గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 08, 2020 , 13:17:35

పీవీ పాండిత్యం ఎంతో గొప్ప‌ది : సీఎం కేసీఆర్

పీవీ పాండిత్యం ఎంతో గొప్ప‌ది : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు మ‌హోన్న‌త సాహితీవేత్త అని, ఆయ‌న పాండిత్యం ఎంతో గొప్ప‌ది అని సీఎం కేసీఆర్ కొనియాడారు. పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. పీవీ వ్యక్తిత్వం ఒక సహస్రదళపద్మం- అనేక కోణాలున్న సమున్నత వ్యక్తిత్వం అని పేర్కొన్నారు. పీవీ బహుభాషా కోవిదుడు, మహోన్నత సాహిత్యవేత్త బాలగంగాధర తిలక్, పండిత గోవిందవల్లభ్ పంత్, కే. ఎం. మున్షీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి వారి సరసన లెక్కించదగిన అఖండ పాండిత్యం ఉన్నవాడు అని తెలిపారు. తెలుగు, సంస్కృతం, మరాఠీ, కన్నడం, ఉర్దూ, పర్షియన్ మొదలైన భారతీయ భాషలతో పాటూ ఇంగ్లీష్, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషలలోను అనర్ఘళంగా ప్రసంగించగలిగిన మహాపండితుడు అని కేసీఆర్ ప్ర‌శంసించారు. 


రాజకీయాలలో మునిగితేలుతూనే కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన “వేయిపడగలు” అనే బృహన్నవలను హిందీ భాషలోకి “సహస్రఫణ్” పేరుతో అనుసృజించారు. అందరూ వేయి పడగలు నవలకు పీవీ చేసింది అనువాదం అనుకుంటారు కానీ అది అనుసృజన అని, స్వయంగా విశ్వనాథ సత్యనారాయణ పేర్కొన్నారు. “వేయిపడగలు” నవల అనేక పాత్రలు సన్నివేశాలతో ఒక ఇతిహాసం వలె ఉంటుంది.

‘‘క్లిష్టతరమైన ఈ నవలను పీవీ అనుసృజన చేసినతీరు చూస్తే హిందీ నుంచి తెలుగులోకి నేను అనువాదం చేసానా అనేంత గొప్పగా ఉన్నదని’’ విశ్వనాథ సత్యనారాయణ అంతగా ప్రశంసించారంటే పీవీ పాండిత్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. వేయిపడగలు నవలను బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద తిరుగుబాటుగా పీవీ అభివర్ణించారు. “అబలా జీవితం” అనే మరాఠీ నవలను తెలుగులోకి అనువాదం చేసారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో తన అనుభవాలకు అక్షర రూపాన్ని ఇస్తూ ‘గొల్ల రామవ్వ’ అనే అత్యద్భుతమైన కథ రాసారు. ఈ కథలో ఆనాడు తెలంగాణలో రామవ్వ వంటి సామాన్యులు చేసిన త్యాగాలను గొప్పగా చిత్రించారు. ఇంకా ఎన్నో కథలు, పద్యాలు, గేయాలూ, నవలికలూ రాశారు. ఆయన ఉపన్యాసాలలో భాషా సాహిత్య పరిమళాలు, గుబాళించేవి. ఆయన అసమాన పాండిత్యం అద్భుత తేజస్సుతో ప్రకాశించేది.

విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ పురస్కారాలు లభించడం వెనుక, కాళోజి నారాయణ రావుకు పద్మవిభూషణ్ బిరుదు రావడం వెనుక పీవీ కృషి దాగివుంది. మనవాళ్ళ ప్రతిభ జాతీయ స్థాయిలో వెలుగులోకి రావడానికి పీవీ వార‌ధి అయ్యార‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.


logo