శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 02:56:39

నిర్లక్ష్యం వద్దు

నిర్లక్ష్యం వద్దు

 • మాకేమైతదన్న ధోరణి కూడదు.. ముందు జాగ్రత్తే శ్రీరామరక్ష
 • వ్యక్తిగత నియంత్రణ, క్రమశిక్షణ, పారిశుద్ధ్యం అవసరం.. కరోనా కట్టడికి ఇదే పరిష్కారం
 • మాల్స్‌, దుకాణాలు తెరిచే ఉంటాయి
 • యథాతథంగా రియల్‌ఎస్టేట్‌, వ్యవసాయ మార్కెట్లలో లావాదేవీలు 
 • వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 18 చెక్‌పోస్టులు
 • అంతర్జాతీయ విమానాలను వెంటనే రద్దుచేయాలి
 • వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో సీసీఎంబీ సహకారంపై ప్రధానిని కోరుతా
 • కరోనాపై ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
 • రాష్ట్రంలో ప్రార్థనాలయాలన్నీ బంద్‌
 • అన్ని మతాల పెద్దలు సహకరించాలి
 • రాష్ట్రంలో షబ్బే మిరాజ్‌, ఉగాది,శ్రీరామనవమి ఉత్సవాలు రద్దు 
 • విదేశాలనుంచి వస్తే నేరుగా క్వారంటైన్‌కే
 • మార్చి 1 తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారంతా ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాలి
 • 31 వరకు సెలవులు కొనసాగుతాయి 
 • మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌

ఏ దేశంలో మంచి చర్యలు తీసుకొన్నరో.. అక్కడ సమస్య వస్తలేదు. ఎక్కడైతే తీసుకోలేదో అక్కడ సమస్య వస్తున్నది. ఇటలీ, ఇరాన్‌ రెండూ జాగ్రత్తలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయినయి. వాళ్లు మతసంబంధ ఉత్సవాలకు గుడ్డిగా అనుమతులు ఇచ్చినారు. చైనా కూడా ప్రాథమికంగా నిర్లక్ష్యంచేసింది. అందుకే చాలా ఇబ్బందులు పడుతున్నరు. తెలంగాణలో అట్ల ఇబ్బందులు రావద్దని ముందునుంచి జాగ్రత్తలు పాటిస్తున్నం. టఫ్‌గా పోతేనే మంచిదని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నం. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత నియంత్రణ, వ్యక్తిగత క్రమశిక్షణ.. ఈ మూడింటినీ పాటించడమే కరోనా కట్టడికి సరైన పరిష్కారం. ముందుజాగ్రత్త పడటమే రాష్ర్టానికి శ్రీరామరక్ష. అన్నింటికీ మించి మంది గుమిగూడకుండా ఉండటమే కరోనాకు అసలైన మందు. మాకేమయితదిలే అన్న నిర్లక్ష్యం పనికిరాదు’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు సూచించారు. కరీంనగర్‌లో ఇండోనేషియా నుంచి వచ్చిన ఎనిమిది మంది విదేశీయులకు కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లాలను అప్రమత్తంచేశామని చెప్పారు. మార్చి 1 తర్వాత విదేశాలనుంచి రాష్ర్టానికి వచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తించి పరీక్షిస్తామన్నారు. ప్రాథమికస్థాయిలో నిర్లక్ష్యం వహించిన దేశాలు ఇప్పుడు బాధలు అనుభవిస్తున్నాయని, కఠినచర్యలు తీసుకొన్న దేశాలు మంచిగా ఉన్నాయని పేర్కొన్నారు. 

