గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 01:18:59

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో యుద్ధం

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో యుద్ధం

  • నేడే జనతా కర్ఫ్యూ 24 గంటలు ఉదయం 6నుంచి రేపు ఉదయం 6 వరకు బంద్‌
  • సాయంత్రం 5 గంటలకు సైరన్‌ అందరం చప్పట్లు కొడదాం 
  • మన వైద్య, సహాయ సిబ్బందికి సంఘీభావం ప్రకటిద్దాం
  • నా ప్రజలను కాపాడుకుంటా
  • కేసీఆర్‌ బతికున్నంత వరకూ ఎవరికీ ఎలాంటి కష్టం రాదు
  • పేదలకు ఉపాధి లేకుంటే ఇంటికే సరుకులు పంపిస్తా
  • పని మనుషులకు నేడు సెలవు
  • 4 అడుగులు దూరంగా మసలండి
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు
  • విశ్వమారి కరోనాపై మార్గదర్శకాలు
  • శాస్త్రవేత్తలతో కమిటీ ఏర్పాటు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూను తెలంగాణలో 24  గంటలపాటు పాటించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలకు విజ్ఞప్తిచేశారు. స్వీయ నియంత్రణలో తెలంగాణ.. దేశానికి ఆదర్శంగా నిలువాలన్నారు. విదేశాలనుంచి వచ్చినవారి కారణంగానే కరోనా వ్యాప్తి చెందుతున్నందున విదేశాలనుంచి వచ్చినవారు అధికారులకు స్వచ్ఛందంగా సమాచారమివ్వాలని విజ్ఞప్తిచేశారు. ఆదివారం అత్యవసరసేవలు మినహా మిగిలిన సేవలన్నీ పూర్తిగా బంద్‌ అవుతాయని తెలిపారు. ఆదివారం జనతా కర్ఫ్యూ నేపథ్యంలో.. రాష్ట్రంలోచేస్తున్న ఏర్పాట్లు, కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం పేర్కొన్న అంశాలు ఆయన మాటల్లోనే..

తెలంగాణ సాధన స్ఫూర్తి మళ్లీ చాటుదాం 

ప్రతి తెలంగాణ బిడ్డకు చేతులెత్తి దండం పెట్టి అభ్యర్థిస్తున్న. ప్రతి తెలంగాణబిడ్డ ఆదివారం ఒక్కరోజు కర్ఫ్యూను తప్ప కుండా పాటించాలె. జాతి ఐక్యత, పటుత్వం, జాతి పౌరుషం చూపే తరుణం ఇది. దేశానికి ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్‌లో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా తెలంగాణ వాళ్లు ఎదుర్కొంటారని నిరూపించాలి. మన తెలంగాణ జాతి చాలా గొప్పజాతి. అర వై ఏండ్లు ఆలస్యమైనా కోల్పోయిన రాష్ర్టాన్ని పట్టుబట్టి తిరిగి తెచ్చుకొన్న గొప్పజాతి మనది. అంతటి ఘనమైన చరిత్ర మనకు ఉన్నది. మొండి పట్టుదల ఉన్నవాళ్లం. ఇప్పుడు అదే ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ చూపెట్టాలి. ఈ కరో నా.. దేశంలో ఎవరిని ఏంచేసినా.. ఈ తెలంగాణవాళ్లను మాత్రం ఏమీ చేయలేకపోయిందన్న పేరు తెచ్చుకోవాలి. 

అత్యవసర సేవలు తప్ప అన్నీ బంద్‌ 

ఆర్టీసీ బస్సులు వందశాతం బంద్‌ పెడుతు న్నం. ఒక్క ఆర్టీసీ బస్సు కూడా తిరుగదు. అత్యవసరసేవల కోసం ముందుజాగ్రత్త చర్య గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ప్రతి డిపోకు ఐదు బస్సుల చొప్పున సిబ్బందితో సహా సిద్ధంగా పెడుతున్నాం. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు మాత్రమే సిద్ధంగా ఉంచుతున్నాం. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే బస్సులను సరిహద్దుల్లోనే ఆపాలని సీఎస్‌కు, రవాణాశాఖ, పోలీస్‌శాఖలకు చెప్పాం. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే బస్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోకి రానివ్వబోమని ముందే చెప్తున్నాం. ఇది కఠిన సమయం. క్లిష్ట పరిస్థితి. సంకట సమయంలో కఠినంగా ఉండకతప్పదు. స్వీయ నియంత్రణ పాటించాలి. మేం పాటించం అని ఎవరైనా అంటే వాళ్లను రానివ్వం. మెట్రో రైళ్లు దేశవ్యాప్తంగా బంద్‌చేస్తున్నరు. హైదరాబాద్‌లో పూర్తిగా బంద్‌ ఉంటయి. అత్యవసర పరిస్థితికోసం ఐదు రైళ్లను అందుబాటులో ఉంచుతున్నం.

