గురువారం 09 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 17:47:05

సీఎం కేసీఆర్ ఆదేశాలే.. అధికారుల‌కు విధి విధానాలు

సీఎం కేసీఆర్ ఆదేశాలే.. అధికారుల‌కు విధి విధానాలు

హైద‌రాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాలే అధికారుల‌కు విధి విధానాల‌ని, వాటిని తప్పకుండా పాటించాల‌ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. మొన్న ప్రగతి భ‌వ‌న్ లో జ‌రిగిన క‌లెక్టర్ల స‌మావేశంలో సీఎం కేసీఆర్ స‌మీక్షించి ఆదేశించిన ప‌లు అంశాల‌పై మంత్రి పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిష‌న‌ర్ రఘునంద‌న్ రావుల‌తో క‌లిసి స‌మీక్షించారు. ప్రస్తుతం అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలు, వాటి స్థితిగ‌తుల‌తోపాటు, తాజాగా సీఎం ఆదేశించిన ఆయా ప‌థ‌కాల‌పై మంత్రి సమీక్ష జరిపారు. ఆయా ప‌నులు నిర్ణీత గ‌డువులో జ‌రిగేలా చూడాల‌ని ఆదేశించారు. ఉద్యమ స్ఫూర్తితో, అధికారులు, ప్రజాప్రతినిధులు ప‌ని చేయాల‌ని సూచించారు.

గ్రామాల వారీగా నాలుగేండ్ల ప్రణాళికలు, టౌన్ ప్లానింగ్ త‌ర‌హాలోనే గ్రామ ప్రణాళిక కూడా ఉండాలని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఈ ప్రణాళికలు సిద్ధం కావాలన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అలసత్వానికి తావులేదన్నారు. న‌రేగా నిధుల‌తో రాష్ట్రంలో ల‌క్ష క‌ల్లాల‌ను నిర్మించాల‌న్నారు. హ‌రిత హారాన్ని విజ‌య‌వంతంగా నిర్వహించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.


logo