బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 02:01:37

అల్లం.. ఆలుగడ్డ.. పసుపు వాణిజ్య సాగు భేష్‌

అల్లం.. ఆలుగడ్డ.. పసుపు వాణిజ్య సాగు భేష్‌

  • సంగారెడ్డి జిల్లా రంజోల్‌ రైతులతో సీఎం కేసీఆర్‌
  • ఎర్రవల్లిలో సీఎంకు జహీరాబాద్‌ అల్లం అందజేత
  • అల్లం, ఆలుగడ్డ సాగు ఖర్చు, దిగుబడులపై ఆరా

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అల్లం, ఆలుగడ్డ, పసుపు వంటి వాణిజ్య పంటలను విస్తృతంగా సాగుచేయడంపై రాష్ట్రంలో రైతులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండలం రంజోల్‌కు చెందిన అల్లం, ఆలుగడ్డ రైతులు నాగేశ్వరరెడ్డి, వెంకట్రాంరెడ్డి  జిల్లా ఉద్యానశాఖ  అధికారి సునీతతో కలిసి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. వారు పండించిన జహీరాబాద్‌ అల్లంను అందజేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్‌లో సాగుచేస్తున్న పంటల గురించి సీఎం వివరంగా రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. చాలాచోట్ల రైతులు ఎప్పుడూ వేసే వరి, మక్కజొన్న, పత్తి సాగుచేస్తుండగా, మీరు మాత్రం అల్లం, ఆలుగడ్డ, పసుపు వంటి పంటలు సాగుచేయడం అభినందనీయమన్నారు. 

అల్లం, ఆలుగడ్డ సాగు విస్తీర్ణం మరింత పెంచి ఆదర్శంగా నిలువాలని సూచించారు. అల్లం సాగులో ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారు? ఆలుగడ్డ సాగు ఎలా ఉన్నది? ఆలుగడ్డ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అని సీఎం అడిగి తెలుసుకొన్నారు. అల్లంకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంటుందని, మంచి వాణిజ్య పంటలు పండిస్తున్నారని మెచ్చుకున్నారు. అల్లం, ఆలుగడ్డ ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది? ఎంత ఖర్చు అవుతుంది? అని ఆరా తీశారు. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్‌ ప్రాంతంలోనే ఎక్కువగా అల్లం, ఆలుగడ్డ, పసుపు సాగవుతుందని హార్టికల్చర్‌ అధికారి సునీత వివరించారు. దాదాపు 5,500 ఎకరాల్లో అల్లం, 4 వేల ఎకరాల్లో ఆలుగడ్డ సాగవుతుందని చెప్పారు. ప్రతి అంశాన్ని  రైతులు, అధికారి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడిగి తెలుసుకొన్నారు. జహీరాబాద్‌ కూడా కాళేశ్వరం జలాలు అందిస్తామని సీఎం కేసీఆర్‌ రైతులకు హామీ ఇచ్చారు. కొండపోచమ్మసాగర్‌ నుంచి సింగూరు ప్రాజెక్టును నీటిని తరలిస్తామని, అక్కడి నుంచి లిఫ్ట్‌ల ద్వారా జహీరాబాద్‌కు సాగునీరు అందిస్తామని చెప్పారు. రంజోల్‌ రైతులతో సీఎం కేసీఆర్‌ ఉదయం నుంచి రాత్రివరకు పంటల సాగుపైనే చర్చించారు. 

 అల్లం, ఆలు సాగుపై వివరించాం

వ్యవసాయంలో సీఎంకు ఎంతో అనుభవం ఉన్నది. ఆలుగడ్డ, అల్లం, పసుపు, చెరుకు సాగును క్షుణ్ణంగా అడిగి తెలుసుకొన్నారు. వాణిజ్య పంటల సాగుతో లాభాలు ఎలా ఉన్నాయని అడిగారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు సాగుచేస్తే రైతులకు కష్టాలు ఉండవని చెప్పారు. మేము ఎంచుకున్న సాగు పద్ధతి బాగుందని అభినందించారు. మార్కెట్‌కు అనుగుణంగా పంటలు సాగుచేస్తే నష్టాలు ఉండబోవని సూచించారు. జహీరాబాద్‌కు కాళేశ్వర జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మేము పండించిన అల్లంను పెద్దసారుకు అందించాం. 

- నాగేశ్వర్‌రెడ్డి, రైతు రంజోల్‌ 

 బిందు సేద్యంతో వాణిజ్య పంటలు

తక్కువ నీటితో వాణిజ్య పంటలు సాగుకు బిందు సేద్యం ఉపయోగిస్తున్నామని సీఎం కేసీఆర్‌కు వివరించా. మా దగ్గర చాలావరకు బిందు సేద్యంతోనే వాణిజ్య పంటలు సాగుచేస్తారు. జహీరాబాద్‌లో పండించిన పంటలను చాలా రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పగానే సీఎం సారు అభినందించారు. డిమాండ్‌ ఉన్న పంటలు సాగుచేయడం వల్లే ఎగుమతి చేయగలుగుతున్నారని మెచ్చుకొన్నారు. చెరుకు చాలావరకు తగ్గించి, అల్లం, ఆలుగడ్డ సాగుచేస్తున్నాం. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నుంచి ఆలుగడ్డ విత్తనాలు తెస్తున్నామని సీఎం కేసీఆర్‌కు చెప్పాం.

- వెంకట్‌రాంరెడ్డి, రైతు రంజోల్‌ 


logo