శనివారం 30 మే 2020
Telangana - May 21, 2020 , 14:40:00

నియంత్రిత పంటల సాగుపై సీఎం కేసీఆర్‌ సమావేశం

నియంత్రిత పంటల సాగుపై సీఎం కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి అధ్యక్షులు హాజరయ్యారు. నియంత్రిత పంటల సాగుపై మంత్రులు, కలెక్టర్లు, అధికారులకు సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశం చేయనున్నారు. సమావేశంలో జిల్లాల వారీగా పంటసాగు విస్తీర్ణాన్ని ఖరారు చేయనున్నారు. 

వచ్చే వానకాలంలో ఏ జిల్లాలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలనే అంశంపై వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుల ఇప్పటికే చర్చించి.. సమగ్ర జీఐఎస్‌ మ్యాపింగ్‌ను సిద్ధం చేసిన విషయం విదితమే. మృత్తికలు, నీటివసతి, సాగు విధానం, విస్తీర్ణం, మార్కెటింగ్‌ సౌకర్యం వంటి సమగ్ర వివరాలతో కూడిన ఈ నివేదికను సీఎం కేసీఆర్‌ కు ఇవాళ అందజేయనున్నారు.

40 లక్షల ఎకరాలకు మించి వరిసాగు చేయవద్దని, 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగును పెంచాలని, వానకాలంలో మక్కజొన్న వేయవద్దనే విషయంలో నిన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్లు, నూనెగింజల సాగుకు అనుకూలంగా పంటల మ్యాప్‌లను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.


logo