బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 30, 2020 , 02:17:55

కొంచెం నయం తొలగని గండం

కొంచెం నయం తొలగని గండం

 • రాష్ట్రంలో కరోనావైరస్‌ కదలిక ఆగిపోయింది
 • అయినా మహమ్మారి ముప్పుపొంచే ఉన్నది
 • ఏ క్షణం ఎలా మారుతుందో తెలియదు
 • ప్రజలందరికీ తీవ్రమైన క్రమశిక్షణ అవసరం 
 • ప్రభుత్వానికి అన్నిరకాలుగా సహకరించాలి
 • లాక్‌డౌన్‌పాటిస్తే తక్కువనష్టంతో బయటపడతాం
 • వైద్య సిబ్బందితో ప్రత్యేక పూల్‌ ఏర్పాటుచేస్తున్నాం
 • దుర్మార్గపు ప్రచారాలుచేస్తే కఠిన చర్యలు తప్పవు
 • 11 మందికి కరోనా నయం.. నేడు డిశ్చార్జి
 • నేటినుంచి పూర్తికానున్న క్వారంటైన్‌ సమయం
 • ఏప్రిల్‌ 7 వరకు దశలవారీగా ఇంటికి పంపిస్తాం
 • మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా కట్టడి అవుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. అయితే.. గండం నుంచి పూర్తిగా బయటపడినట్లు కాదని.. ఏ క్షణం ఎలా మారుతుందో తెలియదని అన్నారు. ప్రజలంతా చాలా తీవ్రమైన క్రమశిక్షణతో లాక్‌డౌన్‌ పాటించి ప్రభుత్వానికి సహకరిస్తే తక్కువ నష్టంతో బయటపడుతామని పేర్కొన్నారు. గాంధీలో చికిత్స పొందుతున్న కొవిడ్‌-19 పాజిటివ్‌ రోగుల్లో 11 మందికి పూర్తిగా నయమైందని.. వారు సోమవారం డిశ్చార్జి అవుతారని చెప్పారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రంగా కష్టపడుతున్నారని కొనియాడారు. కరోనాపై దుర్మార్గపు ప్రచారాలు చేస్తున్నవారిపై కఠినాతి కఠినంగా చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. శవాలపై పేలాలు ఏరుకొనే చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు చెప్పారు. విపత్కర సమయంలో దేశమంతా ఏకమవుతుందన్నారు. కరోనా, ధాన్యం కొనుగోలు అంశాలపై ఆదివారం ప్రగతిభవన్‌లో జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం సమీక్షించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ప్రసంగం ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 70. ఇందులో ఒక వ్యక్తి డిశ్చార్జి అయ్యారు.

 ఆదివారం అతనితో ప్రధానమంత్రి మోదీ కూడా మాట్లాడారు. తనకు గాంధీ దవాఖానలో చికిత్స బాగా జరిగిందని, వైద్యులు, ఇతర సిబ్బంది బతుకడానికి ఆత్మైస్థెర్యం ఇచ్చారని అతను ప్రధానితో చెప్పారు. ఈరోజు మరో శుభవార్త.. చికిత్సలో ఉన్నవారిలో 11 మందికి నెగెటివ్‌ వచ్చింది. అంటే బీమారీ పోయింది. గాంధీ దవాఖానలో వీరు కోలుకొన్నారు. ఫైనల్‌ రిపోర్డ్‌లో నెగెటివ్‌ వస్తేగానీ ఎవరినీ డిశ్చార్జి చేయరు. ఇందుకు కొన్ని విధివిధానాలుంటాయి. పాజిటివ్‌, నెగెటివ్‌ పరీక్షలు చేయాలి. శరీరంలో వైరస్‌ ఉన్నదా? లేదా? అని పరీక్షిస్తరు. తర్వాత ఛాతి ఎక్స్‌రే తీస్తరు. ఏమాత్రం రిస్క్‌ తీసుకోరు. అందుకే అన్ని పరీక్షలు చేసి జబ్బులేదని తేలితేనే డిశ్చార్జి చేస్తరు. ఇప్పుడు 11 మంది ఫైనల్‌ రిపోర్టులో నెగెటివ్‌ వచ్చింది. వీరు సోమవారం డిశ్చార్జి అవుతున్నారు. ఇంకా చికిత్సలో 58 మంది మిగులుతారు. వీరందరూ కూడా మంచిగా ఉన్నారు. 76 ఏండ్ల ఒక్క వ్యక్తికి మాత్రం కిడ్నీ, ఇతర ఆరోగ్యసమస్యలున్నాయి. ఇతనితోపాటు అందరూ కోలుకొని డిశ్చార్జి అవుతారని నమ్మకమున్నది. 


