సోమవారం 25 మే 2020
Telangana - Apr 06, 2020 , 20:58:19

అవకాశం వస్తే.. ఆ తల్లులకు పాదపూజ చేస్తా..

అవకాశం వస్తే.. ఆ తల్లులకు పాదపూజ చేస్తా..

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ సమయంలో ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు నడవాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ప్రగతి భవన్‌లో కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌ అమలుపై అత్యున్నత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. సమాజాన్ని ఈ స మయంలో ముందుండి తీసుకుపోయే వైతాళికులు కావాలి. మనో నిబ్బరాన్ని కలిగించే వాళ్లు కావాలి. గొప్ప వ్యక్తులు కావాలి. చిల్లరగాళ్లతో అవసరం లేదు. చిల్లర రాజకీయాలు, చిల్లర ప్రచారాలు చేసేవాళ్లు అవసరం లేదు. ఈ దుర్మార్గులు కాదు కావాల్సింది. చాలా పాజిటివ్‌గా, సమాజం గురించి బాధ్యత కలిగిన వ్యక్తులు దేశానికి కావాలి. ఇటువంటి పరీక్షా సమయంలోనే అల్పులు, గొప్పవాళ్లు బయటపడుతారు. ఇప్పుడే సత్తా ఏంటో తెలుస్తోంది. చీప్‌గా ఆలోచించే వాళ్లు ఎవరో, గొప్పగా ఆలోచించే వారెవరో తెలుస్తోంది. ఆ తల్లులకు రెండు చేతులెత్తి దండం పెడుతున్నా. అవకాశం వస్తే ఆ తల్లులకు పాద పూజ కూడా చేస్తా. తప్పకుండా అందరం చల్లగా బతికితే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అవార్డు కూడా ఇస్తాం. ఓ తల్లి బీడీలు చుట్టే ఆమె.. తాను పొదుపు చేసుకున్న డబ్బులో రూ. 20 వేలు తీసుకొచ్చి సాయం చేసింది. మేడ్చల్‌లో మరో మహిళ.. తనకు వచ్చిన బియ్యంలో 22 కిలోలు ఇతరులకు సాయం చేసింది. ఇట్లాంటోళ్లు కావాలి. కష్టంలో కన్నీళ్లు పంచుకునే వాళ్లు కావాలి. అల్పమనస్కులు, చిల్లరగాళ్లు అవసరం లేదు. ఈ సమయంలో రాజకీయాలు చేయొద్దు అని సీఎం సూచించారు. కవులు, గాయకులు మందుకొచ్చి సమాజానికి మానసిక ైస్థెర్యం కల్పించాలి అని కేసీఆర్‌ కోరారు. 


logo