గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 03:38:24

రైతుతో మాట.. రైతే ముచ్చట..

రైతుతో మాట.. రైతే ముచ్చట..

  • మీ గ్రామాలకు నీళ్లిద్దాం.. ఎలా చేద్దాం.. 
  • రండి.. ఇంజినీర్లతో చర్చించి నిర్ణయిద్దాం
  • నేరుగా రైతులకు ఫోన్లు చేసిన సీఎం కేసీఆర్‌.. 
  • ఎగువ గ్రామాలకు ఎస్సారెస్పీ వరదకాలువ
  • నీళ్లిచ్చేందుకు సాగు భూముల వివరాలు సేకరణ
  • పరీవాహక ప్రాంతాల రైతుల సమస్యలపై ఆరా

‘మీ గ్రామాల పొలాలకు నీళ్లిద్దాం.. ఎలా చేస్తే లాభమో చెప్పండి’ అంటూ స్వయంగా రైతులకు ఫోన్‌చేసిన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూశారా? ఇంజినీర్లతో కూర్చుని నీళ్లను ఎలా తరలిద్దామో చర్చించుకుందాం.. హైదరాబాద్‌కు రండి అంటూ నేరుగా ఆహ్వానించిన ముఖ్యమంత్రిని చూశారా? ఆ ముఖ్యమంత్రి కేసీఆర్‌. 

రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మాజీ జెడ్పీటీసీ లచ్చిరెడ్డికి ఫోన్‌చేసి మధ్యమానేరు ప్రాజెక్టు సమస్యలను పరిష్కరించినట్టే ఇప్పుడు వరదకాలువ ద్వారా జగిత్యాల జిల్లా కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లో పొలాలకు సాగునీరందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను స్వయంగా అక్కడి రైతులకు ఫోన్‌చేసి ఆరా తీయడం.. అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతున్నది.  

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: శ్రీరాంసాగర్‌ పునర్జీవ పథకం కింద ఇప్పటికే వేలమంది రైతులకు లబ్ధిచేకూరుతున్నది. 122 కిలోమీటర్ల పొడవున్న వరద కాలువను ఇప్పటికే నాలుగు రిజర్వాయర్లుగా చేసి.. 34 తూముల ద్వారా చెరువులను నింపుతున్నారు. దీనిద్వారా పరీవాహక ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగిపోయాయి. అయితే.. వరద కాలువ దిగువ  భూములకు తూముల ద్వారా నీళ్లందుతుండగా.. ఎగువ గ్రామాలకు కూడా నీళ్లివ్వాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. దానిపై దృష్టి సారించారు. బుధవారం జగిత్యాల జిల్లా కథలాపూర్‌ జెడ్పీటీసీ నాగం భూమయ్య, మేడిపల్లి మండల రైతుబంధు సమితి జిల్లా కార్యవర్గసభ్యుడు, వెంకట్రావుపేట మాజీ సర్పంచ్‌ కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డికి నేరుగా ఫోన్‌చేసి మాట్లాడారు.

వరదకాలువ ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాలు.. రైతులకు నీళ్లందుతున్నతీరు, ఇంకా పరీవాహక ప్రాంతాల రైతుల అవసరాలు తదితర అంశాలపై వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగం భూమయ్య కథలాపూర్‌లోని విషయాలను వివరించారు. పునర్జీవ పథకంతో మండలంలోని తక్కల్లపల్లి, సిరికొండ, బొమ్మెన, కథలాపూర్‌ గ్రామాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. అయితే, వరదకాలువకు ఎగువనున్న మరో 12 గ్రామాలకు లిప్టుద్వారా నీళ్లిస్తే.. ఆ గ్రామాల రైతుల కష్టాలు తీరుతాయని విజ్ఞప్తిచేశారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్‌.. పూర్తి వివరాలు మాట్లాడేందుకు రెండు మూడురోజుల్లో హైదరాబాద్‌ రమ్మని ఆహ్వానించారని జెడ్పీటీసీ తెలిపారు. 

నాలుగు రిజర్వాయర్లు.. 


