ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 11, 2021 , 01:55:05

కలెక్టర్లతో సీఎం సమావేశం నేడు

కలెక్టర్లతో సీఎం సమావేశం నేడు

  • హాజరుకానున్న మంత్రులు, అన్ని శాఖల అధికారులు
  • కీలకాంశాలపై సమీక్ష.. పలు నిర్ణయాలకు అవకాశం

హైదరాబాద్‌, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలు కీలకఅంశాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. దాదాపు అన్ని శాఖల పనితీరును సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, వైద్యారోగ్య, విద్య, అటవీశాఖలతోపాటు ఇతరశాఖల ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. ప్రగతిభవన్‌లో ఉదయం 11.30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఉన్నతస్థాయి సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ధరణి, తెలంగాణకు హరితహారం, గ్రామగ్రామాన నర్సరీలతోపాటు, కరోనా టీకా పంపిణీకి కార్యాచరణ, విద్యాసంస్థల ప్రారంభంపై ప్రధానంగా చర్చ జరుగనున్నది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో సీఎం కేసీఆర్‌ చర్చించనున్నారు. టీకాను అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడం, ప్రజలకు అందించే కార్యాచరణ రూపొందిస్తారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును సమీక్షిస్తారు. రాష్ట్రంలో ఉద్యమంలా సాగుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. కార్యక్రమాన్ని గ్రామగ్రామాన మరింత పటిష్ఠంగా అమలు పరచడానికి సీఎం పలు సూచనలను చేస్తారని అధికారులు తెలిపారు.

నివేదికకు సిద్ధంగా రెవెన్యూ జాబితా

గ్రామాల్లో రెవెన్యూ సంబంధ సమస్యలపై అధికారులు సమగ్ర నివేదికలు రూపొందించారు. వీటిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు నివేదించే అవకాశం ఉన్నది. భూ సమస్యలు, ధరణి ఇబ్బందులను అధికారులు సమగ్రంగా సేకరించారు. పార్ట్‌-బీ, కోర్టు కేసుల్లోని భూములు, సాదాబైనామా, పెండింగ్‌ మ్యుటేషన్‌ దరఖాస్తులు తదితర అంశాలపై తాసిల్దార్లు నివేదికలు రూపొందించి కలెక్టర్లకు అందజేశారు. వీటి ఆధారంగా రాష్ట్రంలోని వ్యవసాయ భూముల సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత రానున్నది. మరోవైపు ధరణికి సంబంధించి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకొనేందుకు ఇప్పటికే శాంపిల్‌ సర్వే నిర్వహించారు. రెవెన్యూ డివిజన్‌కు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని.. అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో వివరాలు సేకరించారు. వాటిని క్రోడీకరించారు. ఈ వివరాలన్నీ కలెక్టర్లు.. వారినుంచి పైఅధికారుల వద్దకు చేరాయి. పెండింగ్‌ మ్యుటేషన్ల పరిష్కారంపై కూడా సీఎం కేసీఆర్‌తో సమీక్ష తర్వాత స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. సాదాబైనామాలకు సంబంధించి కోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నది. ఇప్పటికే 9 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. వీటిపైనా తాసిల్దార్లు దృష్టిపెట్టారు. వేటిని ఆమోదించవచ్చో, తిరస్కరించవచ్చో ప్రాథమికంగా వివరాలు సేకరించి పెట్టుకున్నారు. 


logo