సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 02:10:12

ప్రణబ్‌ మరణం తీరని లోటు

ప్రణబ్‌ మరణం తీరని లోటు

  • తెలంగాణతో ఆయనకు అపూర్వ అనుబంధం
  • మాజీ రాష్ట్రపతికి సీఎం కేసీఆర్‌ సంతాపం

ఆతడు అధినాయకులకు ద్వితీయుడు.. కానీ, మంత్రాంగంలో అద్వితీయుడు.. హావభావాల్లో గంభీరుడు. రాజనీతిలో అతి చతురుడు. రాజకీయ వైకుంఠపాళిలో విషపునాగులకు చిక్కకుండా నిచ్చెన మెట్లు మాత్రమే ఎక్కగలిగిన ధీశాలి. నాలుగు తరాల నాయకులకు అతడు మార్గదర్శి. ఎంతటి పని భారాన్నైనా మోయగలిగిన మేధోశక్తి. చేపట్టిన పదవులన్నింటికీ వన్నె తెచ్చిన నాయకుడు. రాష్ట్రపతిగా తెలంగాణనిచ్చిన.. ఉద్యమనేత కేసీఆర్‌ను మెచ్చిన భారతరత్నం ప్రణబ్‌దా ఇకలేరు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మర ణం తీరని లోటు అని పేర్కొన్నారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ప్రణబ్‌ముఖర్జీ ప్రాణాలు కాపాడటానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణతో ప్రణబ్‌కు ఎంతో అనుబంధం ఉన్నదని సీఎం గుర్తు చేసుకున్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్‌, చివరికి రాష్ట్రపతి హోదాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర  డిమాండ్‌లో న్యాయం ఉన్నదని ఆయన భావించేవారని, తాను కలిసిన ప్రతిసారి ఎన్నో విలువైన సూచనలు చేసేవారని సీఎం గుర్తు చేసుకున్నారు. ఒక నాయకుడికి ఉద్యమాన్ని ప్రారంభించి, విజయతీరాలకు చేర్చే అవకాశం దక్కడం అరుదుగా సంభవిస్తుందని, ఆ ఘనత తనకు(కేసీఆర్‌కు) దక్కిందంటూ ప్రణబ్‌ తనను ప్రత్యేకంగా అభినందించారని కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రణబ్‌ ముఖర్జీ రాసిన ‘ది కొలిషన్‌ ఇయర్స్‌' పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని, కేసీఆర్‌కు తెలంగాణ అంశమే తప్ప పోర్టుఫోలియో అక్కరలేదని పేర్కొన్నారని గుర్తుచేశారు. దీనినిబట్టి ప్రణబ్‌ముఖర్జీ త న జీవితకాలంలో తెలంగాణ అంశాన్ని అత్యంత ప్రాధాన్యమైనదిగా గుర్తించినట్లు అర్థమవుతున్నదని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. యాదాద్రి దేవాలయాన్ని సందర్శిం చి, అక్కడ జరుగుతున్న పనులను అభినందించారని తెలిపారు. ప్రణబ్‌ మరణం తీరని లోటని సీఎం కేసీఆర్‌ తన బాధను వ్యక్తంచేశారు. వ్యక్తిగతంగా తన తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ప్రణబ్‌కు నివాళి అర్పించారు. ప్రణబ్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

టీఆర్‌ఎస్‌ కార్యక్రమాలు వద్దు: కేసీఆర్‌

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతికి నివాళిగా వా రంపాటు పార్టీ కార్యక్రమాలేవీ నిర్వహించరాదని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు ఆదేశించారు. రాష్ట్రంలో వారంరోజులు సంతాప దినాలుగా పాటిస్తున్నందున ఈ సమయంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

దేశం గొప్పనాయకుడిని కోల్పోయింది

ప్రణబ్‌ముఖర్జీ మృతిపట్ల రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. దేశం ఒక గొప్పనాయకుడిని, నిర్వాహకుడిని, అద్భుతమైన వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు.

సీనియర్‌ రాజకీయ నాయకులుగా ప్రణబ్‌ దేశానికి ఎంతో సేవ చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎంతగానో ప్రోత్సహించారు.

- గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ 

అనేక ప్రముఖ పదవులను నిర్వహించి వాటికి వన్నె తెచ్చిన మేధావి ప్రణబ్‌ముఖర్జీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అనేక దశల్లో ఆయన ప్రాముఖ్యమైన పాత్ర పోషించారు.  

- పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌

ప్రణబ్‌ ముఖర్జీ మృతి బాధకరం. రాష్ట్ర ఆశయ సాధనలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు.  ఆయన సేవలను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకొంటుంది.

-టీ హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి  

ప్రణబ్‌ చిరస్మరణీయుడు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. 

- ఈటల రాజేందర్‌, వైద్యారోగ్య మంత్రి

తెలంగాణ రాష్ట్రం ఏర్పటులో తనవంతు పాత్ర పోషించిన ప్రణబ్‌ను తెలంగాణ సమాజం మర్చిపోదు.

-  నిరంజన్‌రెడ్డి , వ్యవసాయశాఖ మంత్రి

ప్రణబ్‌ మరణం దేశానికి తీరని లోటు.ఆయన కుటుంబసభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను.

- మహమూద్‌ అలీ, హోం శాఖ మంత్రి

తెలంగాణ సమాజం ప్రణబ్‌ ముఖర్జీని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.  

- జీ జగదీశ్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజముద్ర వేసిన వ్యక్తిగా ప్రణబ్‌ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.  

- ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి 

చేపట్టిన అన్ని పదవులకు వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి ప్రణబ్‌. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. 

- వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్‌ అండ్‌ బీశాఖ మంత్రి

ప్రణబ్‌ గొప్ప మేధావి. మహోన్నత వ్యక్తి. తెలంగాణ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

- సత్యవతి రాథోడ్‌, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి

సాధారణ కార్యకర్త నుంచి అత్యున్నత పదవులు అలంకరించడం ప్రణబ్‌ నిబద్ధతకు నిదర్శనం. 

- పువ్వాడ అజయ్‌కుమార్‌, రవాణాశాఖ మంత్రి 

ప్రణబ్‌ నాకు గురువు సమానులు. ఆయన అజాత శత్రువు, రాజకీయ దురంధరుడు. 

- కే కేశవరావు, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత 

ప్రణబ్‌ ముఖర్జీ ఎలాంటి స్వార్ధం లేకుండా దేశానికి ఎంతో సేవ చేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలిపారు.   

- మాజీ  ఎంపీ కవిత 


logo