బుధవారం 08 జూలై 2020
Telangana - Apr 13, 2020 , 01:21:46

అప్రమత్తతే ఆయుధం

అప్రమత్తతే ఆయుధం

  • ప్రపంచం, దేశంలో పెరుగుతున్న కేసులు
  • రాష్ట్రంలో 531కి చేరిన కరోనా బాధితులు
  • ప్రజలు, అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి
  • మర్కజ్‌ వెళ్లొచ్చినవారు స్వచ్ఛందంగా రండి
  • ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ మహమ్మారి ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా ప్రపం చం, దేశం, తెలంగాణలోనూ వ్యాప్తి చెందుతున్నదని, ప్రజలు ఇంతకుముందుకంటే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తిచేశారు. అప్రమత్తతే కొవిడ్‌ కట్టడికి ఆయుధమని పేర్కొన్నారు. కొవిడ్‌ వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలు, వైరస్‌ సోకినవారికి అందుతున్న చికిత్స, లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరు, పేదలకు అందుతున్న సాయం, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి 9.30 గంటలవరకు సాగిన ఈ సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 28 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ఇద్దరు చనిపోయారని తెలిపారు. చికిత్స పొందుతున్నవారిలో ఏడుగురు కోలుకొని డిశ్చార్జి అయినట్టు చెప్పారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 531కి, మరణించినవారి సంఖ్య 16కు, డిశ్చార్జి అయినవారి సంఖ్య 103కు చేరినట్టు వివరించారు. మిగతా 412 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, తెలంగాణలో పరిణామాలను గమనిస్తుంటే కరోనా వైరస్‌ వ్యాప్తి ఆగడంలేదని స్పష్టమవుతుంది. 

ఆదివారం కూడా గణనీయ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 28 మందికి పాజిటివ్‌గా తేలడంతోపాటు ఇద్దరు చనిపోయారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో పరిస్థితి భయంకరంగా ఉంది. దేశవ్యాప్తంగా కూడా పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరిగాయి. ఈ పరిస్థితి ఉన్నందునే లాక్‌డౌన్‌ పొడిగింపు నిర్ణయం తీసుకున్నాం. పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాలి. వీలైనంతవరకు ఇండ్లకే పరిమితం కావాలి. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పక నిర్ణీత దూరం పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. ఎవరికి ఏమాత్రం అనుమానం వచ్చినా పరీక్షలు చేయించుకోవాలి. వైరస్‌ సోకిన వ్యక్తులున్న ప్రాంతాలను గుర్తించి, ప్రభుత్వం అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ప్రజలు దానికి సహకరించాలి. కరోనా వ్యాప్తి నివారణ అన్నది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. ఆ నిర్ణయాలను ప్రజలు తూచా తప్పకుండా పాటించడం వల్లే సాధ్యమవుతుంది. వైరస్‌ వ్యాప్తి జరుగుతున్నదనే వాస్తవం గ్రహించి, ప్రజలు ఇంతకుముందుకంటే కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని సీఎం కోరారు. 

పాజిటివ్‌ కేసుల వెనుక ఆరా తీయండి

ఈ తరుణంలో అధికార యంత్రాంగం కూడా మరింత అప్రమత్తమై ఎవరికి లక్షణా లు కనిపించినా పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పాజిటివ్‌ వచ్చినవారు ఎవరెవరిని కలిశారు? ఎక్కడ తిరిగారు? అనే వివరాలు సేకరించి, వారికి కూడా పరీక్షలు నిర్వహించాలని సూచించారు ‘అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలు ఎక్కువ చేయాలి. నియంత్రణ పెంచాలి. మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్నవారిని గుర్తించి, పరీక్షలు చేసే ప్రక్రియ ముమ్మరంగా జరుగుతుంది. ఇంకా ఎవరైనా తెలిసో తెలియకో పరీక్షలు చేయించుకోకుంటే వారే స్వయంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. ఇది వారికోసం, వారి కుటుంబసభ్యుల సంక్షేమంకోసం చెప్తున్న మాటలు. ప్రజలు నిరంతర అప్రమత్తంగా ఉంటూ, ఇండ్లకు పరిమితమైతేనే కరోనా వ్యాప్తి నివారణ సాధ్యమవుతుంది’ అని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ఈ సమీక్షలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo