శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:46:41

అనుభవదారు కాలమ్‌పెట్టేదిలేదు

అనుభవదారు కాలమ్‌పెట్టేదిలేదు

  • కౌలురైతుల విషయంలో మా విధానం స్పష్టం
  • పంచడానికి ప్రభుత్వభూములు లేకుండాచేశారు
  • కొత్త రెవెన్యూ బిల్లుపై చర్చలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒకప్పటి జమీందార్‌, జాగీర్దార్ల వ్యవస్థకు, ఇప్పటికి పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రైతులకు ఇబ్బంది కలిగించే అనుభవదారు కాలమ్‌ను పాస్‌బుక్‌లో ఎట్టి పరిస్థితిలో చేర్చేది లేదని స్పష్టంచేశారు. నూతన రెవెన్యూ బిల్లుపై చర్చలో భాగంగా పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. పలు అంశాలు ఆయన మాటల్లోనే..

ట్రిబ్యునళ్లు శాశ్వతంకాదు

భూవివాదాలపై వేయనున్న ట్రిబ్యునళ్లు శాశ్వతంకావు. 70 రోజుల్లోనే సమస్యలు పరిష్కారమవుతాయి. నిజాయితీపరులైన, క్రమశిక్షణ కలిగిన ఐఏఎస్‌ అధికారులెంతోమంది ఉన్నారు. వారిలో సర్వీస్‌లో ఉన్నవారు, రిటైర్‌ అయిన వారిని సభ్యులుగా వేస్తాం. ఐఏఎస్‌లను నమ్మకపోతే మనం ప్రపంచంలో ఎవరినీ నమ్మలేం. నిజాయితీపరులైన ఐఏఎస్‌లను నియమించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. 

అనుభవదారు కాలమ్‌తో ఇప్పుడు ఏం పని? 

ఒకప్పుడు జాగీర్‌దార్లు, జమీందార్లు, భడా భూస్వాములు ఉన్నప్పుడు కౌలుదారును రక్షించాలన్న ఉద్దేశంతో తెచ్చినదే అనుభవదారు కాలమ్‌. అప్పటి కాలానికి అది చెల్లింది. అప్పుడు అది రైట్‌ కూడా. ఏండ్ల తరబడి కౌలుచేసిన వాళ్లను కాదని ఇతరులకు భూమి అమ్ముకొనిపోతే, ఏండ్లపాటు కష్టపడ్డ రైతుకు పనిలేకుండా పోతుందన్న ఉద్దేశంతో దాన్ని పెట్టారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రెండు నుంచి నాలుగెకరాలున్న చిన్న సన్నకారు రైతులే 93% పైబడి ఉన్నారు. 25 ఎకరాలు ఆపైబడిన భూమి ఉన్నవాళ్లు 0.28% ఉన్నారు. మిగతాది వ్యవసాయేతరభూమే. 93% పైబడి చిన్నసన్నకారు రైతులున్నప్పుడు అనుభవదారు కాలమ్‌ పెడితే కొత్త సమస్యలు వస్తయి. మూడేండ్లు భూమిమీద.. ఎవరంటే వాళ్లకు వీఆర్వో చేతి పహాణీ ఇయ్యొచ్చు. దాన్ని కూడా లెక్కలోకి పెట్టి కొందరు కోర్టుల్లో ఇన్‌జంక్షన్‌ ఆర్డర్లు తెచ్చుకుంటున్నరు. అసలు భూమి ఉన్న రైతు కోర్టుల చుట్టు తిరిగి బేజారయ్యే పరిస్థితి ఉన్నది. ఆస్తులంటే కేవలం వ్యవసాయ భూములే కాదు కదా! నగరాల్లో పెద్ద భవన సముదాయాలు, దుకాణాలు, ఐటీ కంపెనీలు ఇట్లా అనేకం ఉంటాయి. ఇండ్లు కిరాయిలకు ఇస్తాం. మరి అక్కడ ఎందుకు అనుభవదారు కాలమ్‌ రాస్తలేం? బంజారాహిల్స్‌లో ఉన్న బంగాళా కిరాయికి ఇస్తే అనుభవదారు కాలమ్‌లో రాయట్లేరు కానీ, రైతు భూములకు సంబంధించి అనుభదారు కాలమ్‌ ఎందుకు? గ్రామాల్లో మట్టి పిసుక్కునే రైతులంటే చులకనా? వాళ్లు నోరులేనివాళ్లని..వాళ్లు అసంఘటితంగా ఉన్నారనా? అనుభదారు కాలమ్‌ రైతులకే ఎందుకు? ఒకప్పడు జమీందారీ వ్యవస్థ ఉన్నప్పుడు అనుభవదారు కాలమ్‌ పెట్టడం సరైందే. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థలేకున్నా ఉన్నట్టు ఊహించుకొని ఇట్లాంటివి పెట్టాలంటే సరికాదు. ఉదాహరణకు నేను ఆరోగ్యం బాగాలేకనో ఇంకేదో కారణంతోనో.. నాకున్న భూమిలో వ్యవసాయం చేసుకునే పరిస్థితిలో లేను. నా భూమి ఒకరికి కౌలుకు ఇస్తా. వచ్చే ఏడాది ఇంకొకాయన ఎక్కువ కౌలు ఇస్తానంటే ఆయనకు ఇస్తా. ఇట్లా కౌలు రేటు ఎక్కువ ఇస్తానంటే నేను నాకు నచ్చిన వాళ్లకు కౌలుకు ఇచ్చుకుంటా. మరి, ఇట్లా ఏ రైతు ఎవరికి కౌలుకు ఇస్తున్నడో రికార్డులల్ల రాసుకుంట పోవుడే గవర్నమెంట్‌ పనా? అది కేవలం రైతుకు, కౌలుకు తీసుకుంటున్న వ్యక్తికి మధ్య విషయం. దాంట్లో ప్రభుత్వానికి జోక్యమే అవసరం లేదు. అందుకే భూమి ఉన్న రైతులు బేజారు కాకుండా, అనవసర డాక్యుమెంట్ల తోటి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా మేం చేస్తున్నాం. 

