ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 15:07:04

పంట‌ల కొనుగోళ్లు, యాసంగి సాగుపై సీఎం కేసీఆర్ స‌మీక్ష

పంట‌ల కొనుగోళ్లు, యాసంగి సాగుపై సీఎం కేసీఆర్ స‌మీక్ష

హైద‌రాబాద్ : వానా కాలంలో పంటల‌ కొనుగోళ్లు, యాసంగిలో సాగు విధానంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌తో పాటు సంబంధిత అధికారులు హాజ‌ర‌య్యారు. 

యాసంగిలో ఏ పంట వేయాలి? ఏది వేయొద్దు? ఏ పంట వేస్తే లాభం? దేనితో నష్టం? తదితర అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటున్నదని, దీనివల్ల దేశంలో మక్కల కొనుగోలుపై ప్రభావం పడుతుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మక్కల సాగుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని, శనివారం నాటి సమావేశంలో ఈ అంశంపైనా విస్తృతంగా చర్చ జరుగుతుందని చెప్పారు. కరోనా ముప్పు ఇంకా తొలుగనందున రైతుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపైనా సీఎం సమీక్షించనున్నారు. ‘కరోనా నేపథ్యంలో యాసంగి పంటలను గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి సేకరించాం. ఇంకా కరోనా ముప్పు తొలుగలేదు. కాబట్టి వానకాలం పంటలను కూడా గ్రామాల్లోనే కొనుగోలు చేయాలి. ఆరు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరుపాలి. ఇందుకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లుచేయాలి. పంట కొనుగోళ్ల తర్వాత వీలైనంత తక్కువ సమయంలో రైతులకు డబ్బు చెల్లించాలి. దీనికోసం కావాల్సిన ఏర్పాట్లను ముందుగానే చేయాలి’ అని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.  


logo