బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 13:09:12

130 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం ఇది: సీఎం కేసీఆర్‌

130 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం ఇది: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: దేశంలో ఓటింగ్‌ జరుగుతోంది..ఓట్లతోనే ఎవరైనా అధికారంలోకి వస్తాం. ప్రతి ఒక్కరికీ ఓటరు ఐడీ కార్డు ఉంటుంది. ఓటరు ఐడీ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డు పనిచేయదని ఎలా అంటారు.  బర్త్‌ సర్టిఫికెట్‌ లేనివారి పరిస్థితి ఏంటి. ఏ దేశానికైనా పౌరసత్వం ఉండాలి..దీన్ని ఎవరూ కాదనలేం. ఇది ముస్లింల సమస్య కాదు..మొత్తం దేశం సమస్య. అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభంకాగానే సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌లపై తీర్మానం ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్‌ చర్చను ప్రారంభించారు. 

'నాకు బర్త్‌సర్టిఫికెట్‌ లేదు..తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి. దేశంలో నాలాగే లక్షలాది మందికి ఉన్న పరిస్థితి ఇది. 130 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం ఇది.  చొరబాటుదారుల్ని అనుమతించాలని ఎవరూ కూడా చెప్పరు.  మెక్సికో నుంచి వలసలు రాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గోడలు కడతామన్నారు. ట్రంప్‌ భారత్‌ పర్యటనలో ఢిల్లీలో 50 మందికి పైగా మృతి చెందారు.   భారతదేశంలో కూడా సరిహద్దు చుట్టూ గోడ కడతారా? దేశ సరిహద్దుల మీదుగా గోడకడతామంటే మేం సపోర్ట్‌ చేస్తాం. మనం కంటినిండా నిద్రపోతున్నామంటే బోర్డర్‌లో సైన్యం త్యాగాలే కారణం. లౌకిక పునాదుల మీద నిర్మితమైన పార్టీ టీఆర్‌ఎస్‌. దేశంలో జరుగుతున్న పరిణామాలు హర్షణీయం కాదని' సీఎం వివరించారు. 

'ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ముస్లింలను మినహాయించి బిల్లు తీసుకొచ్చింది. భారత రాజ్యాంగం కులమతాలకు అతీతంగా ఉంటుంది.  సీఏఏని ఎవరైనా వ్యతిరేకిస్తే వారు దేశ ద్రోహులు, పాకిస్థాన్‌ ఏజెంట్లు అవుతారా?  మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో ఎల్‌కే అద్వానీ ఆధ్వర్యంలో సీఏఏపై 2003లో కమిటీ వేశారు. 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్వే కూడా చేశారు. కేవలం 12 లక్షల మందికి మాత్రమే కార్డులు ఇవ్వగలిగారు. అప్పట్లోనే ఈ ప్రాజెక్టు విఫలమైంది. సొంత బర్త్‌సర్టిఫికెట్లు లేనివారు దేశంలో కోటాను కోట్లమంది ఉన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చినవారిని కాందిశీకులుగా భారత్‌ గుర్తించింది. పనుల కోసం వలసలు పోయినవారి గతేంకావాలి. విభజన రాజకీయాలు ఈ దేశానికి అవసరమా? విభజన సమయంలో బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ నుంచి వచ్చి దేశంలో స్థిరపడ్డారని' సీఎం తెలిపారు. 


logo
>>>>>>