మంగళవారం 07 జూలై 2020
Telangana - Apr 22, 2020 , 01:57:39

జిల్లాలు భద్రం

జిల్లాలు భద్రం

  • ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లి పర్యటించాలి
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం.. కరోనాపై సమీక్ష
  • 3 జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు  క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా వెళ్లి పరిశీలించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు వెంటనే జిల్లాల పర్యటనలకు బయల్దేరాలని చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకొంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి మంగళవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు.  ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా తెలుసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సీఎస్‌, డీజీపీ, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,  వైద్య ఆరోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాస్‌ బుధవారం సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సమీక్షలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. 

కరోనా నివారణకు ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్‌లు

కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉన్న జిల్లాలకు ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించింది. వికారాబాద్‌ జిల్లాకు రజత్‌కుమార్‌ సైనీ, జోగుళాంబ గద్వాల జిల్లాకు రొనాల్డ్‌రాస్‌, సూర్యాపేట జిల్లాకు సర్ఫరాజ్‌ అహ్మద్‌ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఆయా అధికారులు కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, సీఎస్‌కు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 


logo