శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 03:03:27

జలవనరులశాఖకు తుది మెరుగులు

జలవనరులశాఖకు తుది మెరుగులు

  • పునర్వ్యవస్థీకరణ దాదాపు కొలిక్కి
  • 13, 14 తేదీల్లో చీఫ్‌ ఇంజినీర్లతో భేటీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దాదాపు కొలిక్కి వచ్చిన జలవనరులశాఖ పునర్వ్యవస్థీకరణకు తుదిమెరుగులు దిద్దేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ, మధ్యతరహా, చెరువులు ఇలా అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి చీఫ్‌ఇంజినీర్లవారీగా పరిధులు నిర్ణయించిన విష యం తెలిసిందే. ఈమేరకు వివిధస్థాయిలో ఏర్పడే ఖాళీలు, అందుకు అనుగుణంగా పదోన్నతులు, నియామకాల విధానానికి సంబంధించిన అంశా లు కూడా కొలిక్కి వచ్చాయి. ప్రధానంగా చీఫ్‌ ఇంజినీర్లకు సంబంధించి యూనిట్లు, సర్కిళ్లు, డివిజన్లు, సబ్‌డివిజన్లలో స్వల్పమార్పులు చేయా ల్సి ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సీఈల నుంచి కొన్నింటిని తొలిగించడం, కొందరికి జోడించడం వంటి కసరత్తుచేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇం దుకు చీఫ్‌ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించి ఇప్పటికే లిఖితపూర్వకంగా సమాచారం అందించారు. జలసౌధలోని ఈఎన్సీ కార్యాలయంలో సమావేశాన్ని సోమవారం నుం చి ఈనెల 9 వరకు నిర్వహించాలని భావించారు. కానీ కేంద్ర జల్‌శక్తిశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగనున్నది. దీంతో జలవనరులశాఖ పునర్వ్యవస్థీకరణపై చేపట్టనున్న సమావేశాన్ని ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్టు తాజాగా ఈఎన్సీ (పరిపాలన) సర్క్యులర్‌ జారీచేశారు.