వైరస్‌ దిగుమతికి ఆస్కారం లేదు

ప్రస్తుతం మన రాష్ట్రంలోకి కొత్తకేసులు వచ్చి చేరే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే అంతర్జాతీయ విమానాలు బంద్‌చేయించినం. పోర్టులు కూడా బంద్‌ అయినవి. అందుకే అంతర్జాతీయంగా వ్యాధి వచ్చి మనమీద పడే ప్రమాదం లేదు. పాజిటివ్‌ వచ్చినవాళ్లు స్థానికంగా అంటిస్తే తప్ప కొత్త కేసులు రావు. కరోనా అనుమానితులందర్నీ తీసుకొచ్చాం. కొత్తగూడెంలో దాదాపు 200 మందిని తెచ్చాం. కొందరు కొత్తగూడెం దవాఖానలో ఉన్నారు. ఆ దరిద్రులు ఆంధ్రలో పెండ్లిళ్లకు పోయి వచ్చారు. ఈ సమాచారాన్ని ఏపీ ప్రభుత్వానికి ఇచ్చాం. మరికొందరిని కరీంనగర్‌లోని ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో సీరియస్‌ అబ్జర్వేషన్లో ఉంచినం. అందుకే కొత్తకేసులు రావద్దని ఆశిద్దాం. భగవంతుడిని ప్రార్థిద్దాం

గుంపు కట్టకపోవడమే ఆయుధం

లాక్‌డౌన్‌ ప్రకటించి భారతదేశం వాళ్లు కొంత తెలివిగల్ల పనిచేసినరని అంతర్జాతీయ మ్యాగజైన్లలో మెచ్చుకొంటున్నరు. ఎందుకంటే మనది పేదదేశం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నది. ఉండాల్సినం త బలంగా వైద్యవసతులు లేవు. అయినా వ్యాధి వ్యా ప్తి నియంత్రణకు లాక్‌డౌన్‌ చేయడమే ఆయుధం. గుంపులుగా చేరకుండా చూడటమే సరైన అస్త్రం. ఆ ఆయుధాన్ని సరిగ్గా వినియోగించుకున్నందున అవుటాఫ్‌ డేంజర్‌గా ఉన్నదని మెచ్చుకొన్నరు. ముఖ్యంగా 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో సమస్య పెరుగనిస్తలేరు. తెలివిగల పనిచేస్తున్నరని అంతర్జాతీయంగా మెచ్చుకొంటున్నరు. అన్నింటిరీత్యా భగవంతుడి దయవల్ల బయటపడాలి. అందుకే ప్రజల్ని మరోసారి కోరుతున్నా... ఈ గండం నుంచి పూర్తిగా బయటపడేవరకు మనకున్న ఒకే ఒక ఆయుధం.. గుంపులుగా చేరకపోవడం, స్వీయ నియంత్రణ పాటించడం, లాక్‌డౌన్‌ కచ్చితంగా పాటించడమే. వైద్యాధికారులు, పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించడమే. ఇదే మన చేతుల్లో ఉన్న ఆయుధం. దీనిని ప్రయోగించి నం. విజయవంతంగా ఉన్నం. వ్యాధికి మందు లేదు. దేశానికి ఉండాల్సిన వైద్య మౌలిక వసతులు లేనందున ఈ ఆయుధాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. 

