బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:46:41

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ధరణి

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ధరణి

  • 99.9% సమస్యలు పోతాయ్‌
  • దానిని ప్రైవేట్‌కు ఇచ్చే ప్రశ్నే లేదు
  • ట్యాంపరింగ్‌కు అవకాశం లేదు
  • టీఎస్‌ఈఎస్‌ ద్వారా నిర్వహణ
  • ఇకపై రెవెన్యూ కోర్టులుండవు
  • అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ధరణి వెబ్‌సైట్‌ను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో రెవెన్యూ బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ.. ధరణి పోర్టల్‌ను సమగ్రంగా ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. దీనిపై పలువురు సభ్యుల అనుమానాలను ఆయన నివృత్తిచేశారు. సీఎం చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. 

ప్రభుత్వమే నిర్వహిస్తుంది

ధరణి వెబ్‌సైట్‌ పెట్టే ముందు సభలు పెడ్తరా? అన్నరు. ఏం పెట్టం. మొన్ననే ఎల్‌ఆర్‌ఈపీ అయిపోయింది. యథావిధిగా ఉండే రికార్డులను వెబ్‌సైట్‌లో పెడ్తం. మొన్ననే రైతుబంధు ఇచ్చినం. దాని మీద ఎవ్వరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఆ వివరాల్ని యథాతథంగా పెడ్తం. దాంట్లో కొలతలనేవి సర్వే ఆధారంగా తేలుతయి. ధరణిని రెవెన్యూశాఖ నిర్వహిస్తది. టీఎస్‌ఈఎస్‌ అనే కార్పొరేషన్‌ ఉన్నది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ధరణి పోర్టల్‌ ఉంటది. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుకు ఇవ్వం. 

అన్ని సమస్యలకూ చెక్‌

ధరణి పోర్టల్‌ వచ్చి, సర్వే పూర్తయ్యాక 99.9% సమస్యలు ఆటోమెటిక్‌గనే పోతయి. మేం స్టేట్‌ క్యారెక్టర్‌, మా అధికారుల క్యారెక్టర్‌ కూడా కాపాడుకోవాలి. అది మా బాధ్యత. ప్రజలకు సేవచేసే ఉద్దేశంతో పెట్టి.. మళ్ల దాంట్లో మకిలి అంటి ఎందుకీ ఇబ్బంది? వివాదాలు తక్కువైతయి. కాబట్టి రెవెన్యూ కోర్టులు మేం పెట్టదలచుకోలేదు. కావాలని వివాదం పెట్టుకొని, కావాలని గడ్‌బడ్‌ చేసుకునేటోళ్లు ఎంత చెప్పినా వినరు. కలెక్టర్‌ కోర్టు పెట్టినా.. ఇంకో కోర్టు పెట్టినా మళ్లీ సివిల్‌కోర్టుకు పోతరు. న్యాయవ్యవస్థ కూడా పనిచేయాలి. ఐదంచెల కోర్టు ఉన్నది బయట. సివిల్‌ కోర్టు, సబార్డినేట్‌ కోర్టు, సెషన్‌కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉన్నది. చట్టం ఇంత మంచిగ చేసిన తర్వాత వివాదాలే ఉండవు. ఎవరైనా కావాలని వివాదాలు పెట్టుకుంటే వాళ్ల ఖర్మ.. మేమేం చేయలేం. వాళ్లు కోర్టుకు పోవాల్సిందే.

కేంద్రం ఇచ్చింది ఒట్టి డబ్బానే

ల్యాండ్‌ రికార్డులకు కేంద్రం డబ్బులిస్తుందా? అని అడిగినరు. కేంద్రం పరిస్థితి దారుణంగా ఉన్నది. అన్న వస్ర్తానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్లుంది. మనకు రావాల్సిన వాటికే దిక్కులేదు. రూ.900 కోట్లు రావాల్సి ఉన్నది. మొన్న ఎంపీలకు చెప్పిన.. యుద్ధం పట్టుండ్రి, అయిన కథ అయితదని చెప్పిన. రంగంలోకి దిగాలని చెప్పిన. వాళ్లు చెప్పిన సంస్కరణలు కొన్ని ఉన్నయి. విద్యుత్‌ సంస్కరణలు పూర్తి ప్రజావ్యతిరేకం. అట్లనే మన రాష్ర్టానికి సంబంధించి ఏడేండ్లలో ఏమిచ్చినరో ప్రజలకు కూడా తెలియాలి. శాసనసభ వేదికగానే లెక్కలన్నీ బయటపెట్టాలనుకున్నం. వాళ్లు ఇచ్చింది ఒట్టిడబ్బా తప్ప ఏం లేదు. జీడీపీ క్రాష్‌ అయిపోయింది. గ్రేట్‌ యాక్సిడెంట్‌. భారతప్రభుత్వం ఎప్పుడు కోలుకుంటుందో దేవుడికే ఎరుక. 24% మైనస్‌కు పోయింది. ఇంతకుముందు 7% పోయింది.. అంటే మొత్తం 31% మైనస్‌కు పడిపోయింది. దీనినుంచి బయటపడితే కదా మనకు ఇచ్చేది! లొట్టిపిట్ట పెదవులకు నక్క ఆశ పడినైట్లెతది పరిస్థితి. 


logo