శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 02:44:02

వీసీల నియామక ప్రక్రియలో వేగం పెంచాలి

వీసీల నియామక ప్రక్రియలో వేగం పెంచాలి

  • ఆలస్యం చేయకుండా భర్తీ చేయాలి
  • అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్‌
  • అసెంబ్లీలో వ్యూహంపై ఎమ్మెల్యేలతో చర్చ
  • పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై రేపు సీఎం సమీక్ష

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సెర్చ్‌ కమిటీ నియామకం పూర్తయిందని, ఎంపికకు సంబంధించిన కసరత్తు చేస్తున్నామని సీఎం వివరించారు. కరోనా నేపథ్యంలో నియామక ప్రక్రియలో కొతం జాప్యం జరిగిందని, ఇక ఏమాత్రం ఆలస్యం కాకుండా పూర్తిచేయాలని అన్నారు. దీనిని స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సూచించారు. వచ్చేనెల ఏడు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్‌ పలువురు ఎమ్మెల్యేలతో బుధవారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ప్రభుత్వపరంగా ప్రజలకు చెప్పాల్సిన విషయాలను అసెంబ్లీ వేదికగా వివరించాలని, ప్రజోపయోగ కార్యక్రమాలపై విస్తృత చర్చ జరుగాల్సిన అవసరం ఉన్నదని వారు సూచించారు. సమావేశంలో మంత్రి పువ్వాడ, విప్‌లు గొంగిడి సునీత, రేగ కాంతారావు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్‌, చల్లా ధర్మారెడ్డి, గణేశ్‌గుప్తా, సండ్ర వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు.

పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై రేపు సమీక్ష

పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల నిర్వహణపై శుక్ర వారం సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా జరిగిన, ఇంకా జరుగాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారు.logo