డేంజర్‌ వైరస్‌.. అందుకే అలర్ట్‌

దక్షిణ కొరియాలో ఒకే ఒక వ్యక్తి కరోనా బారినపడ్డాడు. అతనికి జబ్బు ఉన్నదని కూడా తెల్వదు. వాళ్లు లెక్క తీస్తే ఆ ఒక్కని ద్వారా చాలామందికి వచ్చింది. సూది మొన మీద కొన్ని కోట్ల కరోనా వైరస్‌ క్రిములుంటయట. అది అంత డేంజరస్‌ క్రిమి. అంత స్మాల్‌, షార్ప్‌గా ఉంటది. అందుకే ఒకవ్యక్తి ద్వారా అంతగా సోకింది. తగు జాగ్రత్తగా ఉండటమే తెలివైన పని. అందుకే ఈ గండం దాటేవరకు ప్రజలు మనం బాగున్నమని అనుకోవద్దు. ఏ క్షణంలో ఏ గండం వస్తదో తెల్వదు. చాలా చాలా తీవ్రమైన క్రమశిక్షణ అవసరం. కచ్చితంగా పాటించాలి. ఇప్పటివరకు మంచి సహకారమందిస్తున్నారు. వైరస్‌ మూవ్‌మెంట్‌ కట్‌ అయింది. అన్నిరకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. హోం క్వారంటైన్‌లో ఉన్నవాళ్లను రోజుకు రెండుసార్లు పర్యవేక్షిస్తున్నరు. దానిని కొనసాగించాలని కలెక్టర్లకు ఆదేశించాం. ప్రజలు కూడా సహకరించాలి. తక్కువ నష్టంతో బయటపడే అవకాశం ఉన్నది. మనల్ని మనం నష్టపెట్టుకోకుండా లాక్‌డౌన్‌ను పాటిద్దాం. 

వైద్యసిబ్బందితో ప్రత్యేక పూల్‌

కరోనా వైరస్‌ ఎక్కడ ఆగిపోతుందో మనకు తెల్వదు.. ఎంతదూరం యుద్ధం ఉంటదో తెల్వదు. ఎప్పుడు విస్పోటంలా విజృంభిస్తుందో కూడా అంతుచిక్కకుండా ఉంది.. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. దానికోసమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటన కూడా ఇచ్చారు. కామన్‌ డాక్టర్స్‌ పూల్‌, నర్సెస్‌ పూల్‌, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ పూల్‌, ఇతర వైద్యసిబ్బంది పూల్‌లను రెడీగా ఉంచుకోవాలి. వందమంది డాక్టర్లు అవసరమనుకుంటే 130 మందిని అందుబాటులో ఉంచుకోవాలి. దీనికోసం అందరినీ రిక్రూట్‌ చేయలేము. ఒక పూల్‌ తయారుచేసి వారిసేవలు వినియోగించుకుని వారికి డబ్బులు చెల్లిస్తాం. అందుకే డాక్టర్ల కోసం, నర్సుల కోసం యాడ్‌ ఇచ్చారు. 60ఏండ్ల లోపు వయసు, తగిన అర్హతలు ఉన్నవారిని, అవసరమైతే పీజీ విద్యార్థులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ కూడా తీసుకుంటాం. ఈ కష్ట సమయంలో సేవాభావం కలిగినవారందరూ ముందుకురావాలి. 