ఎవరికి వారు బంద్‌చేసుకోవాలి 

వ్యాపార వాణిజ్యసంఘాలు స్వయంనియంత్రణ పాటించాలి. ఎవరికి వారు బంద్‌చేసుకోవాలి. మేం జబర్దస్త్‌గా ఎవరినీ బంద్‌ చేయించడంలేదు. విజ్ఞప్తిచేస్తున్నాం. తెలంగాణ ఉద్య మ సమయంలోనూ బంద్‌లు పాటించాం. ఒక్కరోజుతో మునిగిపోయేదేమీలేదు. నిత్యావసర సరుకుల కొరత రాకుండా చర్యలు తీసుకొంటున్నాం. చిన్నచిన్న వ్యాపారస్థులు దెబ్బ తినొద్దని, పాలు, మాంసం, చేపలు, కూరగాయలు విక్రయించే దుకాణాలను నిషేధించడంలేదు. పాలు, చిన్నారులకు సంబంధించిన ఇత ర దుకాణాలు, వైద్యసేవలు, అంబులెన్స్‌లు, ఎలక్ట్రిసిటీ, అగ్నిమాపక సిబ్బంది, తాగునీటి వ్యవస్థకు సంబంధించిన సిబ్బంది, సివరేజ్‌ సిబ్బంది సహా ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది తప్ప మిగతా అందరూ 24 గంటలపాటు ఎవరికి వారు బంద్‌ పాటించాలి. మీడియా మిత్రు లు కూడా తిరగవచ్చు. మీడియాను ఎవరూ నిరోధించరు. అత్యవసరంగా భావించి వీటిని మినహాయిస్తున్నాం. మీడియా నియంత్రణ పాటించాలి.  మీటరు దూరంలో ఉండి మాట్లాడుకునే ప్రయత్నంచేయాలి. సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బయటకు వెళ్లకుంటేనే ఉత్తమం. వెళ్తే మాత్రం మీటరు దూరంలో ఉండి మాట్లాడాలి. ప్రగతిభవన్‌లో ఎన్నో విలేకరుల సమావేశాలు నిర్వహించుకున్నాం. కానీ ఈ రోజు (శనివారం) విలేకరులను కూడా మూడు మూడు ఫీట్ల దూరంలో కూర్చోవాలని చెప్పినం. కారణం ఏందంటే.. మన చేతుల్లో ఉన్నంత వరకు జాగ్రత్తలు పాటిద్దాం.. ఆ తర్వాత భగవంతుడి దయ. చేయగల్గింది.. చేయవల్సింది.. తప్పక చేయాలి. దయచేసి మీరు స్వీయ నియంత్రణ పాటించాలి.


పనిమనుషుల కోసం చూడొద్దు

ఆదివారం పనిమనిషులు రావాలే.. మాకు సేవకులు రావాలే అని చూడవద్దు. ఈ ఒక్కరోజు ధనవంతులు, కల్గినవాళ్లు పనివాళ్లను పిలవకండి. మీ పనులు మీరు చేసుకోండి. ఇవన్నీ పాటిస్తే కరోనా ప్రభావం మనకు రాదు. ప్రతి ఒక్కరు సహకరించాలి.

వృద్ధులు బయటికి రావొద్దు

60 ఏండ్లకు పైబడినవారు, పదేండ్లలోపు పిల్లలు రెండు, మూడు వారాలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటివరకు గమనిస్తే 60 ఏండ్లవారు ఎక్కువగా చనిపోతున్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో కోరాం. మన దగ్గర సీసీఎంబీ ఉన్నదని సూచించాం. దురదృష్టం కొద్దీ మనదగ్గర కూడా పరిస్థితి తీవ్రమైతే రోజుకు వెయ్యిమందిని పరీక్షించే సామర్థ్యం ఉన్నది. దాన్ని కూడా వాడుకొనేందుకు అవకాశం ఇవ్వాలని అడిగాం. ప్రధాని కూడా ఆదేశాలిచ్చారు. అవసరమైతే మనం దాన్ని కూడా వాడుకుంటాం. మన దగ్గర ఉన్న వసతులు, వనరులను ఎలా వాడుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే ప్రయత్నం చేస్తుంది. అందరం కలిస్తే తప్ప కరోనాను నివారించవచ్చు. 

స్వాభిమానం ఉన్న కరోనా!

