సోమవారం 25 మే 2020
Telangana - Apr 07, 2020 , 02:45:29

తొలిదశ రోగులు 9లోగా డిశ్చార్జి

తొలిదశ రోగులు 9లోగా డిశ్చార్జి

  • నిజాముద్దీన్‌ రాకుంటే ఆరామ్‌గా ఉండేది   
  • తబ్లిగీ నుంచి వచ్చినవారే  11 మంది మృతి
  • తబ్లిగీ వెళ్లినవారు పరీక్షలు చేయించుకోవాలి  
  • జనాభాపరంగా చూస్తే భారత్‌ సురక్షితమే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో తొలిదశలో కరోనా సోకిన రోగులు, క్వారంటైన్‌లో ఉన్నవారు ఈనెల తొమ్మిదోతేదీలోగా డిశ్చార్జి అవుతున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. నిజాముద్దీన్‌లోని తబ్లిగీ జమాత్‌ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారితోనే రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగిందని..  ఆ కేసులు లేకుంటే ఆరామ్‌గా ఉండేవాళ్లమని పేర్కొన్నారు. సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పరిస్థితిని వివరించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

గణనీయమైన విజయం

రాష్ట్రంలో కరోనా వ్యాధి ప్రబలడం ప్రారంభమైన తర్వాత కేంద్రం ఇచ్చిన సూచనలను, అంతర్జాతీయం గా అమలవుతున్న పద్ధతులను పక్కాగా అనుసరిం చాం. వాస్తవంగా ఈ జబ్బు విదేశాల్లో పుట్టింది. అం దుకే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాప్తిచెందకుండా కట్టడిచేసేందుకు కఠినంగా నిర్ణయాలు తీసుకొన్నాం. కేంద్రం కూడా దానినే అనుసరిస్తూ పోర్టులు, విమానాశ్రయాలు బంద్‌చేసింది. జనతా కర్ఫ్యూ విధించింది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ అమలుచేసింది. దాని ఫలితంగానే మన రాష్ట్రంగానీ, దేశంగానీ అద్భుత, గణనీయమైన విజయాన్ని సాధించాయి. జనాభాపరంగా చూస్తే ఇది అతిపెద్ద విజయం. ఈ నిమిషం వరకు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,314, మరణించినవారి సంఖ్య 122. అంటే మనదేశం చాలా సురక్షితంగా ఉన్నదని చెప్పొచ్చు. ఇదేదో నేను చెప్పడం కాదు. అంతర్జాతీయ జర్నల్స్‌ ప్రశంసిస్తున్నాయి. దేశంలో వివిధ రాజకీయపార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కరోనా విషయంలో ఒక్కటై, ఐక్యతను ప్రదర్శించాయని మెచ్చుకొంటున్నయి. లేకపోతే దేశంలో చాలా భయంకర పరిస్థితులను ఎదుర్కొనేవాళ్లం. 

ఇదీ.. తెలంగాణ కరోనా లెక్క

తెలంగాణలో కరోనాకు సంబంధించి మొదటి దశ లో విదేశాలనుంచి వచ్చినవాళ్లు, తద్వారా వారి నుంచి సోకే అవకాశమున్నదనే అనుమానంతో 25,937 మందిని ప్రభుత్వపరంగా వివిధ పద్ధతుల్లో క్వారంటైన్‌చేసినం. అందులో 50 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో విదేశాలనుంచి వచ్చినవారు 30మంది ఉండ గా.. వారిద్వారా వైరస్‌ సంక్రమించిన వాళ్ల కుటుంబసభ్యులు 20మంది వరకు ఉన్నారు. అదృష్టంకొద్దీ ఈ యాభై మందిలో ఒక్కవ్యక్తి కూడా చనిపోలేదు. 35 మంది ఇప్పటికే డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 15 మంది ఎల్లుండిలోగా డిశ్చార్జి అవుతారు. అందరూ క్షేమంగా ఉన్నారు. మొదటి బ్యాచ్‌లో పాజిటివ్‌ వచ్చినవారంతా ఎల్లుండితో డిశ్చార్జి అవుతారు. క్వారంటైన్‌లో ఉన్న 25,937 మందిలో రేపటికి (మంగళవారం) 258 మంది మాత్రమే ఉంటరు. రేపు (మంగళవారం) సాయంత్రం వాళ్లుకూడా డిశ్చార్జి అవుతారు. 9వ తేదీలోపు మొత్తం ఖాళీ అవుతుంది. మొదటి దశ జీరోకు వస్తది.