విపత్తులో యావత్‌ దేశమొక్కటైతది

నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులో సునామీ వచ్చింది. నాకు ఎవరూ చెప్పలే. నేను సు మోటోగా నిర్ణయం తీసుకుని 300 డాక్టర్లను, రెండు ప్రత్యేక విమానాలను పెట్టి, మెడిసిన్స్‌ను ఇచ్చి పంపించిన. నన్ను ప్రధాని అభినందించారు. ఇవన్నీ డబ్బా కొట్టుకుంటామా. దేశంలో విపత్తువస్తే యావత్తు దేశం ఒక్కటై కొట్లాడుతది. చాలా పెద్ద లాస్‌. మొదటికే మో సం వచ్చేటట్టు ఉన్నది. రూ.12 వేల కోట్లు తెలంగాణకు రావాలి. మార్చి 15నుంచి అల్లికి అల్లి.. సున్నకు సున్నా ఉన్నది. ఎక్సైజ్‌, పెట్రోల్‌, జీఎస్టీ బంద్‌ కదా. అందుకే ఎమ్మెల్యే జీతాలు కూడా బంద్‌ పెట్టాల్సి వస్తుందో తెల్వదు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కోత విధించాల్సి వస్తే విధించాలి కదా. ఎవరూ అతీతులు కాదు. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో భాగం కాదా? కష్టమొస్తే అందరం పంచుకోవాలి. మనం సంక్షోభం లో ఉన్నాం. విపత్తు వచ్చినప్పుడు తగిన విధంగా ఎదుర్కోవాలి. అందరూ తగ్గించుకోవాలి. రెండు బు క్కలు తినేటోళ్లు, ఒకే బుక్క తినాలె. నాలుగు శాకలు తినేవాళ్లు, రెండే తినాలె. ఈ గండం గట్టెక్కే దాకా అం దరమూ నియంత్రణ పాటించాలి. అందరూ కాంప్రమైజ్‌ అయితే సమాజం నడుస్తది. విరాళాలు ఇచ్చేవా రికి శతకోటి దండాలు. రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలి కాబట్టి కొంత మొండిగా ఉండాల్సి వస్తున్నది.

దేవుడు కరుణిస్తే.. ఏప్రిల్‌ 7 నాటికి జీరో..

విదేశాల నుంచి వచ్చినవారికికానీ, వారితో కాంటాక్టు ఉన్నారనే అనుమానంతో కానీ, మొత్తం 25,937 మందిని ప్రభుత్వ వైద్య పర్యవేక్షణలో పెట్టుకొన్నం. మనం నిర్దేశించుకొన్న కటాఫ్‌ తేదీనుంచి వీరిని గుర్తించినం. ఇందులో చాలామందికి క్వారంటైన్‌ సమయం పూర్తి కావస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 5,746 బృందాలు నిరంతరం జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో వారిని పర్యవేక్షిస్తున్నాయి. ఫోన్‌ద్వారాగానీ, వ్యక్తిగతంగా వారి దగ్గరికి పోయి వారిని పర్యవేక్షిస్తున్నరు. ఇప్పటికే 14,556 మంది క్వారంటైన్‌ పూర్తయింది. మిగిలినవారికి మార్చి 30 నుంచి వరుసగా క్వారంటైన్‌ పూర్తవుతుంది. దాని తర్వాత వారికి పర్యవేక్షణ అవసరంలేదు. ఏప్రిల్‌ ఏడోతేదీ వరకు వారందరి క్వారంటైన్‌ టైం అయిపోతుంది. అంటే మొత్తం జీరోకు వస్తుంది. మార్చి 30న 1899 మందికి, 31 వ తేదీన 1440, ఏప్రిల్‌ 1నుంచి ఏడో తేదీ వరకు వరుసగా 1461, 1887, 1476, 1453, 914, 454, 397 మందికి క్వారంటైన్‌ సమయం ముగిసిపోతుంది. ఏప్రిల్‌ ఏడు తర్వాత మన దగ్గర కరోనాకు సంబంధించిన వ్యక్తి ఉండడు. ఆ లోపు దవాఖానలో చికిత్స పొందుతున్నవాళ్లల్లో 30 నుంచి 35 మంది వరకు డిశ్చార్జి అవుతరు. పది నుంచి పన్నెండు మంది మాత్రమే   ఉంటరు. కొత్త కేసులు వచ్చి చేరకపోతే ఇదీ మన రాష్ట్ర పరిస్థితి. 