తెలంగాణలో కూడా ప్రభుత్వం కరోనా నియంత్రణకు అన్నిరకాల చర్యలను కఠినంగా చేపట్టిందని చెప్పారు. అంతమాత్రాన ఎవరూ భయపడాల్సిన పనిలేదని స్పష్టంచేశారు. సూపర్‌మార్కెట్లు, షాపింగ్‌మాల్స్‌ యథాతథంగా పనిచేస్తాయని, నిత్యావసర సరుకులకు ఎలాంటి లోటు ఉండదని పేర్కొన్నారు. రియల్‌ఎస్టేట్‌, వ్యవసాయ సంబంధ లావాదేవీలు కొనసాగుతాయన్నారు. రాష్ట్రంలోని అన్ని మతాల ప్రార్థనాలయాలను మూసివేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణపై గురువారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు 14

కరోనా వైరస్‌కు సంబంధించి నిన్న కరీంనగర్‌ ఉదంతం దృష్ట్యా గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను పిలిచి విస్తృతంగా చర్చించాం. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 14. ఇందులో ఐదుగురు మాత్రమే విదేశాల నుంచి వచ్చి విమానాశ్రయంలో దిగినవారు. మిగతా తొమ్మిదిమంది పక్క రాష్ర్టాల్లోని వేరే విమానాశ్రయంలో దిగి రోడ్డు, రైలు, ఇతర మార్గాల్లో రాష్ట్రంలోకి వచ్చినవాళ్లు. అది కనిపెట్టడం కొంత ఇబ్బందిగా ఉన్నది. నిన్న రామగుండం వాళ్లు అదే పద్ధతిలో మత ప్రచారంకోసం వచ్చినారు. 48 గంటలు కరీంనగర్‌లో ఉన్న తర్వాత మనకు సమాచారం రావడంతో వెంటనే వాళ్లను తీసుకొచ్చి క్వారంటైన్‌చేసి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నాం. ఇట్ల ఎంతమంది వచ్చినారనేది ఇప్పుడు ప్రశ్న. ముందుజాగ్రత్త తీసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశముంటుంది. 

తైవాన్‌ చర్యలు భేష్‌

తైవాన్‌ దేశం చైనా పక్కనే ఉంటది. కానీ అక్కడ ఇబ్బంది లేదు. ఎందుకంటే మొదటిరోజునుంచే వాళ్లు చాలా కఠినమైన జాగ్రత్తలు తీసుకొన్నారు. ఏ దేశంలో మంచి చర్యలు తీసుకొన్నరో.. అక్కడ సమస్య వస్తలేదు. ఎక్కడైతే తీసుకోలేదో అక్కడ సమస్య వస్తున్నది. ఇటలీ, ఇరాన్‌ రెండూ జాగ్రత్తలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయినయి. వాళ్లు మతసంబంధ ఉత్సవాలకు గుడ్డిగా అనుమతులు ఇచ్చినారు. చైనా కూడా ప్రాథమికంగా నిర్లక్ష్యంచేసింది. అందుకే ఇబ్బందులు పడుతున్నరు. తెలంగాణలో అట్ల ఇబ్బందులు రావద్దని ముందునుంచి జాగ్రత్తలు తీసుకొంటున్నాం. టఫ్‌గా పోతేనే మంచిదని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నం. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదు. 

సినిమా థియేటర్లు, ఫంక్షన్‌ హాళ్లు, బార్లు, క్లబ్బులు, పార్కులు, స్విమ్మింగ్‌పూల్స్‌ మూసివేతను 31 వరకు పొడిగిస్తున్నం.సభ లు, సమావేశాలు ఎట్టి పరిస్థితిలో అనుమతించబడవు. విద్యాసంస్థలకు సెలవులు కొనసాగుతాయి. ప్రజారవాణా వాహనా ల్లో హైశానిటైజేషన్‌ చేయాలని, గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో శానిటైజేషన్‌ పనులు పెంచాలని కఠిన ఆదేశాలిచ్చాం. ముస్లిం సోదరులు షాదీఖానాలు మూసేయాలని కోరుతున్నరు. అన్ని మ్యారేజి హాళ్లను సీల్‌చేయాలని కలెక్టర్లు, పోలీస్‌శాఖకు ఆదేశాలిచ్చినం. ఇప్పటికే పెండ్లిళ్లు నిర్ణయం అయినవి ఉంటే  ఈ నెల 31 వరకు అనుమతించాం కాబట్టి వారు చేసుకోవచ్చు. ఎట్టిపరిస్థితుల్లో 200 మందికి మించకుండా రాత్రి 9 గంటలలోపే ఫంక్షన్‌ ముగించుకోవాలి. 