1.7 టీఎంసీల నిల్వఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో 122 కిలోమీటర్ల పొడువునా వరదకాలువ జీవనదిలా మారింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీపూర్‌ సర్జ్‌పూల్‌ నుంచి ఎత్తిపోసిన జలాలు 99.02 కిలోమీటర్‌వద్ద వరద కాలువలో కలుస్తాయి. వరద కాలువ 102 కిలోమీటర్‌ వద్ద హెడ్‌రెగ్యులరేటర్‌ గేట్లు ఏర్పాటుచేశారు. ఇవి తెరిస్తే దిగువన ఎస్సారార్‌ జలాశయంలోకి నీళ్లు వెళుతాయి. మూసివేస్తే ఎగువన ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వెళ్తుంది. లక్ష్మీపూర్‌ సర్జ్‌పూల్‌ నుంచి ఎస్సారార్‌కు ఒక టీఎంసీ, వరదకాలువ ద్వారా ఎస్సారెస్పీకి ఒక టీఎంసీని ఎత్తిపోసేలా కూడా ఏర్పాట్లుచేశారు. అందులో భాగంగానే 122 కిలోమీటర్ల పొడువుఉన్న వరద కాలువను నాలుగు రిజర్వాయర్లుగా విభజించారు. ఇందులో 122 కిలోమీటర్‌ నుంచి 102 కిలోమీటర్‌ వరకు మొదటి రిజర్వాయర్‌గా, అలాగే 102 నుంచి 73 కిలోమీటర్‌ వద్ద ఏర్పాటుచేసిన రాంపూర్‌ పంపుహౌజ్‌ గేట్ల వరకు రెండోరిజర్వాయర్‌, 73 నుంచి 34 కిలోమీటర్‌ వద్ద ఏర్పాటుచేసిన రాజేశ్వర్‌రావు పేట పంపుహౌజ్‌ గేట్ల వరకు మూడు, 34 నుంచి 0.10 కిలోమీటర్‌ ముప్కాల్‌ వద్ద ఏర్పాటుచేసిన పంపుహౌజ్‌ వరకు నాలుగో రిజర్వాయర్‌గా గుర్తించారు. నాలుగు రిజర్వాయర్ల పరిధిలో అంటే 122 కిలోమీటర్ల పొడువున 1.7 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఉంటుంది. వరదకాలువతోపాటు చెరువులను నింపుకుంటే మూడు టీఎంసీలకుపైగా నీటిని నిల్వ ఉంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ కారణంగా ఈ ప్రాంతంలో 365 రోజులపాటు జలాలు అందుబాటులో ఉంటాయి. 

ఇంజినీర్లను తీసుకుని రమ్మన్నారు

మేడిపల్లికి మండలం వెంకట్రావుపేట మాజీ సర్పంచ్‌ శ్రీపాల్‌రెడ్డితోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు. వరదకాలువ నీళ్లతో కొండాపూర్‌, రంగాపూర్‌, దమ్మన్నపేట, కల్వకోట గ్రామాల రైతులు సంతోషంగా ఉన్నారని శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. కానీ, ఎగువభాగంలోఉన్న 13 గ్రామాలకు నీళ్లందడం లేదని ముఖ్యమంత్రికి వివరించారు. ఏమిచేస్తే.. నీళ్లందుతాయని సీఎం ప్రశ్నించగా.. లిప్టులు పెడితే వేల ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిపారు. ‘అన్ని గ్రామాలకు నీళ్లిద్దాం, మీరు చెప్పినట్టుగా లిప్టులు ఎక్కడ పెట్టాలి, వాటిద్వారా ఎన్ని గ్రామాల్లో ఎన్ని ఎకరాలకు నీళ్లివ్వొచ్చు తదితర పూర్తి వివరాలపై మాట్లాడేందుకు హైదరాబాద్‌ రండి’ అని సీఎం సూచించారు. అలాగే ఆ ప్రాంతంపై మంచిపట్టున్న ఇంజినీరింగ్‌ అధికారులను వెంట తీసుకొని రమ్మని పేర్కొన్నారు.


logo