శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:52:09

22.77 కోట్ల మొక్కలు లక్ష్యం

22.77 కోట్ల మొక్కలు లక్ష్యం

  • సెప్టెంబర్‌నాటికి నాటాలని ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామాల్లో సెప్టెంబర్‌నాటికి 22.77 కోట్ల మొక్కలునాటాలని డీఆర్డీవోలు, జిల్లాల పంచాయతీరాజ్‌ అధికారులకు ఉన్నతాధికారులు లక్ష్యం నిర్దేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షాలు ముగిసే (ఆగస్టు, సెప్టెంబర్‌)లోపు లక్ష్యం పూర్తిచేయాలని ఆదేశించారు. అం దుకు అనుగుణంగా మార్గదర్శకాలను పంపించారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా.. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 కోట్ల మొక్కలు నాటాలనేది లక్ష్యం. వీటిలో 22.77 కోట్ల మొక్కలు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోనే ఉన్నాయి. దీంతో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఉపాధి హామీలో భాగంగా మొక్కలునాటేందుకు గుంతలు తీసే కార్యక్రమం జోరుగా సాగుతున్నది. 

39.46 శాతం లక్ష్యం పూర్తి

సోమవారం నాటికి 39.46 శాతం లక్ష్యం పూర్తయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 11.78 కోట్ల మొక్కలను వివిధ ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో నాటారు. 13 జిల్లాల్లో 50 శాతం పూర్తవగా, మిగతా జిల్లాల్లో 25 నుంచి 45 శాతం వరకు పూర్తయినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. 96.52 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసి కామారెడ్డి జిల్లా అగ్రభాగాన నిలిచింది. కాగా పంచాయతీరాజ్‌శాఖ 100 శాతం లక్ష్యాన్ని చేరుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ రోడ్ల వెంట 50 వేల మొక్కలను నాటే లక్ష్యాన్ని పూర్తిచేసింది.డిఫెన్స్‌, మిలిటరీ విభాగం 99.08, మహిళా, శిశు సంక్షేమశాఖ 96.49, కార్మికశాఖ 95.24, పౌరసరఫరాలశాఖ 71.33, డీఆర్డీవో 68.64, అటవీశాఖ 57.85, సహకారశాఖ 52.51, రవాణాశాఖ 50.55 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. 

ఇప్పటివరకు నాటిన మొక్కలు 

  • రాష్ట్రంలో 51 శాఖల ఆధ్వర్యంలో 
  • నాటాల్సిన మొక్కలు: 29.86 కోట్లు
  • ఇప్పటివరకు నాటినవి: 8.20 కోట్లు
  • నర్సరీల నుంచి తీసుకెళ్లినవి: 3.57 కోట్లు
  • మొత్తం: 11.78 కోట్లు


logo