రిస్క్‌ ఉన్నా  ఈటల పనిచేస్తున్నారు

వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ రోజుకు మూడు, నాలుగుసార్లు సమీక్షలు చేస్తు న్నరు. రిస్క్‌ తీసుకుని దవాఖానలను సందర్శిస్తున్నరు. నేను వస్తానంటే.. ఎందుకు అని గచ్చిబౌలిలో ఆరువేల బెడ్ల దవాఖానను ఆయనే పర్యవేక్షించారు. నిత్యం బులెటిన్‌ విడుదలచేస్తూ ప్రభుత్వమే వాస్తవాలను చెప్తున్నది. ఇటీవల రెం డ్రోజుల్లో 20 కేసులు పెరిగితే ప్రభుత్వం దాయలేదు. శనివారం ఒక శవానికి పరీక్షచేస్తే పాజిటివ్‌ వచ్చింది. అతడు ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో చనిపోకపోయినా ఆ విషయాన్నీ  దాచలేదు. ప్రభుత్వమే బాధితుల లెక్క చెప్తున్నప్పుడు, అనవసర ప్రచారం ఎందుకుచేస్తున్నారు? ఒకవేళ వ్యాధి వ్యాపిస్తే ప్రజలను మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తాం. దీనికెవరూ అతీతం కాదు. బ్రిట న్‌ ప్రధాని, కెనడా ప్రధాని భార్యకూ వచ్చింది.


రాష్ట్రం స్థిమితపడాలె

కరీంనగర్‌ ప్రస్తుతం బాగానే ఉన్నదని కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ చెప్పారు. కొద్దిరోజుల్లో వారి క్వారంటైన్‌ టైం అయిపోతుంది. కరోనా తగ్గుము ఖం పడుతున్నదని చెప్పడంలేదు. ఇప్పటినుంచి కొత్తకేసు రాకుంటే సేఫ్‌గా ఉంటుందని చెప్తున్నా. మనది చాలా పెద్దదేశం, అంతా మంచిగనే ఉన్నదనుకుంటే తెల్లారేసరికి వచ్చిందనుకో, మళ్లా అంటుకుంటే పెద్ద పంచాయితీ. కాబట్టి రాష్ట్రంగా మనం కొద్దిగా స్థిమితపడాలె. తర్వాత దేశం స్థిమితపడాలె. లక్షణాలుంటే వైద్యులు చెప్తారు. ఏది ఉన్నా దయచేసి తొందరగా బయటపడాలని దేవున్ని కోరుకుందాం. అందరికన్నా ఎక్కువగా నేనే కోరుకుంటున్నా. కానీ తగ్గేంతవరకు నియంత్రణలో ఉండాలి, వేరేగతి లేదు.

దుర్మార్గ ప్రచారాలపై కఠినచర్యలు

ఇప్పుడు ప్రజలు అందిస్తున్న సహకారం పూర్తిస్థాయిలో కొనసాగాలి. అదేసమయంలో సోషల్‌ మీడియాలోగానీ, ఇతర మాధ్యమాల్లో గానీ దుర్మార్గమైన ప్రచారాలు చేసేవారికి భయంకరమైన శిక్షలుంటాయి. ఆ శిక్షలు ఎట్లుంటాయో చూపిస్తా. మేమే గొప్పవాళ్లమని కొందరు మూర్ఖులు అనుకొంటారు. వారు చేసేదానికి వందరెట్లు శిక్ష అనుభవిస్తారు.  దేశం, ప్రపంచమే అల్లకల్లోలమవుతున్న విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి దిక్కుమాలిన, చిల్లర ప్రచారాలు ఎందుకు చేయాలి? అలాంటివారికి అందరికన్నా ముందు కరోనా సోకుతుంది. ఆ దుర్మార్గులకు సోకాలి కూడా. ఎందుకు ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు? ప్రశాంతంగా ఉన్నవారిని మానసికంగా హింసిస్తున్నారు. 

