శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 02:19:29

నిజాలు చర్చిద్దాం

నిజాలు చర్చిద్దాం

 • ఎన్ని రోజులైనా.. ఏ అంశమైనా.. 
 • వాస్తవాలకు అద్దం పట్టేలా మాట్లాడాలి
 • ప్రజాస్వామ్య విలువలు పరిఢవిల్లాలి
 • అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహంపై సీఎం కేసీఆర్‌ 
 • మంత్రులు.. విప్‌లతో భేటీ
 • తొలిరోజు దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డికి నివాళి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపైనా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కూలంకషంగా చర్చ జరుగాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎన్ని రోజులైనా సరే.. అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అన్ని అంశాలపై నిజాలను చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా వాస్తవాలను ప్రజలకు వివరించడం కోసం మంత్రులు సిద్ధంకావాలని సీఎం ఆదేశించారు. ఈ నెల ఏడవ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో మంత్రులు, విప్‌లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వపరంగా చర్చకు సిద్ధమైన అంశాలను బీఏసీ సమావేశంలో ప్రతిపాదించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఇటీవల మరణించిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి అసెంబ్లీలో మొదటిరోజు ఘనంగా నివాళి అర్పించనున్నట్టు తెలిపారు. అసెంబ్లీలో చర్చకు వచ్చే అంశాలపై సంపూర్ణమైన సమాచారంతో మంత్రులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు సంబంధించి సీఎం కేసీఆర్‌ సూచించిన అంశాలు..

కరోనా వ్యాప్తి నివారణ, బాధితులకు అందుతున్న వైద్యం, రాష్ట్రంలో విస్తరించిన వైద్య సేవలు

 • భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, చర్యలు
 • శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదం
 • విద్యుత్‌ రంగంలో సాధించిన విజయాలు
 • కొత్త రెవెన్యూ చట్టం
 • సీమ ఎత్తిపోతల పేర ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు
 • నీటిపారుదల రంగానికి సంబంధించిన అంశాలు
 • జీఎస్టీ అమలులో జరుగుతున్న అన్యాయం
 • కేంద్ర ఆర్థిక విధానాల వల్ల కలుగుతున్న నష్టం
 • రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాల విషయంలో కేంద్రం నాన్చివేత ధోరణి
 • నియంత్రిత పంట సాగు, వ్యవసాయరంగం
 • పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణ


ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చ

ప్రజాస్వామ్య విలువలు పరిఢవిల్లేలా అసెంబ్లీ సమావేశాలు జరుగాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చ జరగడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి చట్టసభలకు మించిన వేదిక మరొకటి లేదు. ఈ వేదికను సద్వినియోగంచేసుకోవాలి. దేశానికి ఆదర్శంగా ఉండేలా తెలంగాణ శాసనసభను నిర్వహించాలి. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, చట్టాల అమలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నదో విశ్లేషించాలి. ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా సభ్యులు ప్రస్తావించాలి. ప్రభుత్వం సభ్యులడిగే ప్రతి అంశానికి సంబంధించిన వివరాలు చెప్తుంది. అధికారపక్ష సభ్యులు కూడా ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని సభలో ప్రస్తావించాలి’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు, గందరగోళం, తిట్లు, శాపనార్థాలు కాదని, అసహనం ప్రదర్శించడానికి అసెంబ్లీ వేదిక కారాదని, ఈ ధోరణిలో మార్పు రావాలని ఆకాంక్షించారు.వాస్తవాలు ప్రతిబింబించాలి

తెలంగాణ అసెంబ్లీ నిర్వహణలో గుణాత్మక మార్పులు రావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. స్ఫూర్తిమంతమైన చర్చలు జరగాలని కోరారు. ‘చట్టాలు తయారుచేయడానికి, బడ్జెట్‌ ఆమోదించడానికి, చట్టాలు, బడ్జెట్‌ అమలు ఎలా ఉన్నదో విశ్లేషించుకోవడానికి శాసనసభలో చర్చ జరుగాలి. చర్చలు గొప్పగా, వాస్తవాల ఆధారంగా ఉండాలి. ప్రజలకు ఉపయోగపడేవిధంగా చర్చించాలి. తద్వారా ప్రజాస్వామ్యం మరింత బలపడాలి. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు వెలువడాలి. తెలంగాణ శాసనసభ ఈ విధంగా జరుగాలని ప్రభు త్వం కోరుకుంటున్నది. ఏ పార్టీ సభ్యులైనా సరే.. ఏ విషయం గురించైనా సరే సభలో మాట్లాడవచ్చు. దానికి సమాధానం చెప్పడానికి, వివరణ ఇవ్వడానికి ఆచరణాత్మకమైన సూచనలు స్వీకరించడానికి ప్రభు త్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సభ్యు లు మాట్లాడే విషయాలు, వాస్తవాలు ప్రతిబింబించాలి. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేలా ఉండాలి’ అని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు   కేటీఆర్‌, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శాసనమండలిలో చీఫ్‌విప్‌ బీ వెంకటేశ్వర్లు, విప్‌లు ప్రభాకర్‌, భానుప్రసాద్‌, కే దామోదర్‌రెడ్డి, అసెంబ్లీలో చీఫ్‌విప్‌ వినయభాస్కర్‌, విప్‌లు గంపగోవర్ధన్‌, గొంగిడి సునీత, బాల్కసుమన్‌, గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, అరికపూడి గాంధీ, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు.

7న టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం 

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం ఈనెల 7 సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు అధ్యక్షతన జరుగుతుంది. తెలంగాణభవన్‌లో జరిగే ఈ సమావేశంలో దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతికి సంతాపం తెలుపుతారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించారు.

‘చట్టాలు తయారుచేయడానికి, బడ్జెట్‌ ఆమోదించడానికి, చట్టాలు, బడ్జెట్‌ అమలు తీరు ఎలా ఉన్నదో విశ్లేషించుకోవడానికి శాసనసభలో చర్చ జరగాలి. చర్చలు గొప్పగా, వాస్తవాల ఆధారంగా ఉండాలి. ప్రజలకు ఉపయోగపడేవిధంగా చర్చించాలి. తద్వారా ప్రజాస్వామ్యం మరింత బలపడాలి. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు వెలువడాలి. తెలంగాణ శాసనసభ  ఈ విధంగా జరుగాలని ప్రభుత్వం కోరుకుంటున్నది.

ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చ   జరుగడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి చట్టసభలకు మించిన వేదిక మరొకటి లేదు. ఈ వేదికను సద్వినియోగంచేసుకోవాలి. దేశానికి ఆదర్శంగా ఉండేలా తెలంగాణ శాసనసభను నిర్వహించాలి.


logo