‘నిజాముద్దీన్‌'తో పెరిగిన కేసులు 

నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చినవారుకానీ, వారిద్వారా సోకినవారుగానీ రెండోదశలో ఉన్నరు. మనమే కాదు.. దేశమంతా నిజాముద్దీన్‌ ద్వారా అతలాకుతలమైంది. మొదటిదశలో వచ్చిన 50 కేసులతో నిజాముద్దీన్‌ కేసులను కూడా కలుపుకొంటే ఇప్పటివరకు 364 మందికి వైరస్‌ సోకింది. ఇందులోనే కరీంనగర్‌లోని పది కేసులూ ఉన్నాయి. డిశ్చార్జి అయినవారు కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో 11 మంది చనిపోయారు. ప్రస్తుతం గాంధీలో 308 మంది చికిత్స పొందుతున్నారు.  నిజాముద్దీన్‌ అనంతర పరిణామక్రమంలో మూడువేల మందిని పట్టుకోగలిగినం. 1089 మందిని గుర్తించినం. 30-35 మంది ఇంకా ఢిల్లీలోనే ఉన్నరు. బహుశా అక్కడి ప్రభుత్వం క్వారంటైన్‌ చేసి ఉండవచ్చు. మన రాష్ట్రంలోకి వచ్చినవాళ్లకు నిర్వహించిన పరీక్షల్లో ఇప్పటివరకు 172 మందికి వైరస్‌సోకింది. వీరిద్వారా మరో 93 మందికి వ్యాప్తి చెందింది. 

ఇందులోనే చనిపోయినవాళ్లూ ఉన్నారు. సుమారు 3015 మందిదాకా ఈ బ్యాచ్‌ వివరాలను సేకరించినం. నిజాముద్దీన్‌పోయి వచ్చినవాళ్లు ఏ రైలు.. ఏ బోగీలో వచ్చినరు? ఎక్కడ తిన్న రు? ఎక్కడ పడుకొన్నరు? ఇట్ల అన్ని వివరాలను సేకరించినం. అందరినీ పట్టుకొన్నం. ఇందులో హిందూ సోదరులు కూడా ఉన్నరు. కరీంనగర్‌ బ్యాచ్‌ కూడా ఢిల్లీ మర్కజ్‌కు పోయి వచ్చినవాళ్లే. వెయ్యి పైచిలుకు మందికి జబ్బులేదని వచ్చింది. ఇయ్యాల కూడా మరో 600 మందికి సంబంధించిన పరీక్షలు కొనసాగుతున్నయి. రేపు సాయంత్రంగానీ, ఎల్లుండికి గానీ ల్యాబ్‌ క్లోజ్‌ అయిపోతది. సాధారణంగా ఈ పరీక్షల్లో ఐదు నుంచి పదిశాతం పాజిటివ్‌ వస్తయి. ఒక్కోసారి 10 నుంచి 11 శాతం కూడా రావొచ్చు. అదనంగా వీళ్ల ద్వారా సోకినవారు ఉంటే వాళ్లకు పరీక్షలు చేయాల్సి ఉంటుంది తప్ప ఇప్పటివరకైతే అన్ని పరీక్షలు పూర్తయినట్లే. ఇప్పడున్న 308 మంది కాకుండా ఇంకా మిగిలిఉన్న పరీక్షల్లో అదనంగా 100-110 పాజిటివ్‌ కేసులు వచ్చిచేరే అవకాశమున్నది. భగవంతుడి దయతో అక్కడికి ఆగిపోవాలి.  

పోలీసులకు కృతజ్ఞతలు

నిజాముద్దీన్‌ పోయి వచ్చినవారి ద్వారా ఇంకా ఎవరికైనా వైరస్‌ వ్యాప్తి చెందిందా అన్నవేట కొనసాగుతూనేఉన్నది. ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, కలెక్టర్లు, అందరూ క్రియాశీలంగా వేటచేస్తున్నరు. ముఖ్యంగా పోలీసుశాఖ నిద్రలేకుండా పనిచేసిన్రు. వారందరికీ కృతజ్ఞతలు. చాలామందిని పోలీసులే రకరకాల పద్ధతుల్లో కష్టపడి పట్టుకొన్నరు. వందమందిదాకా మనం పరిశోధనచేసి పట్టుకొన్నం. నిజాముద్దీన్‌ పోయివచ్చిన వాళ్లెవరైతే ఉన్నారో.. 99.9 శాతం వారిని తీసుకొన్నాం. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే.. మీ ప్రాణాలకే హాని కాబట్టి వెంటనే రిపోర్టు చేయండి.