కౌలుదారు విషయం మేం పట్టించుకోం 

మేం ఇప్పటికే స్పష్టంగా చెప్పాం. మరోమారు చెప్తున్నాం. కౌలుదారులను మేం పట్టించుకోం. ఇది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానం. కేసీఆర్‌ సీఎంగా పనిచేసినంత కాలం, మేం రైతులను రక్షించుకుంటాం. రైతులకు అండదండగా ఉంటాం. గత ఎన్నికల ముందు కూడా ఇదే విషయాన్ని చెప్పాం. నా నిర్ణయాన్ని గత అసెంబ్లీలో కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన తర్వాతే ఎన్నికలకు ప్రజల్లోకి వెళ్లిన. ప్రజలు కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కాబట్టి కౌలుదారుల విషయంపైన మళ్లీ చర్చే అవసరం లేదు. మేం అనుభవదారు కాలమ్‌  పెట్టదల్చుకోలేదు.

పంచడానికి ప్రభుత్వ భూమిలేకుండా చేశారు

కాంగ్రెస్‌పార్టీ సభ్యుడైన భట్టివిక్రమార్క కొన్ని సత్యదూరమైన విషయాలు చెప్పారు. ఖమ్మం జిల్లాలో వారు ప్రస్తావించిన భూముల విషయాన్ని నేను స్వయంగా కలెక్టర్‌తో మాట్లాడి తెలుసుకున్నా. భూములను పంచే విషయాన్ని భట్టి ప్రస్తావించారు. కాంగ్రెస్‌ హయాంలోనే అన్ని భూములు పంచేశారు. వాస్తవంగా వందెకరాల భూమికి 150 ఎకరాలు పట్టాలిచ్చారు. ఇప్పుడు ఆ లబ్ధిదారులంతా తన్నుకుంటున్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే ప్రభుత్వ భూములు ఖతం అయినవి.. మేం పంచడానికి ప్రభుత్వ భూములే లేకుండా చేశారు. దళితులకు మేం ఇప్పటికే ఇచ్చిన వాగ్దానం ప్రకారం భూములు ఇవ్వడానికి ప్రభుత్వ భూమి అందుబాటులో లేక ఎకరాకు రూ.7 లక్షలుపైన పెట్టి ప్రభుత్వమే స్వయంగా కొని పంచుతున్నాం. అంతేకానీ, గత పార్టీల మాదిరిగా పేదలకు భూములు పంచుతామంటూ తప్పుడు మాటలు ప్రజలకు చెప్పలేం. ఓట్లప్పుడు ఒకమాట, ఓట్ల తర్వాత ఇంకోమాట చెప్పడం మా ప్రభుత్వానికి అలవాటు లేదు. logo