మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 03:15:12

సీఎం ఆస్తుల నమోదు

సీఎం ఆస్తుల నమోదు

  • సాధారణ పౌరుడిలా పంచాయతీ కార్యదర్శికి వివరాలు వెల్లడి
  • ఎర్రవల్లిలో నమోదుచేయించుకున్న సీఎం కేసీఆర్‌
  • ప్రజల ఆస్తుల భద్రతకే వివరాల నమోదు
  • చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్య

గజ్వేల్‌ అర్బన్‌: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సాధారణ పౌరుడిగా మారారు. ఆస్తుల నమోదుకోసం వచ్చిన పంచాయతీ కార్యదర్శికి సామాన్య ప్రజల్లాగే స్వయంగా వివరాలను వెల్లడించారు. ఆదర్శంగా నిలువడంలో అసామాన్యుడని మరోసారి చాటుకొన్నారు. స్థిరాస్తుల నమోదు కోసం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం మర్కూక్‌ మండలం ఎర్రవల్లి గ్రామంలోని సీఎం కేసీఆర్‌ నివాసగృహానికి శనివారం గజ్వేల్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గడా) ఓఎస్డీ ముత్యంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సిద్ధేశ్వర్‌ వెళ్లారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శికి సాధారణ ప్రజల మాదిరిగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన నివాసగృహ వివరాలను వెల్లడించి, ఫొటోలను అందజేశారు. తెలంగాణ స్టేట్‌ నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీ బుక్‌ యాప్‌లో వివరాలను నమోదు చేయించుకున్నారు. ప్రజలకు చెప్పడమే కాదు.. దానిని స్వయంగా ఆచరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అధికారులతో మాట్లాడారు. ఆస్తులపై ప్రజల హక్కును, వాటికి భద్రత కల్పించేందుకే ప్రతి కుటుంబానికి చెందిన స్థిరాస్తి వివరాలను నమోదుచేస్తున్నామని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో ఆస్తుల నమోదు దేశంలో మొట్టమొదటి, అతిపెద్ద ప్రయత్నమని వెల్లడించారు. వ్యవసాయ భూముల తరహాలో వ్యవసాయేతర ఆస్తులకూ పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. గ్రామీణ, పుర ప్రజలు తమ స్థిరాస్తుల వివరాలను విధిగా నమోదుచేసుకోవాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.


logo