సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 17:03:35

ప‌క‌డ్బందీగా కొత్త రెవెన్యూ చ‌ట్టం అమ‌లు : సీఎం కేసీఆర్

ప‌క‌డ్బందీగా కొత్త రెవెన్యూ చ‌ట్టం అమ‌లు : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్ర‌తినిధుల‌తో ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు స‌మావేశ‌మ‌య్యారు. రైతు సంక్షేమ‌మే ల‌క్ష్యంగా తెచ్చిన రెవెన్యూ చ‌ట్టాన్ని ప‌క‌డ్బందీగా అమ‌లు చేసేందుకు రెవెన్యూ శాఖ‌లోని అధికారులు, సిబ్బంది స‌మిష్టిగా చిత్త‌శుద్ధితో ప‌ని చేయాల‌ని సీఎం సూచించారు. ప్ర‌జ‌లు సంతోషంగా ఉండాల‌న్న ల‌క్ష్యంతో నూత‌న రెవెన్యూ చ‌ట్టాన్ని తీసుకొచ్చామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇక నుంచి రెవెన్యూ వ్య‌వ‌స్థ‌లో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపించాల‌ని ఆయ‌న చెప్పారు. రెవెన్యూ కార్యాల‌యాల‌కు వ‌చ్చే ప్ర‌జ‌ల‌తో మర్యాద‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించి, వారి స‌మ‌స్య‌ల‌ను ఓపిక‌గా ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

గ‌తంలో మండ‌లాలు, గ్రామాల్లో బాగా ప‌ని చేసే అధికారుల‌ను ప్ర‌జ‌లు దేవుళ్లుగా భావించేవారు. మ‌ళ్లీ అలాంటి సంస్కృతిని నెల‌కొల్పాలి. అధికారులు త‌మ‌తో ఎలా మాట్లాడుతున్నార‌నే విష‌యాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తుంటారు. రెవెన్యూ యంత్రాంగం స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే విష‌యంలో సానుకూలంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సీఎం సూచించారు. ప్ర‌జ‌లు కేంద్ర బిందువుగానే ప్ర‌భుత్వం నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని ఆ నేప‌థ్యంలోనే నూత‌న రెవెన్యూ చ‌ట్టం తీసుకొచ్చామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. కొత్త చ‌ట్టం ఎవ‌రికీ వ్య‌తిరేకం కాద‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. 

త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల‌కు రూ. 60 కోట్లు

ఎన్నిక‌లు, ప్ర‌కృతి వైప‌రీత్యాలు స‌హా 54 ర‌కాల బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తూ రెవెన్యూ సిబ్బంది క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తున్నార‌ని కేసీఆర్ ప్ర‌శంసించారు. రెవెన్యూ శాఖ‌లో అన్ని స్థాయిల్లో ప్ర‌మోష‌న్ల ప్ర‌క్రియ‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని ఆదేశించారు. త‌హ‌సీల్దార్ల‌కు కారు అల‌వెన్సు రెగ్యుల‌ర్‌గా ఇవ్వాలి. త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల్లో సౌక‌ర్యాల క‌ల్ప‌న కోసం రూ. 60 కోట్లు మంజూరు చేస్తామ‌న్నారు. ప్రోటోకాల్ స‌హా కార్యాల‌యాల నిర్వ‌హ‌ణ కోసం నిధుల కొర‌త లేకుండా చూడాల‌ని సీఎం చెప్పారు. 

రెవెన్యూ యంత్రాంగానికి ప్ర‌భుత్వం అండ‌

రెవెన్యూ యంత్రాంగానికి విధి నిర్వ‌హ‌ణ‌లో ఏవైనా స‌మ‌స్య‌లు ఎదురైతే ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. వీఆర్వోల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఇత‌ర శాఖ‌ల్లో చేరేందుకు ఆప్ష‌న్లు ఇస్తామ‌న్నారు. వీఆర్ఏల‌లో అత్య‌ధికంగా పేద వ‌ర్గాల వారే ఉన్నార‌ని, వీరిలో వ‌యోభారం ఉన్న వారి పిల్ల‌ల‌కు ఉద్యోగ అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు. వీఆర్ఏల‌కు పే స్కేలు ఇవ్వ‌డం వ‌ల్ల ప్ర‌భుత్వంపై రూ. 260 కోట్ల అద‌న‌పు భారం ప‌డుతుంద‌న్నారు సీఎం. 

తెలంగాణ భూమి హ‌క్కులు, ప‌ట్టాదారు పాస్‌బుక్‌ల బిల్లు-2020ను తెలంగాణ శాస‌న‌స‌భ ఏక‌గ్రీవంగా ఆమోదించిన విష‌యం విదిత‌మే. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ నూత‌న రెవెన్యూ చ‌ట్టంపై సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు. నూత‌న రెవెన్యూ చ‌ట్టం ఆమోదం పొంద‌డంతో రైతులు సంబురాలు చేసుకుంటున్నారు.


logo