గురువారం 09 జూలై 2020
Telangana - Apr 30, 2020 , 02:00:59

సన్నాలే మిన్న

సన్నాలే మిన్న

  • డిమాండ్‌ ఉన్న పంటలు సాగుచేసేలా రైతును ప్రోత్సహించాలి
  • రాష్ట్రంలో కొత్త వ్యవసాయ విధానం రూపొందించాలి
  • పంటలసాగుపై మే 5లోగా పూర్తి నివేదిక ఇవ్వాలి
  • కొత్త గోదాముల్లో కోల్డ్‌ స్టోరేజీ తప్పనిసరి
  • అధికారులకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సన్న బియ్యం సాగుచేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహార అవసరాలకు తగినట్టుగా, అలాగే మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. వరి మాత్రమే కాకుండా ఇంకా ఏ ఇతర పంటలు సాగుచేయడం వల్ల మేలు జరుగుతుందో రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. దీనిపై అధ్యయనంచేసి మే 5వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని వారిని ఆదేశించారు. రాష్ట్రంలో నూతన వ్యవసాయ విధానం రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ వరుసగా రెండోరోజు బుధవారం కూడా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రైతులు ఎక్కువగా వరి పండిస్తున్నారని, పంట కాలం తక్కువనే కారణంగా వారు దొడ్డు రకాలవైపు మొగ్గుచూపుతున్నారని సీఎం పేర్కొన్నారు. సన్న రకాలకు ఇతర రాష్ర్టాల్లో, ఇతర దేశాల్లో కూడా మంచి డిమాండ్‌ ఉన్నదని, ఇప్పుడు సాగునీటి వసతి కూడా ఉన్నందున రైతులను ఎక్కువగా సన్న రకాలు పండించే విధంగా చైతన్యపరచాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

కొత్త వ్యవసాయ విధానం రావాలి

తెలంగాణలో గతంలో ప్రాజెక్టులు, కరంటు సరిగా లేకపోవడం వల్ల సాగుకు నీటిలభ్యత ఉండేది కాదని, ప్రభుత్వాలు కూడా వ్యవసాయాన్ని పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. దీంతో రైతులు ఎవరికి తోచినట్టు వారు తమ వనరులకు అనుగుణంగా పంటలను సాగుచేశారని తెలిపారు. అందరూ ఒకే పంట వేయడం వల్ల వారికి సరైన ధర కూడా రాలేదని చెప్పారు. ఇప్పుడు పరిస్థితి మారుతున్నదని, ప్రతి మూలకూ సాగునీరు అందుతున్నదని, దీనికితోడు 24 గంటల కరంటు వల్ల బోర్ల ద్వారా కూడా జోరుగా వ్యవసాయం సాగుతున్నదని తెలిపారు. కాబట్టి రైతులకు సరైనవిధంగా నిర్దేశించగలిగితే వారు లాభదాయక వ్యవసాయం చేయగలరన్నారు. పంటల ఎంపికలో, సాగు పద్ధతుల్లో, ఎరువుల వాడకంలో, మార్కెటింగ్‌లో మార్పులు వస్తాయని చెప్పారు. 

ఈ దిశగా రాష్ట్రంలో కొత్త వ్యవసాయ విధానం రావాల్సిన అవసరముందని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రం లో మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించాలని నిర్ణయించినందున వెంటనే స్థలాలను గుర్తించాలన్నారు. కొత్తగా నిర్మించే గోదాముల్లో కోల్డ్‌ స్టోరేజి సదుపాయం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రైతుబంధుసమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, జనార్దన్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్‌రావు, సీడ్‌ కార్పొరేషన్‌ ఎండీ కేశవులు, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, హార్టికల్చర్‌ ఎండీ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.


వేర్వేరు పంటలు సాగుచేయాలి

రైతులంతా ఒకే పంట కాకుండా వేర్వేరు పంటలు సాగుచేయాలని, అలా అయితేనే అన్ని పంటలకు డిమాండ్‌ వస్తుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. రైతులు తక్కువ శ్రమ, ఎక్కువ దిగుబడి, మార్కెట్‌ అవకాశాలు, మంచి ఆదాయం పొందగలిగిన పంటలను గుర్తించాలని,  వాటిని రైతులకు అధికారులు సూచించాలని తెలిపారు. ఏ రైతు ఏ పంట వేయాలో నిర్ణయించి సాగుచేయించాలన్నారు. వేరుశనగ, కందులు, పామాయిల్‌ వంటి వాటికి డిమాండ్‌ ఉన్నదని, ఇలాంటి పంటలను గుర్తించి, వాటిని ఎన్ని ఎకరాల్లో పండించాలన్న విషయంపై అధ్యయనం జరగాలని చెప్పారు. నీటి వసతి పెరిగినందున ఫిష్‌ కల్చర్‌ విస్తరణకు గల అవకాశాలపై శాస్త్రీయంగా ఆలోచించాలని తెలిపారు. ఎరువుల వాడకం ఇప్పటిలాగానే ఉండాలా? ఏవైనా మార్పులు అవసరమా? అనే విషయాన్ని కూడా శాస్త్రీయంగా ఆలోచించాలన్నారు. వీటిపై పూర్తిస్థాయి అధ్యయనంచేసి మే 5వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. 


logo