శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Mar 25, 2020 , 01:09:36

ఇల్లు కదలొద్దు

ఇల్లు కదలొద్దు

  • ప్రజలంతా నియంత్రణ పాటించాల్సిందే లేకుంటే 24 గంటల కర్ఫ్యూ 
  • అప్పటికీ వినకుంటే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు
  • అవసరమైతే రంగంలోకి ఆర్మీ
  • ఆ పరిస్థితులను కొనితెచ్చుకోవద్దు
  • మీడియాతో సీఎం కేసీఆర్‌

ప్రజలు మనవాళ్లు కాబట్టి మంచి పద్ధతిలో సంజాయించి ముందుకుపోవాలని ప్రభుత్వపరంగా చర్యలు తీసుకొంటున్నం. దానికి ప్రజలు వందశాతం సహకరించాలి. లేకుంటే ప్రొసీడింగ్స్‌ ఆగుతయా అంటే ఆగవు. అమెరికా వంటి దేశం.. అంత మెచ్యూరిటీ ఉండే దేశం అక్కడ స్థానిక పోలీసులు కంట్రోల్‌ చేయలేక ఆర్మీని పిలిపించారు. ఆర్మీకి అప్పగించారు. మన దగ్గర కూడా ఏమైతదంటే, పోలీసులకు సహకరించకుంటే అటోమేటిక్‌గా 24 గంటల కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇవ్వాల్సివస్తుంది. అప్పటికి కూడా కంట్రోల్‌ కాకుంటే ఆర్మీకి అప్పగించాల్సి వస్తుంది. ఆర్మీకి అప్పగించే పరిస్థితిని తెచ్చుకొందామా? 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను ప్రజలంతా కచ్చితంగా పాటించి తీరాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ గడువు పూర్తయ్యేదాకా ఏ ఒక్కరూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు వదిలి బయటకు రావొద్దని స్పష్టంచేశారు. ప్రభుత్వం ప్రజలకు మంచి పద్ధతిలో చెప్పి ముందుకు పోవాలని చూస్తున్నదని, అందుకు ప్రజలు నూటికి నూరుశాతం సహకరించాలని కోరారు. ప్రజలు నియంత్రణ పాటించకుంటే.. 24 గంటల కర్ఫ్యూ విధించాల్సి ఉంటుందని.. అప్పటికీ వినకుంటే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇవ్వాల్సివస్తుందని.. అవసరమైతే ఆర్మీని కూడా రంగంలోకి దింపాల్సి వస్తుందని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి నిరోధంపై తీసుకొంటున్న చర్యలపై మంగళవారం ప్రగతిభవన్‌లో దాదాపు ఐదు గంటలటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ కరో నా కట్టడికి తీసుకొంటున్న చర్యలు, ప్రజలనుంచి అందాల్సిన సహకారంపై మాట్లాడా రు. సీఎం ప్రసంగం.. ఆయన మాటల్లోనే..

అంతా కోలుకొంటున్నారు

కరోనాకు సంబంధించి ఇప్పటివరకు పాజిటివ్‌ వచ్చిన కేసులు 36. ఒకరు ట్రీట్‌మెంట్‌ తీసుకుని వెళ్లిపోవడంతో 35 కేసులు ఉన్నాయి. ఎవరికి కూడా ప్రమాదంలేదు. ఆక్సిజన్‌, వెంటిలేటర్లు పెట్టడంలేదు. అంతా కోలుకొంటున్నరు. ఇప్పడు ఉన్నవాళ్లు ఇంచుమించుగా ఏప్రిల్‌ 7 వరకు కోలుకొంటరు. ఈ లోగా కొత్తకేసులు రాకుంటే జీరోకు పోతాం. కాబట్టి మనకు పెద్దగా ప్రబలకపోవచ్చు. కానీ ముందుజాగ్రత్త చర్యలు మాత్రం గట్టిగా తీసుకోవాల్సిన అవసరమున్నది. 195 దేశాలకు కరోనా పాకింది. ఫారిన్‌ నుంచి వచ్చినవారు తిరిగినచోట వాళ్లకు కూడా సంక్రమించి ఉంటుందేమో అని అనుమానించి 19,313 మందిని సర్వైలెన్స్‌లో పెట్టినం. జిల్లా కలెక్టర్లు, అధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌లో స్ట్రిక్ట్‌గా ఆదేశాలిచ్చినం. వాళ్ల పాస్‌పోర్టులను సీజ్‌ చేయాలని చెప్పినం. ఒక వ్యక్తి నిర్మల్‌లో మూడుసార్లు కంటిన్యూగా తప్పించుకున్నడు. వీళ్లను కంట్రోల్‌ చేయాల్సిందే. కరోనా లక్షణాలున్న అనుమానితులు 114 మంది ఉన్నా రు. వీరిలో 82 మంది విదేశాల నుంచి వచ్చినవాళ్లున్నరు. వీరిలో 32 మందికి సోకి ఉండవచ్చనే అనుమానమున్నది. వీళ్ల నమూనాలు పరీక్షలకు పంపించాం. బుధవారం రిపోర్టులు వస్తాయి. ఎంతమందికి పాజిటివ్‌ ఉన్నదో తెలుస్తుంది. 


