గురువారం 28 మే 2020
Telangana - May 22, 2020 , 01:35:57

మన ఐటీ మహాన్‌

మన ఐటీ మహాన్‌

  • తెలంగాణ నుంచి లక్షా 28 వేల కోట్ల ఎగుమతులు
  • 40 వేల మందికి కొత్తగా ఉపాధి కల్పన
  • జాతీయ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 23.5 శాతం
  • దేశ సగటు కన్నా 18 శాతం పెరుగుదల
  • రాష్ట్రం సాధించిన రికార్డుపై సీఎం కేసీఆర్‌ హర్షం
  • కరోనా కష్టకాలంలోనూ రెట్టింపు వృద్ధి: కేటీఆర్‌
  • ఐటీ పెట్టుబడులకు గమ్యస్థానం కానున్న తెలంగాణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.28 లక్షల కోట్ల ఎగుమతులను సాధించింది. రాష్ట్రంలో ఐటీ రంగం కొత్తగా 40వేల మందికి ఉపాధిని చూపింది. భారత జాతీయసగటే కాదు.. దేశంలోని ఏ ఇతర రాష్ర్టాలు నమోదు చేయని వృద్ధిని సాధించింది. కరోనా కష్టకాలంలో ఆర్థికరంగం కుదేలైనప్పటికీ రాష్ట్ర ఐటీ మాత్రం అదే జోరును కొనసాగించింది. ఈ ఏడాది జనవరి మార్చి వరకు కరోనా ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా పడినప్పటికీ తెలంగాణ ఐటీ మాత్రం ఎగుమతుల్లో 18 శాతం వరకు వృద్ధిని నమోదు చేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో జాతీయస్థాయిలో నమోదైన వృద్ధిరేటు కంటే ఇది రెట్టింపుకన్నా అధికం కావడం విశేషం. జాతీయ సగటు 8.09 శాతం, ఇతర రాష్ర్టాల సగటు 6.92 శాతం ఉండగా, తెలంగాణ రికార్డు స్థాయిలో 17.93 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తంగా దేశీయ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 23.53 శాతానికి చేరుకొని ఐటీలోనే మేటిగా నిలిచింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఎగుమతుల్లో అద్భుత ప్రగతి సాధించారంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ ఐటీశాఖను అభినందించారు. ప్రపంచ ఐటీ పెట్టుబడులకు తెలంగాణే గమ్యస్థానమని మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. దేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 10.6 శాతం నుంచి 11.6 శాతానికి పెరుగడం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేశ్‌ రంజన్‌ గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి 2019-20 సంవత్సరంలో ఐటీ ఎగుమతులు, ఉపాధి కల్పనపై నివేదిక సమర్పించారు.

రూ.1.28 లక్షల కోట్ల ఎగుమతులు

తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలతో రాష్ట్రంలోకి విదేశీ పెట్టుబడులు విరివిగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెజాన్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఇన్ఫోసిస్‌, కియా, మైక్రాన్స్‌, మహీంద్ర, సైయెంట్‌ తదితర బహుళజాతి సంస్థలు హైదరాబాద్‌ వేదికగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌లో ఐటీ పెట్టుబడులు పెరిగి అదే స్థాయిలో ఎగుమతులు వృద్ధి చెందాయి. 2018-19లో ఎగుమతులు రూ.1,09,219 లక్షల కోట్లు ఉండగా, 2019-20లో అవి రూ.1,28,807 లక్షల కోట్లకు పెరిగాయి. మొత్తం భారత ఎగుమతుల వృద్ధి రేటు 8.09 శాతం ఉండగా, తెలంగాణ ఎగుమతుల వృద్ధి రేటు 17.93 శాతం నమోదు కావడం విశేషం. దీంతో ఐదేండ్లలో ఐటీ ఎగుమతులను రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని తెలంగాణ సాధించినట్లు అయ్యింది. ఉద్యోగాల కల్పనలోనూ మేటి

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలతో లాక్‌డౌన్‌లోనూ ఐటీ నిలదొక్కుకోవడం ఆర్థిక వ్యవస్థకు మేలుచేసింది. మరోవైపు  ఐటీ ఉద్యోగాల కల్పనలోనూ రాష్ట్రం తన మార్కును చాటింది. ఐటీలో గతేడాది 5,43,033 మంది ఉద్యోగాల సృష్టి జరగ్గా 2019-20లో ఐటీ ఉద్యోగుల సంఖ్య 5,82,126కి పెరిగింది. క్రితం ఏడాదికంటే దాదాపు 40వేల మంది కొత్తగా ఉపాధి పొందారు. దేశంలో 2018-19లో 41,58,000వేల ఉద్యోగులుంటే, 2019-20లో 43,63,000కు చేరింది. దేశీయంగా ఉద్యోగాల కల్పన 4.93 శాతం ఉండగా, తెలంగాణలో 7.20గా నమోదు కావడం విశేషం.  logo