మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 02:10:42

మక్కల కొనుగోళ్లు ఎట్లున్నయి?

మక్కల కొనుగోళ్లు ఎట్లున్నయి?

  • మద్దతు ధరకు కొంటున్నరా?
  • ధాన్యం దిగుబడి ఎంతొస్తున్నది?
  • జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్‌ 
  • కొనుగోళ్లలో ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆదేశం

నమస్తే తెలంగాణ, జగిత్యాల: రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మద్దతు ధరకే మక్కలను కొనుగోలు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వాటి కొనుగోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకొంటూనే.. ప్రజాప్రతినిధులకు ఫోన్‌చేసి స్థానికంగా కొనుగోళ్లపై ఆరా తీస్తున్నారు. ‘హలో సంజయ్‌.. నేను సీఎం మాట్లాడుతున్నా. మక్కల కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయి? ధాన్యం కొనుగోళ్లు ఎలా ఉన్నాయి? ట్రేడర్స్‌ కొంటున్నారా? ప్రభుత్వ సంస్థలు ఎంత కొనుగోలు చేస్తున్నాయి?’ అంటూ సీఎం కేసీఆర్‌.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌కు ఫోన్‌చేశారు. జగిత్యాల రూరల్‌ మండలం అంతర్గాంలో సోమవారం ఉదయం 9 గంటలకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, రైతులతో ఎమ్మెల్యే మాట్లాడుతున్న సమయంలో సీఎం ఫోన్‌ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్నానని ఎమ్మెల్యే చెప్పగా.. ‘జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోళ్లు ఎలా ఉన్నాయి, మక్కల కొనుగోలు ఎలా జరుగుతున్నది’ అడిగి తెలుసుకున్నారు. 

‘ట్రేడర్స్‌ ధాన్యం, మక్కలను కొనుగోళ్లు చేస్తున్నారా? ఏవైనా ఇబ్బందులున్నాయా? నియోజకవర్గంలో వరి ధాన్యం దిగుబడి ఎంత ఉండే అవకాశాలున్నాయి? మక్క సాగు విస్తీర్ణమెంత? ఎంత దిగుబడి ఉండొచ్చు?’ అని అడిగారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంత ధాన్యం, మక్కలు కొనుగోలు చేశారంటూ ఆరాతీశారు. పూర్తి వివరాలను అధికారుల వద్ద నుంచి తీసుకొని, వివరించాలని సీఎం ఆదేశించారు. ధాన్యం, మక్కల కొనుగోళ్లల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మక్కను మార్కెట్‌యార్డుల్లో, కొన్నిచోట్ల కేంద్రాల్లోనూ కొనుగోలు చేస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్‌.. ముఖ్యమంత్రికి వివరించారు. ప్రైవేట్‌ ట్రేడర్స్‌ సైతం కొనుగోలు చేస్తున్నారని చెప్పగా.. వారు ఎంత ధర చెల్లిస్తున్నారని సీఎం అడిగారు. ప్రైవేట్‌ ట్రేడర్స్‌ క్వింటాల్‌ మక్కకు రూ.1,200 నుంచి 1,600 వరకు చెల్లిస్తున్నారని.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం మద్దతు ధర రూ1,850 చెల్లిస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్‌ వివరించారు. ఇంతవరకు జగిత్యాల నియోజకవర్గ పరిధిలో మార్కెట్‌ యార్డుల్లో కొనుగోలు చేసిన మక్క వివరాలు, ప్రైవేట్‌ ట్రేడర్స్‌ కొనుగోలు చేసిన వివరాలను అధికారుల వద్ద నుంచి తెలుసుకొని, కొద్దిసేపటి తర్వాత తనకు తెలియజేయాలని సీఎం సూచించారు.


సీఎం కార్యాలయం నుంచి ఫోన్‌

కొద్దిసేపటి తర్వాత సీఎం కార్యాలయం నుంచి ఎమ్మెల్యేకు ఫోన్‌చేసి.. ‘సీఎంగారు మక్కల కొనుగోలు వివరాలు అడుగుతున్నారు. తెలుసుకున్నారా?’ అని ఆరా తీశారు. మార్కెట్‌యార్డు, అధికారులతో మాట్లాడి.. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ప్రైవేట్‌ ట్రేడర్స్‌, మార్కెట్‌ యార్డు ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన వివరాలను సేకరించిన ఎమ్మెల్యే సంజయ్‌ సీఎం కార్యాలయానికి వివరించారు. ఈ విషయమై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మక్కల కొనుగోళ్లు, ప్రైవేట్‌ ట్రేడర్స్‌, ప్రభుత్వ సంస్థల కొనుగోళ్లపై సీఎం కేసీఆర్‌ ఆరా తీశారని చెప్పారు. జగిత్యాల నియోజకవర్గస్థాయిలో ప్రైవేట్‌ ట్రేడర్స్‌ ఇప్పటివరకు దాదాపు 3,500 క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేశారని, ప్రభుత్వ సంస్థల ద్వారా దాదాపు 3,600 క్వింటాళ్ల కొన్నట్టు అధికారులు తెలియజేశారని తెలిపారు. అధికారులు చెప్పిన వివరాలను సీఎం కేసీఆర్‌కు నివేదించామన్నారు.