అప్రమత్తంగా ఉండాలి

ప్రధానమైన విషయాన్ని ప్రజలకు మనవిచేస్తున్న. ఈ జబ్బు పెద్ద మహమ్మారి. యావత్‌ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. ఒక ఊరికో, పల్లెకో, వ్యక్తికో పరిమితం కాలేదు. పరిమిత సమస్య కాదు. ఇది ప్రత్యేక సందర్భం. ప్రత్యేక పరిస్థితి. కాబట్టి అందరం అప్రమత్తంగా ఉండాలి. కరోనాపై కొందరు కవులు మంచి కవిత్వాలు రాశారు. ఐనంపూడి శ్రీలక్ష్మి అనే కవయిత్రి అద్భుతమైన కవితరాశారు. ఇప్పుడు క్వారంటైనే మన వాలంటైన్‌ అన్నారు. గొప్ప భావం ఇది. రాష్ట్రంలో ఉన్న కవులందరినీ కోరుతున్న. మంచి కవితలు రాయాలి. టీవీ వాళ్లను కోరుతున్న.. కరోనా మీద ప్రజలను చైతన్యపర్చేవిధంగా కవి సమ్మేళనాలు నిర్వహించాలి. 


స్టాండింగ్‌ కమిటీల భాగస్వామ్యం

పంచాయతీల్లో 8,20,727 మంది స్టాండింగ్‌ కమిటీ సభ్యులున్నారు. మున్సిపాలిటీ స్టాండింగ్‌ కమిటీలో 3,400 సభ్యులున్నారు. వార్డుల్లో 2,04,300 మంది సభ్యులున్నారు. మొత్తం కలిపితే పది లక్షలమంది ఉన్నారు. వీళ్లందరితో ప్రజాసైన్యం తయారుకావాలి. ఆయా వార్డుసభ్యులు, సర్పంచ్‌లు, మేయ ర్లు, చైర్మన్లు.. తమ తమ స్టాండింగ్‌ కమిటీ సభ్యులను కలుపుకొని పనిచేయాలి. ఏ ఊరి సర్పంచ్‌ ఆ ఊరి కథానాయకుడు కావాలి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యేలు, సింగిల్‌ విండో చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు అంతా తమ తమ పరిధుల్లో కథానాయకులు కావాలి. ప్రజల మధ్యలో పోలీసులతో కలిసి పనిచేయాలి. ఎక్కడైనా దుర్మార్గులు ఉంటే మనం కూడా లాఠీ పట్టుకొని నిలబడాలి. కొట్టాలని కాదు కానీ.. అంత కచ్చితంగా పనిచేస్తేనే ఈ సమస్యను అధిగమిస్తాం. ఎవరి గ్రామం వాళ్లు, ఏ పట్టణం వాళ్లు సమన్వయం చేసుకుంటే ఈ సమస్య ఇంత పెద్దగ రాదు.

హోం క్వారంటైన్‌లపై నిఘా

హోం క్వారంటైన్‌లో ఉన్నవారిపై గట్టి నిఘా పెట్టాలని చెప్పినం. వారి పాస్‌పోర్టులను సీజ్‌చేయమని చెప్పినం. కొందరు పారిపోతున్నారు. నకరాలు చేస్తున్నారు కాబట్టి, పాస్‌పోర్టులను సస్పెండ్‌ కూడా చేయిస్తాం. పౌర సమాజానికి శత్రువులుగా పరిణమించేవాళ్లు కాబట్టి, సమాజ శ్రేయస్సుకే భంగం వాటిల్లజేస్తామంటే వాళ్లకు సమాజంద్వారా లాభాలు పొందే అర్హతలేదు. కాబట్టి, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలిచ్చినం. చెక్‌పోస్టుల వద్ద రకరకాల వస్తువుల్ని తెచ్చిన వాహనాలు 3,400 దాకా ఉన్నాయి. వాటికి సంబంధించి ఈ ఒక్కరోజు టోల్‌ను మాఫీచేస్తు న్నాం. ఇందుకు సంబంధించి రవాణా, పోలీసుశాఖలకు ఆదేశాలిచ్చాం. ఈ రాత్రికి అవన్నీ ఫ్రీ అయిపోతాయి. తెల్లారేసరికి వారి సరఫరా మొత్తం ముగిసిపోవాలి. 