చిల్లర రాజకీయాలొద్దు

కేంద్రప్రభుత్వం వేరే, రాష్ట్రప్రభుత్వం వేరే ఉండదని సీఎం చెప్పారు. తాము 12కిలోల బి య్యం ప్రకటించామని, కేంద్రం కొంత తక్కువ ప్రకటించినంత మాత్రాన వారేం తక్కువ కాదన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. ఇలాంటి శవాల మీద పేలాలు ఏరుకునుడు వద్దని సూచించారు. ‘ఒకవేళ మా దగ్గర డబ్బులు నిండుకున్నాయి. ఏం చేస్తం. ప్రధాని, ఆర్బీఐ గవర్నర్‌తో మాట్లాడి,  రూ.10వేల కోట్ల ఓడీ కావాలని కోరి తీసుకుం టం. ప్రజలను చంపుకోం కదా. సమయ సందర్భాలను బట్టి, పరిస్థితులనుబట్టి, అందరం సమన్వయంచేసుకుని పనిచేస్తం. అవసరముంటే ప్రధానితో మాట్లాడుతం. నేనుకూడా మాట్లాడిన. మందులు అవసరమవుతాయి, వెంటిలేటర్లు అవసరమవుతాయి. ఓ రాష్ట్రంలో ఎక్కువ కావచ్చు. ఓ రాష్ట్రంలో తక్కువ కావచ్చు. అన్ని కలిపిచేస్తం’ అని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ సార్‌ సెల్యూట్‌


అరవై ఏండ్లు అరిగోస పడ్డ తెలంగాణ బిడ్డలను ఏకంచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ప్రత్యేక రాష్ట్రం సాధించి ఆత్మగౌరవ బావుటా ఎగురవేశారు. నేడు తెలంగాణ అన్నింటా ఆదర్శంగా దూసుకెళ్తుండటాన్ని చూసి నాడు కేసీఆర్‌ పిలుపుతో ఉద్యమంలో పనిచేసిన నాలాంటి కార్యకర్తల గుండెలు సంతోషంతో ఉప్పొంగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ.. ఎలాంటి విపత్తునైనా తెలివిగా, తెగువతో ఎలా ఎదుర్కొని నిలిచి గెలుస్తుందో కరోనా పోరాటంతో మరోసారి నిరూపించుకుంటున్నది. ముందుచూపు, ఆత్మవిశ్వాసం అన్నింటికంటే ఎక్కువ నా అనే పట్టింపు (అదే కన్న తండ్రికి ఉండే వెలకట్టలేని ప్రేమ).. కరోనా వైరస్‌ విజృంభించిన నాటినుంచి నేటివరకు అనేక సందర్భాల్లో ప్రెస్‌ ద్వారా ప్రజలను మెప్పించారు. వారిలో విశ్వాసం నింపారు. ఏదీ కొరత లేకుండా చూశారు. మరోవైపు రైతుల పంటలపై శ్రద్ధ పెట్టారు. ఇలా బహురూపాల్లో తెలంగాణను ఫలవంతమైన మేటి రాష్ట్రంగా నిలుపడం బాపు కేసీఆర్‌తో తప్ప మరెవ్వరితో కాదన్నది ఎవరైనా ఒప్పుకోవాల్సిన సత్యం. అనునిత్యం తెలంగాణ ప్రయోజనాలను మాత్రమే ఆలోచించే (కన్నతండ్రి) సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకోలేనిది.

- మాదాసు శ్రీనివాస్‌, గజ్వేల్‌ టీఆర్‌ఎస్‌ నేత


logo