శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 01:48:58

ఆలుగడ్డ ఎంత పండింది?

ఆలుగడ్డ ఎంత పండింది?

  • జహీరాబాద్‌ రైతుతో సీఎం కేసీఆర్‌ ఫోన్‌ సంభాషణ

జహీరాబాద్‌ జనవరి 2:  నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం రంజోల్‌ గ్రామానికి చెందిన రైతు నల్ల నాగేశ్వర్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. ఏం పంట పండిస్తున్నావని  ఆరా తీశారు.  రైతుతో శుక్రవారం సీఎం కేసీఆర్‌ సాగించిన ఫోన్‌ సంభాషణ ఇలా..

సీఎం కేసీఆర్‌: జహీరాబాద్‌ ప్రాంతంలో ఎన్ని ఎకరాల్లో ఆలుగడ్డ పంట సాగు చేస్తున్నరు?

రైతు నాగేశ్వర్‌రెడ్డి: సార్‌! గతంలో 2500 ఎకరాల నుంచి 3000 ఎకరాల వరకు ఆలుగడ్డ పంట సాగు చేసేటోళ్లు. ఈ ఏడాది 1500 ఎకరాల నుంచి 2500 ఎకరాల వరకు సాగు చేస్తున్నరు.

ఏ రకం ఆలుగడ్డ సాగు చేస్తరు.. పంట దిగుబడి ఎట్లున్నది?

రైతులు అధికంగా 166 రకం ఆలుగడ్డ సాగు చేస్తరు.

ఒక ఆలుగడ్డ చెట్టుకు ఎన్ని గడ్డలు వస్తాయి?

ఒక చెట్టుకు సుమారు 8 నుంచి 10 గడ్డలు వస్తాయి.

ఒక చెట్టుకు ఎన్ని కిలోల ఆలుగడ్డ దిగుబడి వస్తుంది?

ఒక చెట్టుకు కిలో దాక దిగుబడి ఉంటుంది.

ఎకరాకు ఆలుగడ్డ ఎన్ని బస్తాలు వేస్తారు?

ఎకరాకు 16 బస్తాలు వేస్తాం సార్‌

ఆలుగడ్డ వేసి ఎన్ని రోజులైతున్నది. పంట ఎట్లున్నది.. గడ్డలు వస్తున్నయా?

ఒక చెట్టుకు పెద్ద సైజు గడ్డలు 9 వరకు వస్తున్నయి. ఎకరాకు 16 బస్తాల ఆలుగడ్డలు వేస్తే.. 80 రోజులకు 12 నుంచి 15 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.

మార్కెట్‌లో ప్రస్తుతం ఆలుగడ్డ ధర ఎంత ఉన్నది?

మార్కెట్‌లో ప్రస్తుతం ఆలుగడ్డ 10 కిలోలకు రూ. 180 నుంచి రూ.200 వరకు వస్తున్నది. జహీరాబాద్‌ ప్రాంతంలో రెండు రకాల భూములున్నయి. ఎర్ర నేల, నల్ల నేల భూముల్లో ఆలుగడ్డ సాగు చేస్తారు. ఎర్ర నేల భూమిలో సాగు చేసిన గడ్డకు ధర తక్కువ వస్తది. నల్లనేలలో సాగు చేసిన పంటకు ధర ఎక్కువ వస్తది. 

వ్యవసాయ శాఖ అధికారులు ఆలుగడ్డ సాగు పై ఎలాంటి సూచనలు చేస్తున్నారు?

వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన సూచనలు చేస్తున్నారు.


logo