా ఇప్పటికే బంద్‌ అయ్యాయని, అన్నిరాష్ట్రాల సరిహద్దులన్నింటిన్నీ మూసివేస్తున్నామని చెప్పారు. అత్యవసర సరుకులు, కూరగాయలు, మందులు తెచ్చేవాహనాలను అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రజలను చేరవేసే వాహనాలను ఎట్టి పరిస్థితులో అనుమతించమని స్పష్టంచేవారు. 

ఈ నెల, వచ్చే నెలలో ప్రసవం అయ్యే గర్భిణుల జాబితాను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వారు సురక్షితంగా డెలివరీ అయ్యేవిధంగా వారికి అమ్మఒడి వాహనాలను అందుబాటులో ఉంచుతామని, అవసరమైతే ఇంకా వాహనాలను పెంచుతామని తెలిపారు. డాక్టర్లు, ప్రైవేటు దవాఖానల్లో అత్యవసరంలేని సర్జరీలను వాయిదావేస్తారని పేర్కొన్నారు. ‘మన వైద్యుల్ని మనం కాపాడుకోవాలి. డాక్టర్ల సేవలు ఎంతో కీలకం కాబట్టి వారిని ఈ సమయంలో ఓవర్‌ బర్డెన్‌ కాకుండా చేస్తున్నాం. అత్యవసరమైన సర్జరీలు చేస్తారు’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు చెప్పారు.  

అత్యవసరశాఖల ఉద్యోగులే వందశాతం

ప్రభుత్వ ఉద్యోగులు కూడా అందరూ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని, అత్యవసర సర్వీసులవాళ్లు విధిగా డ్యూటీలో ఉండాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ‘ఉదాహరణకు.. వైద్యారోగ్యశాఖలో అందరూ పనిచేయాల్సి ఉంటుంది. కరంటు రావాలంటే విద్యుత్‌శాఖ పనిచేయాలి. ఇట్ల అత్యవసర సర్వీసుల ఉద్యోగులు వందశాతం రావాలి. మిగిలిన సర్వీసుల వాళ్లు 20 శాతం చొప్పున రొటేషన్‌ పద్ధతిలో విధులకు హాజరుకావాలి. దీనికి సంబంధించిన వివరాలు ఉత్తర్వుల ద్వారా విడుదలచేస్తారు’ అని తెలిపారు. 

అంగన్‌వాడీ సెంటర్లను మూసివేస్తున్నామని, వారికి అవసరమైన న్యూట్రిషన్‌కు సంబంధించిన సరుకులను నేరుగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యాశాఖకు సంబంధించిన కార్యకలాపాలన్నింటినీ మూసివేస్తామన్నారు. పేపర్‌ వాల్యుయేషన్‌ కూడా 31 వరకు బంద్‌ చేస్తున్నామని, విద్యాశాఖకు సంబంధించి టీచర్లు, లెక్చరర్లు ఎక్కడివారు అక్కడ ఇండ్లల్లో ఉండోచ్చన్నారు. లాక్‌డౌన్‌ ఉన్నపుడు బార్లు, వైన్‌షాపులు పనిచేయవని తెలిపారు. ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం పనిచేసేలా ఒప్పుకొన్నాయని, వారితో ఐటీ మంత్రి కేటీఆర్‌, ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఇప్పటికే సమావేశమయ్యారని సీఎం పేర్కొన్నారు.


logo