మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 02:02:42

ఇవి కండ్లకు కనిపిస్తలేవా?

ఇవి కండ్లకు కనిపిస్తలేవా?

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతుబీమా ఇవ్వాలని తనను ఎవరూ అడుగలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. రైతుల బాధలు తెలుసు కాబట్టే వారికి మేలుచేసేందుకు ఈ పథకాన్ని తెచ్చామని చెప్పారు. శనివారం జనగామజిల్లా కొడకండ్లలో జరిగిన సభలో మాట్లాడుతూ ‘మీ బిడ్డగా, కాపు బిడ్డగా, వ్యవసాయ బిడ్డగా రైతుల బాధలు నాకు తెలుసు. రైతుబంధు ఇవ్వుమని నన్నెవరైనా అడిగిండ్రా? ఎవరైనా అప్లికేషన్‌ ఇచ్చిండ్రా? ఎకరం, రెండెకరాలు, అరకెరం.. పావెకరం, గుంట.. రెండు గుంటలు ఉన్న రైతు గోసేందో నాకు తెలుసు. ఆ రైతు చచ్చిపోతే ఆ కుటుంబం బజార్న పడుతుంది. రైతు కుటుంబం అలా అభాసుపాలు కావొద్దు. ఆ బిడ్డలు చల్లగా బతకాలని ఆలోచన చేసి ప్రతి సంవత్సరం రూ. 1200 కోట్లు ఖర్చవుతున్నా.. రైతుబీమా తెచ్చి పెట్టినం. రైతు ఆర్థికంగా చితికిపోవద్దు. ఏ కారణం చేత మరణించినా సరే రూ.5 లక్షలు 10 రోజుల్లో వారి ఖాతాలో జమైతున్నయి. ఈ ఘనత తెలంగాణ రాష్ర్టానిది.. తెలంగాణ ప్రభుత్వానిది కాదా.. ఇది వాస్తవం కాదా.. అందరికీ కనబడతలేదా?’ అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. 

కరెంటు గోస తలుచుకుంటే గుండె దడదడ మంటది

‘కరెంటు గోస భగవంతునికెరుక. ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో ఎవరికీ అర్థమయ్యేది కాదు. మోటర్లు కాలుడు.. ట్రాన్స్‌ఫారంలు కాలుడు. వేలకు వేలు లంచాలు ఇచ్చుడు. వర్ణనాతీతమైన బాధ. యాది చేసుకుంటే గుండెలు దడదడమంటయి . దానికి చాలా కష్టపడి మొండిగా.. అధికారులతో పనిచేయించి. 26,800 కోట్లు ఖర్చు చేసి దీన్ని మంచిగ చేసినం. దేశంలో 24 గంటలు కరెంటు పూర్తిస్థాయిలో ఫ్రీగా ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఫ్రీ కరెంటు ఇచ్చే రాష్ర్టాలు ఉన్నయి. కానీ 24 గంటలు ఇవ్వవు. ఫ్రీ కరెంటు పంజాబ్‌, తమిళనాడు ఇస్తయి. కానీ 24 గంటలు ఇవ్వవు. 24 గంటలపాటు హై క్వాలిటీ కరెంటును రైతులకు ఫ్రీగా ఇస్తున్న ఒకే గవర్న్‌మెంట్‌ తెలంగాణ. ఈ సదుపాయం మనం పోగొట్టుకోవద్దు. ఇప్పుడు చాలా పార్టీలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నయ్‌.. కానీ అప్పుడు వాళ్లు చేసిండ్రా... వాళ్లు కూడా అధికారంలో ఉన్నరు కదా.. వారికి చేసేందుకు అవకాశం లేదా.. కానీ చేయ్యలె’ అని అన్నారు.