బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 03:23:17

నిరాడంబరంగా వినాయక చవితి

నిరాడంబరంగా వినాయక చవితి

  • ప్రగతిభవన్‌లో గణపతి పూజలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి పండుగను శనివారం నిరాడంబరంగా నిర్వహించారు.  ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కుటుంబసభ్యులతో కలిసి మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. బ్రాహ్మణులు వేదమంత్రాలు పఠించారు. సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్యను ఆశీర్వదించారు. పూజల్లో సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, కుమారుడు, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు, కోడలు శైలిమ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై కుటుంబసభ్యులతో కలిసి వినాయక పూజలు నిర్వహించారు.

ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ గణేశుడు

ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌ గణేశుడు ధన్వంతరి నారాయణుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు. వినాయకచవితి సందర్భంగా శనివారం ఉదయం అర్చకులు మహదేవ్‌, రంగనాథాచార్యులు నేతృత్వంలో హోమం, ప్రాణప్రతిష్ట  నిర్వహించారు. తొలిపూజ చేసిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌.. స్వామివారికి ఐదు కేజీల వెండి జంధ్యం సమర్పించారు. బంగారు తెలంగాణ కల సా కారం చేస్తున్న సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు గణనాథుడి ఆశీస్సులు అందాలని కోరుకున్నట్లు వెల్లడించారు. ఆన్‌లైన్‌ దర్శనాల కోసం WWW. GANAPATHIDEVA.ORG వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.  


logo