రాష్ట్ర సరిహద్దులో 18 చెక్‌పోస్టులు

తెలంగాణమీదుగా సరిహద్దు రాష్ర్టాల నుంచి 84 రైళ్లు వచ్చి పోతయి. అందులో చాలామంది వచ్చిపోతుంటరు. అందుకే దక్షిణ మధ్య రైల్వేవారితో మాట్లాడి తగినచర్యలు తీసుకోవాలని కోరినం. శుక్రవారం ప్రధానమంత్రి మోదీ దేశంలోని అందరు సీఎంలతో నిర్వహించే వీడియో  కాన్ఫరెన్స్‌లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తాం. తెలంగాణకు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఏపీ రాష్ర్టాల సరిహద్దు ఉన్నది. ఇక్కడినుంచి మన రాష్ట్రంలోకి వచ్చేవాళ్లలో విదేశాలనుంచి వచ్చినవాళ్లు కూడా ఉండే అవకాశమున్నది. అందుకే జాతీయ, రాష్ట్ర రోడ్లపై 18 చెక్‌పోస్టులు కూడా తెరుస్తున్నాం. వాహనాలను తనిఖీ చేసి.. విదేశాల నుంచి వచ్చిన వారుంటే వెంటనే వారిని హోం క్వారంటైన్‌ చేస్తరు. 

యథావిధిగా పది పరీక్షలు

రాష్ట్రంలో ప్రారంభమైన టెన్త్‌పరీక్షలను కొనసాగిస్తాం. విద్యార్థులు ముందుగానే పరీక్షలకు సిద్ధమై ఉన్నరు. వారి మూడ్‌ దెబ్బ తినవద్దని కొనసాగిస్తున్నం. పరీక్షాకేంద్రాలను హై శానిటైజ్‌ చేయాలని ఆదేశాలు జారీచేసినం. ఇప్పటికే ఇంటర్‌ పరీక్షల్ని పూర్తిచేసినం. 10 రోజులైతే టెన్త్‌ పరీక్షలు కూడా పూర్తవుతయి. 

నిత్యావసరాలకు ఇబ్బంది లేదు

ప్రజలకు నిత్యావసరాలు పొందే షాపింగ్‌మాల్స్‌, కిరాణా, ఇతర దుకాణాలను మూసివేయడం లేదు. ఇప్పటికి భయోత్పాతం కలిగించే పరిస్థితి లేదు. అందుకే వాటిని కొనసాగిస్తున్నం. జనం ఎక్కువగా పోగవకుండా ఉండేలా వాళ్లే స్వీయ నియంత్రణ పాటించాలని కోరుతున్నం. వీటిని కూడా మూసివేస్తే బ్లాక్‌మార్కెట్‌ వాళ్లు సామాన్య జనాన్ని ఇబ్బందులకు గురిచేసే అవకాశమున్నందున వీటిని తెరిచే ఉంచాలని నిర్ణయించినం. 

విదేశాలనుంచి వచ్చిన వారికే వైరస్‌

అన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిలేదు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 166 నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు చనిపోయారు. తెలంగాణలో 14 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. వీరంతా విదేశాలనుంచి వచ్చిన వారే తప్ప తెలంగాణలో నివాసముంటున్న వాళ్లెవరూ లేరు. ఈ వైరస్‌ బయటినుంచి వచ్చిందేగానీ ఇక్కడిది కాదు. ఇక్కడ నివసించే ఏ ఒక్కరికీ వైరస్‌ సోకినట్లుగా రిపోర్టు కాలేదు. కావద్దని భగవంతుడిని కోరుకుంటున్నాం. 

ముందుజాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష

ముందు జాగ్రత్తచర్యలే మనకు శ్రీరామ రక్ష.. ముందు జాగ్రత్త చర్యలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంతమంచిది. వ్యక్తిగత పరిశుభ్రత.. వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత నియంత్రణ..ఇవే మనకి ఇప్పుడు శ్రీరామరక్ష. పనిఉన్నా లేకున్నా వీధుల్లో తిరుగకుండా తప్పనిసరైతేనే బయటికి వెళ్లేలా.. ఎవరి ఇంటిని వారు క్వారంటైన్‌ చేసుకుంటే మేలు. బయటికి వెళ్లడం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మీడియా కూడా దీనిపై వీలైనంత వరకు ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేయాలి. తైవాన్‌లో బ్రహ్మాండంగా కాపాడుకున్నారు. వారు అక్కడ కఠినంగా ఉన్నారు కాబట్టి అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు. మనదేశంలో కూడా అంతర్జాతీయ విమానాలను వెంటనే రద్దుచేయాల్సి ఉండే. కేంద్రం ఎందుకు చేయలేదో అర్థంకాలేదు. ఈ విషయాన్ని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని దృష్టికి తీసుకొస్తా. తక్షణమే అంతర్జాతీయ విమానాలను బంద్‌చేయాలని కోరుతాం. విదేశాల్లో చిక్కుకుపోయినవారిని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేసేలా కేంద్రంతోపాటు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. 

వైరస్‌ సోకిన వారంతా క్షేమమే 

కరోనా సోకి చికిత్స పొందుతున్న 14 మంది బాగానే ఉన్నారు. ఎవరూ ప్రాణాపాయ స్థితిలో లేరు. ఏ ఒక్కరికీ కనీసం వెంటిలేటర్‌ కూడా పెట్టే పరిస్థితి కూడా రాలేదు. అందరూ బతుకుతారు.  కరీంనగర్‌లో ఇండోనేషియా నుంచి వచ్చినట్టు పట్టుబడినవారు ఒప్పుకున్నారు.  

గుమికూడకపోవడమే మంచిది 

దయచేసి ఎక్కువగా గుమికూడకపోవడమే మనకు సేఫ్‌. ఆలయాలు, మసీదులు, చర్చిలు బంద్‌పెట్టుకుంటున్నప్పుడు మిగతావాటి విషయంలో భేషజాలు వద్దు. మాకు ఏమైతదిలే అన్న నిర్లక్ష్యం పనికిరాదు. ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.. జనసమ్మర్దం ఉన్న చోటుకు వెళ్లవద్దు. గుంపులు కట్టొద్దు. మన రాష్ర్టాన్ని, మన పిల్లలను కాపాడుకోవాలి కాబట్టి ఈ కనీస జాగ్రత్తలు ప్రజలు పాటించాలి. వ్యక్తిగత పారిశుద్ధ్యం, గ్రామపారిశుద్ధ్యం, పట్టణ పారిశుద్ధ్యం చక్కగా పాటించి ముందుకు వెళదాం. రాష్ర్టాన్ని కాపాడుకుందాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దయచేసి ప్రజలు సహకరించి నియంత్రణ పాటించాలి.

సీసీఎంబీ కోసం ప్రధానిని కోరతా  

మన దగ్గర ఉన్న సీసీఎంబీలో ఒకేసారి 500 నుంచి 600 మందికి స్క్రీనింగ్‌చేసే కెపాసిటీ ఉన్నది. సీసీఎంబీ కేంద్ర నియంత్రణలోని సంస్థ కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకొనే అవకాశం కల్పించాలని ప్రధానమంత్రిని వీడియో కాన్ఫెరెన్స్‌లో కోరతా. కరోనా తుది నిర్ధారణచేసే అధికారమూ మనకు లేదు. ప్రాథమికంగా నిర్ధారించుకున్న తర్వాత శాంపిల్స్‌ను కేంద్ర ప్రభుత్వ ల్యాబ్స్‌కు పంపాల్సిందే.   