అత్యవసరాల్లో డయల్‌ 100

ఎక్కడో మారుమూల గ్రామంలో ఎవరికైనా అపెండిసైటిస్‌ నొప్పి రావొచ్చు లేదా గుండెజబ్బు రావొచ్చు. ఎవరికైనా బంధువు చనిపోవచ్చు లేదా తండ్రి చనిపోవచ్చు. ఇలా ప్రజలకు రకరకాల సమస్యలు రావొచ్చు. దీంతో ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు కొడుకు పోవాల్సి రావొచ్చు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాల్సి రావొచ్చు. డెత్‌ విషయంలో కానీ ఎమర్జెన్సీ విషయంలో కానీ ఇంకా ఏమైనా అత్యవసరాలు తలెత్తితే, 100కు డయల్‌ చేయాలి. వెంటనే అధికారులు స్పందిస్తారు. సాయం చేస్తారు. అవసరమనుకుంటే వాహనం కూడా సమకూరుస్తారు. 

ఆపత్కాలంలో ప్రజలవెంటే ఉండాలి

హైదరాబాద్‌లోగానీ, జిల్లాల్లోగానీ నియంత్రణ విషయంలో పోలీసులు, కలెక్టర్లు, మున్సిపల్‌, ఇతర సిబ్బంది కనపడుతున్నరు. ప్రజాప్రతినిధులంతా ఎక్కడికిపోయారు? జీహెచ్‌ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఏంచేస్తున్నరు? బాధ్యతలేదా? వందశాతం వెంటనే రంగంలోకి దిగాలి. జంటనగరాల్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్మన్లు అంతా రంగంలోకి దిగాలి. చౌరస్తాలో నిలబడాలి.  ఇలాంటి ఆపత్కాల పరిస్థితుల్లో మనం ప్రజలతో ఉన్నామా? లేదా? అనే చూస్తరు. ప్రజాప్రతినిధులంతా స్థానిక పోలీసులతో కో-ఆర్డినేషన్‌ చేసుకొని ఎక్కడ లోటుపాట్లు లేకుండా, అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలి. ప్రతి చెక్‌పోస్ట్‌ దగ్గర మనమే ఉండాలి.  అది మన విధి. బాధ్యత. ఈ సమయంలోనే మనం పనిచేస్తమని ఎన్నుకొన్నరు. మనం గెలిచిందే వాళ్లకోసం. ఇలాంటి ఆపత్కాల పరిస్థితు ల్లో ప్రజలతో ఉండాలి. ప్రజలకోసం పనిచేయాలి. మంత్రులంతా తమ తమ జిల్లాలకు పోవాలి. జిల్లా కేంద్రాల్లో ఉండాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీమీ నియోజకవర్గాల్లోనే ఉండి పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులతో సమన్వయంచేసుకోవాలి. ఇద్దరు ముగ్గురు ఆరోగ్య, వ్యవసాయ, మున్సిపల్‌ మంత్రులు కొంత అటూఇటూ తిరిగినా పర్వాలేదు. మిగిలినవారంతా వారి నియోజకవర్గాలకు పోయి సమస్యను ఎదుర్కొనేవిధంగా ప్రజలను చైతన్యపరచాలి.

ప్రగతిభవన్‌లో గంగాళం..

 వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రగతిభవన్‌ నుంచే ప్రారంభించారు. ఇందుకోసం ప్రగతిభవన్‌ బయట రెండు పెద్దగంగాళాల్లో నీళ్లు పెట్టారు. సబ్బులు, శానిటైజర్‌ను ఉంచారు. మంగళవారం సీఎం కేసీఆర్‌ నిర్వహించిన రాష్ట్రస్థాయి అత్యున్నతస్థాయి సమావేశానికి హాజరైన మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోపాటు వైద్యారోగ్య, పోలీస్‌, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక తదితరశాఖలకు చెందిన ముఖ్యకార్యదర్శులు సబ్బుతో చేతులు కడుక్కొని, శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్నాకే ప్రగతిభవన్‌లోకి ప్రవేశించారు. ప్రతిఇంట్లో, ప్రతి కార్యాలయంలోనూ ఇలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ సూచించారు.


logo