గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 01:47:50

నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్‌ భేటీ

నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్‌ భేటీ

  • ప్రగతిభవన్‌లో 12 గంటలకు సమావేశం
  • టీఎన్జీవో, టీజీవో నేతలకు ఆహ్వానాలు
  • 200 మంది ఉద్యోగులకు అక్కడే భోజనాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం సమావేశం కానున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్‌కు రావాలని టీఎన్జీవో, టీజీవో నేతలకు ఆహ్వానం అందింది. సీఎంతో భేటీకి హాజరయ్యే ఉద్యోగులందరికీ ప్రగతిభవన్‌లోనే మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 200 మంది ఉద్యోగులు, అధికారులు కేసీఆర్‌తో భేటీ కానున్నారు. పీఆర్సీ, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, ఇతర సమస్యలపై ముఖ్యమంత్రి ఉద్యోగులతో మాట్లాడే అవకాశం ఉన్నది. పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలన్నీ ఫిబ్రవరి చివరి కల్లా పరిష్కారమవ్వాలని ఇప్పటికే అధికారులను సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో గురువారం నాటి సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది. ముఖ్యమంత్రిని కలవాలని కొంతకాలంగా ఉద్యోగసంఘాలు కోరుతున్న నేపథ్యంలో ఈ భేటీని ఆత్మీయ సమావేశంగా ఏర్పాటుచేస్తున్నారు.

సంతోషాన్నిచ్చిన సీఎం నిర్ణయం


కరోనాతో దుఃఖంగా సాగిన ఈ ఏడాది చివరలో సీఎం కేసీఆర్‌ అందరికీ సంతోషాన్ని కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ఐదేండ్లకోసారి ఇచ్చే పీఆర్సీని గత ప్రభుత్వాలు రెగ్యులర్‌ ప్రభుత్వోద్యోగులకు మాత్రమే ప్రకటించే వారు. కానీ, సీఎం కేసీఆర్‌ అన్నిరకాల ఉద్యోగులకు వేతనాలు పెంచడం చారిత్రాత్మకమైనది. ఈ నిర్ణయంతో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో కలిపి 9,36,976 మంది వేతనాలు పెరుగుతున్నాయి. పదోన్నతులు, బదిలీలు షెడ్యూల్‌ ప్రకారం జరిగేలా సర్వీస్‌ రూల్స్‌ రూపొందించాలని నిర్ణయించడం ఉద్యోగులకు ఎంతో వెసులుబాటును కలిగిస్తుంది. ఫిబ్రవరి చివరికల్లా ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పిన సీఎం కేసీఆర్‌ మాటపై పూర్తి నమ్మకం ఉన్నది.

- మమత, టీజీవో అధ్యక్షురాలు


logo