అంత ప్రమాదమేమీ లేదు

ఉద్యోగులకు సెలవులిచ్చే అంశమేమైనా ప్రభుత్వ యోచనలో ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్‌ జవాబిస్తూ.. ‘అంత ప్రమాదకరమైన పరిస్థితులు మనదగ్గర ఇప్పుడు లేవు. అన్ని యథావిధిగా ఉంటాయి. ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మన దగ్గర నిర్మాణరంగం, రియల్‌ఎస్టేట్‌  చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజలను కూడా బతుకనివ్వాలి. వ్యవసాయ మార్కెట్లకు వచ్చే రైతులు ఉంటారు. వాళ్లను మార్కెట్లకు రావొద్దని అంటే ఆ రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. రోజువారీగా జరిగే పనులను అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అంత ఉత్పాత పరిస్థితి వస్తే దానికి తగ్గట్టు చర్యలు ఉంటాయి. ఇప్పటికి ఆ పరిస్థితి లేదు’ అని  సీఎం వెల్లడించారు.  ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, మహమూద్‌ అలీ, ఎర్రెబెల్లి దయాకర్‌రావు, సబితాఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఫారిన్‌ నుంచి వస్తే క్వారంటైన్‌కే..

విదేశాల నుంచి ఇతర రాష్ర్టాల్లోని విమానాశ్రయాల్లో దిగి.. ఆ తర్వాత మన రాష్ట్రంలోకి రోడ్డు, రైలు, ఇతర మార్గాల్లో వచ్చినవారిమీద పూర్తి నియంత్రణ పెట్టాల్సి ఉన్నది. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినం. మార్చి ఒకటి తర్వాత విదేశాలనుంచి వచ్చి.. వారివారి గ్రామాల్లో నివసిస్తున్నవారిని ఈ రెండు మూడు రోజుల్లో గుర్తించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీచేసినం. గ్రామ సర్పంచ్‌లు, మున్సిపల్‌ సిబ్బందిని కూడా వినియోగించి వివరాలు తీసుకొంటం. ఇప్పటికే ప్రతి గ్రామానికి ఒక పోలీస్‌ను నియమించాం. వాళ్లు కూడా పూర్తిస్థాయిలో వీరిని గుర్తించేపనిలో ఉంటారు. ఇంటెలిజెన్స్‌ వర్గాలను కూడా అప్రమత్తంచేశాం. మార్చి ఒకటి తర్వాత  విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి సమాచారమిస్తే వారికి, వాళ్ల ప్రాంతాలకు మంచిది. అలాచేస్తే మన రాష్ర్టాన్ని మనం కాపాడుకొన్నవాళ్లమైతం. 

ఈ జబ్బు విస్తరించకుండా నిరోధించగలుగుతం. ప్రతి జిల్లాలో కలెక్టర్‌, ఎస్పీ, డీఎంహెచ్‌వోతో కలిపి ఒక కమిటీవేసినం. మార్చి 1 తర్వాత విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించి వాళ్లను హోం క్వారంటైన్‌లో ఉంచుతం. ఇదంతా ఆయా జిల్లా కమిటీలు పర్యవేక్షిస్తాయి. దేశమంతటా ఇట్లే చేస్తున్నరు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో 1165 మందిని ప్రభుత్వ పర్యవేక్షణలో పెట్టాం. అందులో కొందరు తమకు ఇంట్లో వసతులు బాగా ఉన్నందున హోం క్వారంటైన్‌లో ఉంటమని కోరుతున్నరు. వాళ్లను ఇండ్లకు పంపుతం. కాకపోతే వాళ్లు బయటకు తిరుగకుండా వైద్య, పోలీస్‌శాఖ పర్యవేక్షిస్తుంటాయి. మొదట ఏడు దేశాల నుంచి వచ్చిన వారినే పరిశీలించమన్నారు. ఆ తర్వాత 11 దేశాలన్నరు. ఈ మధ్య 167 దేశాలు అని చెప్తున్నరు. అందుకే వీళ్లు వాళ్లు అనకుండా విదేశాలనుంచి ఎవరు వచ్చినా నియంత్రణ ఉండాలని, క్వారంటైన్‌ చేయాలని నిర్ణయించినం. జిల్లా కమిటీలు తాము గుర్తించిన వారిని వెంటనే హోం క్వారంటైన్‌చేస్తరు. ఒకవేళ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే హెల్త్‌ డైరెక్టర్‌కు సమాచారమిస్తరు.