ఈ కరోనాపై ఒక జోక్‌ తిరుగుతున్నది. కరోనా స్వాభిమానం ఉన్న జబ్బు. అంటే అభిమానం ఉన్న జబ్బు. అది ఉన్న కాడ్నే ఉంటది. దాన్ని మనం ఆహ్వానిస్తే తప్ప మన దగ్గరకి రాదు. మనం రమ్మంటే తప్ప రాదు. దాన్ని మనం ఆహ్వానించవద్దు. అలాంటి జబ్బును కొనుక్కోవద్దు. ప్రభుత్వం ఎంత చెప్పినా.. ప్రజల సహకారం ఎక్కువ అవసరం. ఇలాంటి ఆపత్కాలంలో ఎవరి నియంత్రణ వాళ్లు పాటించి, సంయమనం పాటిస్తే మంచిది. 

 చేతులెత్తి దండంపెట్టి చెప్తున్నా

చేతులెత్తి దండంపెట్టి విజ్ఞప్తి చేస్తున్నా. విదేశాల నుంచి వచ్చిన వాళ్లంతా మా బిడ్డలే.. కానీ, మీరు అనవసరంగా బయట తిరిగి          మీ కుటుంబాన్ని, సమాజాన్ని చెడగొట్టవద్దు. అది సమాజానికి మంచిదికాదు. విదేశాల నుంచి వచ్చినవాళ్లకు నేను మళ్లీ దండంపెట్టి.. నమస్కరించి చెప్తున్నా.. మీరు సమాజహితం కోరి ప్రభుత్వం చెప్పినట్టు వినాలి.. మీకు మీరే స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వండి. అంతేకానీ మీరు పారిపోతుంటే పట్టుకురావడం సరికాదు.


తెలంగాణనే తెచ్చుకున్నోళ్లం..

ప్రతి తెలంగాణబిడ్డ జాతి ఐక్యత, పటుత్వం, జాతి పౌరుషం చూపే తరుణం ఇది. దేశానికి ఆదర్శంగా నిలిచే సమయమిదే. భవిష్యత్తులో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా తెలంగాణ వాళ్లు ఎదుర్కొంటారని నిరూపించాలి. అరవై ఏండ్లు ఆలస్యమైనా కోల్పోయిన రాష్ర్టాన్ని పట్టుబట్టి తిరిగి తెచ్చుకొన్న గొప్పజాతి మనది. మొండి పట్టుదల ఉన్నవాళ్లం. ఇప్పుడు అదే ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ చూపెట్టాలి. ఈ కరోనా.. దేశంలో ఎవరిని ఏంచేసినా.. ఈ తెలంగాణవాళ్లను మాత్రం ఏమీ చేయలేకపోయిందన్న పేరు తెచ్చుకోవాలి.

 చప్పట్లు కొట్టాలంటే మోదీని తిడతారా?

మొద్దులు ఎత్తుకోమనలేదు. బరువులు మోయమనలేదు కదా. రెండు చేతులతో నాలుగు నిమిషాలు చప్పట్లు కొడితే తప్పేంది. ఊరంతా చప్పట్లు మారుమోగుతయి. దీనికి కొంతమంది పనిలేకుండా వక్రబుద్ధితో ప్రధానిని కూడా అవహేళన చేసే విధంగా పోస్టులు పెడుతున్నారు. డీజీపీకి చెప్పుతున్నా. ఇటువంటి వారిని అరెస్ట్‌ చేయాలి.  కేసులు నమోదు చేయాలి. వాళ్లకు బుద్ది వచ్చే విధంగా చేయాలె. సంఘీభావం తెలిపే పనిచేయాలంటే కూడా హేళన చేస్తే, పద్ధ్దతి కాదు. ప్రధాని అంటే గౌరవించాలి. ప్రతిదాన్ని వ్యంగ్యంచేయడం మంచిది కాదు.

మనం పిలిస్తేనే కరోనా వస్తది

ఈ కరోనాపై ఒక జోక్‌ తిరుగుతున్నది. కరోనా స్వాభిమానం ఉన్న జబ్బు. అంటే అభిమానం ఉన్న జబ్బు. అది ఉన్న కాడ్నే ఉంటది. దాన్ని మనం ఆహ్వానిస్తే తప్ప మన దగ్గరికి రాదు. మనం రమ్మంటే తప్ప రాదు. దాన్ని మనం ఆహ్వానించవద్దు. అలాంటి జబ్బును కొనుక్కోవద్దు. ప్రభుత్వం ఎంత చెప్పినా.. ప్రజల సహకారం ఎక్కువ అవసరం. ఇలాంటి ఆపత్కాలంలో ఎవరి నియంత్రణ వాళ్లు పాటించి, సంయమనం పాటిస్తే మంచిది. 

- సీఎం కేసీఆర్‌


logo
>>>>>>