పాజిటివ్‌ వస్తే గాంధీలో ఉండాల్సిందే 

ఏ రాష్ట్రంలో చేయనివిధంగా ముందుగానే 25 వేలమంది వైద్య సిబ్బందిని అదనంగా పూల్‌గా పెట్టుకున్నం. ఎప్పుడు ఫోన్‌చేస్తే అప్పుడు వచ్చి పనిచేయటానికి వాళ్లు సిద్ధంగా ఉన్నరు. అందులో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నిషియన్లు.. ఇట్లా అందరూ ఉన్నరు. సమాజంలో పరిస్థితి ఎటు మారుతుందో అంచనా లేదు కాబట్టి, దాన్ని ఎదుర్కొనేలా.. మనుషులను కాపాడుకునేలా ఆ ఎక్స్‌ట్రా పూల్‌ను కూడా సిద్ధంచేసి పెట్టుకున్నం. ఆరోగ్యమంత్రి ఆధ్వర్యంలో ఆ శాఖ పూర్తి సన్నద్ధంగా ఉన్నది. 18 వేల బెడ్లు కూడా రెడీగా పెట్టుకున్నం. చాలా వరకు సంసిద్ధంగానే ఉన్నం. అయితే ఆ పరిస్థితి రాకూడదనే నేను భగవంతుడిని ప్రార్థిస్తున్న. 

ఎనిమిది దవాఖానలు నోటిఫై

గాంధీతోపాటు కొవిడ్‌కు సంబంధించి ఎనిమిది దవాఖానలను నోటిఫై చేసిఉంచాం. వాటిలో ఐసీ యూ, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు, ఎమర్జెన్సీ వైద్యానికి సంబంధించి వెంటిలేటర్‌వంటి అన్ని పరికరాలు ఉంటాయి. ఎవరైనా ఎమర్జెన్సీ వైద్యం అవసరమైతే వెంటనే షిఫ్ట్‌చేసేందుకు వీలుంటుంది. ఇంకోమాట కూడా కచ్చితంగా చెప్తున్న. ఎవరికైతే కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందో వాళ్లు కోటీశ్వరుడైనా.. లక్షాధికారైనా.. సామాన్యుడైనా కచ్చితంగా గాంధీ దవాఖానలో ఉండాల్సిందే.

ఆ దుఃఖం ఎవరికీ రావొద్దు

ఇయ్యాల అమెరికా చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. న్యూయార్క్‌లో శవాల గుట్టలంటూ కథనాలు వస్తున్నయి. ఆ దుఃఖం ఎవరికీ, అసలు మానవజాతికే రావొద్దు. అక్కడ పరిస్థితి హృదయవిదారకంగా ఉన్నది. శవాల్ని ట్రక్కుల్లో నింపి పంపుతున్నరు. యాడ పడేస్తరో.. తగులబెడుతరో.. ఎవరికీ తెల్వదు. కనీసం శవాలను చూసేవాళ్లు లేరు. అంతటి శక్తిమంతమైన దేశం.. మౌలిక వసతులపరంగా, ఆర్థికంగా, ఆర్మీపరంగా చాలా పవర్‌ఫుల్‌ దేశం. బలం, బలగం ఇంతలా ఉన్నా ఇప్పుడు అసహా య స్థితిలో ఉన్నది. రెండులక్షల మందిదాకా చనిపోతరని వాళ్ల అధ్యక్షుడే ప్రకటిస్తున్న పరిస్థితి. ఆ పరిస్థితి మనకొస్తే.. రోడ్లమీదే ఎక్కడికక్కడ సచ్చెటోళ్లు. కానీ భగవంతుడి దయవల్ల చాలా నియంత్రణలో ముందుకుపోతున్నం.

మందుల కొరత లేదు

ఎక్కడా మందుల కొరత లేదు. ఇలాంటిది ఎవరి దృష్టికైనా వస్తే వెంటనే సీఎస్‌కు, వైద్యారోగ్యశాఖ మంత్రికి ఫోన్‌చేసి చెప్పండి. కొన్ని మకిలి వార్తలు రాసెటోళ్లే రాశారు ఇదంతా. చైనా లేకపోతే మనం బతకం.. చైనా క్లోజ్‌ అయింది కాబట్టి మందులు రావని రాశా రు. అదంతా బోగస్‌. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు కొన్ని పంపించమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అడిగితే ప్రధాని మోదీ నిరాకరించారు. మాకే అవసరం ఉన్నాయి, మీకు పంపించలేమని చెప్పారు. ఎవరికైనా దేశాన్ని కాపాడుకోవాలని ముందుగా ఉంటుంది. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ను స్టేజ్‌ త్రీ అంటున్నారు. మనకు ఎవరి దగ్గర నుంచి సోకిందో తెలియకుండా ఒక జనసమూహంలో 10-15 మందికి వైరస్‌సోకితే దానిని కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ అంటారు. ఇది మన దేశంలోనే లేదు. విదేశాల నుంచి వచ్చినవాళ్లు, ఆ తరువాత మర్కజ్‌వాళ్లు తప్ప మనదగ్గర లేదు. ఈ నిమిషం వరకు సోర్స్‌ దొరకకుండా రాలేదు. భగవంతుని దయ. అయితే రేపు ఎలా ఉంటుందో చెప్పలేము.


logo