సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 02:57:34

మాపై ఆగ్రహం..అన్యాయం

మాపై ఆగ్రహం..అన్యాయం

  • నిద్ర లేకుండా సేవ చేస్తున్నా నిందలా?
  • రాష్ట్ర హైకోర్టులో 87 పిల్స్‌పై విచారణ
  • కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోతున్నది
  • అధికారులకు ఒక్క క్షణం తీరిక ఉండదు
  • వారిని కోర్టుకు రమ్మనడం ఇబ్బందికరం
  • కొన్ని మీడియాసంస్థల్లో వస్తున్న వార్తలు
  • వైద్యుల ైస్థెర్యం దెబ్బతీసేలా ఉన్నాయి
  • సీఎం వద్ద వైద్యాధికారుల ఆవేదన
  • చేస్తున్న ప్రతి పనినీ కోర్టుకు చెప్పండి
  • పూర్తి వాస్తవాలతో అఫిడవిట్‌ వేయండి
  • అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచన

‘హైకోర్టు ఇప్పటికి 87 పిల్స్‌ స్వీకరించింది. నిత్యం కోర్టు విచారణ వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతున్నది. కరోనా సోకినవారికి వైద్యం అందించే విషయంలో క్షణం తీరికలేకుండా పనిచేస్తున్న వైద్యాధికారులు, ఇతర సీనియర్‌ అధికారులు కోర్టు చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నది. ఈ క్లిష్ట సమయంలో చేయాల్సిన పని వదిలిపెట్టి, కోర్టుకు తిరగడం, విచారణకు సిద్ధమవడంతోనే సరిపోతున్నది. దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాం.

గతంలో కూడా మృతదేహాలకు పరీక్షలు నిర్వహించాలని ఎవరో పిల్స్‌ దాఖలు చేశారు. దానికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాస్తవ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు కొట్టేసింది. అయినప్పటికీ హైకోర్టులో పిల్స్‌ దాఖలవుతూనే ఉన్నాయి.హైకోర్టు వాటిని స్వీకరిస్తూనే ఉన్నది.

-ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్ద వైద్యాధికారుల ఆవేదన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రతిరోజూ వేల సంఖ్యలో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నా హైకోర్టు వ్యాఖ్యలు చేయడం బాధనిపిస్తున్నదని వైద్యాధికారులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా విషయంలో ఎవరు పడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని, ఇప్పటివరకు 87 పిల్స్‌ను స్వీకరించిందని తెలిపారు. నిత్యం కోర్టు విచారణ వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతున్నదని చెప్పారు. కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టులో కరోనా విషయంలో దాఖలవుతున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, వాటిపై విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవడంలోనూ, పరీక్షలు- చికిత్స విషయంలోనూ ప్రభుత్వం, వైద్యసిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసేపరిస్థితి ఉత్పన్నం కావడంపట్ల సమావేశంలో పాల్గొన్న పలువురు తమ అభిప్రాయాలు వెల్లడించారు. 

నిత్యం విచారణ వల్ల ఇబ్బంది

కరోనా విషయంలో ఎవరు పడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని పలువురు వైద్యాధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తెచ్చారు. ‘హైకోర్టు ఇప్పటికి 87 పిల్స్‌ స్వీకరించింది. నిత్యం కోర్టు విచారణ వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతున్నది. కరోనా సోకినవారికి వైద్యం అందించే విషయంలో క్షణం తీరికలేకుండా పనిచేస్తున్న వైద్యాధికారులు, ఇతర సీనియర్‌ అధికారులు కోర్టు చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నది. ఈ క్లిష్ట సమయంలో చేయాల్సిన పని వదిలిపెట్టి, కోర్టుకు తిరగడం, విచారణకు సిద్ధమవడంతోనే సరిపోతున్నది. దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాం. వాస్తవానికి దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నది. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, వైద్య శాఖ, వైద్యాధికారులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ఎంత మందికైనా సరే వైద్యం అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉన్నది. ప్రతి రోజూ వేలసంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంత చేసినప్పటికీ హైకోర్టు వ్యాఖ్యలు చేస్తుండడం బాధకలిగిస్తున్నది’ అని సీఎం వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ‘గతంలో కూడా మృతదేహాలకు పరీక్షలు నిర్వహించాలని ఎవరో పిల్స్‌ దాఖలు చేశారు. దానికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును కొట్టేసింది. అయినప్పటికీ హైకోర్టులో పిల్స్‌ దాఖలవుతూనే ఉన్నాయి. హైకోర్టు వాటిని స్వీకరిస్తూనే ఉన్నది. ఏకంగా 87 పిల్స్‌పై విచారణ జరపడం, వాటికి నిత్యం హాజరుకావడం, చివరికి వివిధ పనుల్లో తీరికలేకుండా ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి, వివిధ వైద్యశాలల సూపరింటెండెంట్లను కూడా కోర్టుకు రావాలని పిలవడం ఇబ్బందిగా ఉన్నది. అధికారులు, వైద్యుల విలువైన సమయం కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోతున్నది’ అని అధికారులు చెప్పారు. ‘కొన్ని మీడియా సంస్థలు కూడా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కరోనా విషయంలో ప్రభుత్వం ఏమీచేయడం లేదనే అభిప్రాయం కలిగించేలా వార్తలు రాస్తున్నాయి. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బంది ైస్థెర్యాన్ని ఇది దెబ్బతీస్తున్నది’ అని సమావేశంలో పాల్గొన్న పలువురు తమ నిరసన వ్యక్తం చేశారు. 

పూర్తి వాస్తవాలతో అఫిడవిట్‌ వేయండి


సమావేశంలో వ్యక్తమయిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి ఓపిగ్గా విన్నారు. వైరస్‌ నిర్ధారిత పరీక్షలు నిర్వహణ, వైద్యం అందిస్తున్న తీరు, తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో పూర్తి వాస్తవాలను హైకోర్టుకు అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. విచారణ సందర్భంగా కోర్టుకు కావాల్సిన కచ్చితమైన సమాచారాన్ని వైద్యాధికారులు అందించాలని సూచించారు. హైకోర్టు అడిగిన ప్రతి వివరాన్ని, చేస్తున్న పనిని తెలపాలని చెప్పారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్‌ ముర్తజారిజ్వీ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ వైద్య విభాగాధిపతులు శ్రీనివాస్‌, రమేశ్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.



logo