మత పెద్దలు సహకరించాలి

రాష్ట్రంలోని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు తదితర ప్రార్థన మందిరాల్లోకి భక్తులను అనుమతించొద్దని కోరుతున్నం. ఇంతకుముందే ఇస్లామిక్‌ మతంవారు కూడా ప్రగతిభవన్‌కు వచ్చి ప్రకటనచేశారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా బిషప్‌లు, పాస్టర్లు, దేవాలయాలకు చెందిన పూజారులు, గురుద్వారాల వారికి కూడా భక్తులను అనుమతించవద్దని మనవిచేస్తున్నం. ఈ నెల 22న జరుగాల్సిన షబ్బే మిరాజ్‌ను కూడా రద్దుచేసినం. అందుకు వాళ్లు కూడా అంగీకరించారు. ఈ నెల 25న ప్రభుత్వపక్షాన ఉగాది ఉత్సవ సందర్భంగా పంచాంగ శ్రవణం ప్రగతిభవన్‌లో కానీ ఎక్కడా నిర్వహించడంలేదు. కేవలం లైవ్‌ టెలికాస్ట్‌ మాత్రమే ఉంటుంది. ప్రజలు తమ ఇండ్లల్లో ఉండి ఉగాది జరుపుకోవచ్చు. ఉగాదితోపాటు సామూహికంగా శ్రీరామనవమి ఉత్సవాలను కూడా రద్దుచేసినం. ప్రజల శ్రేయస్సు, ఆరోగ్యం దృష్ట్యా అన్ని మతాల పెద్దలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరుతున్నం. 

కరోనా వైరస్‌ నివారణకు సీఎం చెప్పిన సూచనలు..

 • జాగ్రత్తగా ఉన్నచోట వైరస్‌ వ్యాప్తి చెందడంలేదు
 • నిర్లక్ష్యంగా ఉన్న దేశాల్లో బాగా ప్రబలుతున్నది.
 • మనం జాగ్రత్తగా ఉంటే ఏ మాత్రం ముప్పులేదు 

వైరస్‌ సోకినవారి పరిస్థితి 

 • 80.9% మందికి ఏ మాత్రం ఇబ్బంది లేదు
 • 13.8% మందికి కొంత ఇబ్బంది అవుతున్నది
 • 4.7% మంది మాత్రమే  ప్రమాదకర స్థాయిలో ఉన్నారు

మూసివేత 31 వరకు పొడిగింపు

 • సినిమాహాళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, బార్‌లు, పబ్‌లు, క్లబ్బులు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్స్‌, ఇండోర్‌ అవుట్‌డోర్‌ స్టేడియాలు, జూపార్కులు, మ్యూజియాలు బంద్‌. 
 • బహిరంగ సభలు, సమావేశాలు, సెమినార్లు, వర్క్‌షాపులు, ఉత్సవాలు, ర్యాలీలకు, ఎగ్జిబిషన్‌, ట్రేడ్‌ ఫేర్స్‌, కల్చరల్‌ ఈవెంట్స్‌లకు అనుమతులుండవు. 
 • అన్ని విద్యాసంస్థలు, కోచింగ్‌సెంటర్లు, సమ్మర్‌ క్యాంపులు 31 వరకు బంద్‌.
 • ఎస్సెస్సీ పరీక్షలు యథావిధిగా నడుస్తాయి.
 • మాల్స్‌, సూపర్‌ మార్కెట్లు, ఇతర అన్ని రకాల షాపులు యథావిధిగా నడుస్తాయి.

తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు 

 • జిల్లాస్థాయిలో కలెక్టర్‌, ఎస్పీ/కమిషనర్‌, డీఎంహెచ్‌వోలతో కమిటీ. 
 • జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలి.
 • మార్చి 1 తర్వాత విదేశాలనుంచి వచ్చిన వారిని గుర్తించాలి. వైద్య పరీక్షలు నిర్వహించాలి. హోం క్వారంటైన్‌ చేయాలి.
 • గ్రామ కార్యదర్శులు, మున్సిపల్‌ కమిషనర్లు బాధ్యత తీసుకోవాలి.
 • వైద్యశాఖ అధికారులకు వెంటనే సమాచారమివ్వాలి.
 • సోషల్‌ వాచ్‌ అవసరం
 • 104 నంబర్‌కు డయల్‌ చేసి సమాచారం ఇవ్వవచ్చు. 


logo