మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 00:44:32

అవసరమైతే.. ఇంటికే నిత్యావసరాలు

అవసరమైతే.. ఇంటికే నిత్యావసరాలు

  • ఎన్ని వేల కోట్లయినా ఖర్చు పెడతాం
  • 500 వెంటిలేటర్లకు ఆర్డరిచ్చినం: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నియంత్రణలో భాగంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే చాలా లోతుగా ఆలోచిస్తున్నాం. చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ కలిసి మాట్లాడుకున్నం. ఒకవేళ ప్రజలు బయటకు రాకుండా ఉండే పరిస్థితే ఎదురైతే, ప్రతి ఇంటికీ ప్రభుత్వం తరఫున రేషన్‌  పంపించాలా, పంపించినట్లయితే ఎన్ని ఇండ్లకు, ఎన్ని వాహనాలతో పంపాలనే విషయాలన్నీ చర్చిస్తున్నం. ప్రభుత్వపరంగా ఏం చేయగలుగుతామనేది మానవీయకోణంలో ఆలోచిస్తున్నం. ఎన్నివేల కోైట్లెనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నం. ఇలాంటి సమయంలో కావాల్సింది ప్రజల సహకారమే’ అని సీఎం తెలిపారు. 

కరోనా నియంత్రణలో సిబ్బంది బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. వైద్య పరీక్షల కోసం ఢిల్లీ నుంచి ఎక్విప్‌మెంట్‌ వచ్చిందని, కావాల్సిన కిట్లు కూడా వచ్చాయన్నారు. వైద్యుల పరికరాలు, 500 వెంటిలేటర్లు వచ్చాయన్నారు. ‘ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైతే అన్ని రద్దు చేసి.. అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. మనం ముందుగా వైద్యులను, వైద్యబృందాలను కాపాడుకోవాలి. ఇప్పటివరకు వైద్య సిబ్బంది పనితీరు చాలా బాగున్నది. వైద్యబృందాలకు అభినందనలు తెలుపుతున్న. ప్రజల సేవలో అప్రమత్తంగా నిరంతరం పని చేస్తున్నరు. వైద్యుల ఆరోగ్యం చాలా ముఖ్యం. వైద్యులకు ఏమైనా అయితే మాత్రం చాలా ఇబ్బంది. ఇంకే వైద్యులు మన దగ్గరకు రారు. అందుకే వారికి ఇన్‌ఫెక్షన్‌ రాకుండా చేసినం. వారికి కావాల్సిన సామగ్రి, సూట్స్‌, మాస్క్‌లు, పీపీ యూనిట్లు తెప్పించినం. ఇంకా తెప్పిచేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని సీఎం చెప్పారు.


logo
>>>>>>