ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 01:39:07

నెహ్రూకు సమాంతర వ్యక్తి

నెహ్రూకు సమాంతర వ్యక్తి

  • పీవీ గొప్ప సంస్కరణశీలి
  • తన ఇంటినుంచే భూసంస్కరణలు
  • విద్యాశాఖ హెచ్చార్డీగా మార్పు
  • సర్వేల్‌స్కూల్‌కు నాంది పలికారు
  • ఆయన ఆశయంకోసమే కొత్తగా 900 గురుకులాలు
  • పీవీ శతజయంతి ఉత్సవాల్లో సీఎం కే చంద్రశేఖర్‌రావు

ఓ సందర్భంలో పీవీకి జైళ్లశాఖ అప్పగించారు. అక్కడా సంస్కరణలు చేపట్టి ఓపెన్‌ జైల్‌ కాన్సెప్ట్‌ తీసుకొచ్చారు. హెచ్‌ఆర్డీ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పలు పరిణామాలతో ఆయనకు మళ్లీ ఆ శాఖను ఇచ్చే అవకాశం లేదని ఓ వ్యక్తి పీవీకి చెప్పారట. దీనికి.. ‘ఫర్వాలేదు.. నాకు మత్స్యశాఖ ఇచ్చినా అక్కడ కూడా సంస్కరణలు తీసుకొస్తా’ అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాజీ ప్రధా ని పీవీ నరసింహారావు గొప్ప సంస్కరణశీలి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా భూసంస్కరణలను అమలుచేసిన పీవీ.. ఆ ప్రక్రియను తన కుటుంబంతోనే ప్రారంభించారని గుర్తుచేశారు. పీవీ గొప్ప అభ్యుదయవాది కాబట్టే నిరంతర సంస్కరణశీలిగా ఉన్నారని కొనియాడారు. నాడు పీవీ చేపట్టిన సంస్కరణలే నేడు దేశమంతటా ఫలితాలిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ఆదివారం పీవీ శతజయంతి ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలో పీవీ అమలుచేసిన సంస్కరణలను ముఖ్యమంత్రి వివరించారు. 

ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘సంస్కరణలు నిరంతర ప్రక్రియ. పరిస్థితులను బట్టి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని స్వీకరించాలి. అది అభ్యుదయవాదుల ఆలోచనా సరళి. పీవీ గొప్ప అభ్యుదయవాది కాబట్టే సంస్కరణశీలిగా ఉన్నారు. ఆ కాలానికి ఏ సంస్కరణ అవసరమో అర్థం చేసుకొని, చదివి, ఇతరులకు నేర్పి.. అందరినీ ఒప్పించి సం స్కరణలను అమలుచేసిన గొప్ప ధీరుడు. మా ర్పును వెంటనే అంగీకరించకపోవడం మానవ నైజం. అది ఐతదా ఎక్కడికెల్లి అయితది అం టరు. కానీ పీవీ అలాంటి ప్రధాని కాదు. ఎవరికీ భయపడకుండా, తనకు అర్థమైతే, పూర్తిగా నమ్మ కం కలిగితే ఆ సంస్కరణను అమలుచేస్తారు. అలా ఆయన నాడు చేసిన సంస్కరణలే నేడు ఫలితాలిస్తున్నాయి. తొలుత కంట్రీప్లానింగ్‌ మొదలుపెట్టిన వ్యక్తి నెహ్రూ అయితే.. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ. తన వినూత్న ఆర్థిక సంస్కరణలతో గ్లోబల్‌ ఇండియాను ఆవిష్కరించారు. నెహ్రూకు సమాంతరంగా ఉన్నటువంటి వ్యక్తి పీవీ. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 

సంస్కరణలు అమలుకు ధైర్యంకావాలి

ఒక నాయకుడిగా సంస్కరణలు చేయడానికి, వాటివల్ల వచ్చే విమర్శలను తట్టుకోవడానికి ధైర్యం ఉండాలి. పీవీ ఏ రంగంలో, ఏ స్థానంలో ఉన్నా అక్కడ సంస్కరణలు తేవడమే ఆయన పని. అందుకే సంస్కరణశీలి అనే మాటకు పీవీ సరైన వ్యక్తి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండ జిల్లా సర్వేల్‌లో రెసిడెన్షియల్‌ స్కూల్‌ను స్థాపించి గురుకుల విద్యకు నాంది పలికారు. మన డీజీపీ మ హేందర్‌రెడ్డి అందులోనే చదువుకున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, దౌ త్యవేత్తలు వంటి ఎంతోమంది రత్నాలను సర్వేల్‌ స్కూల్‌ తయారుచేసింది. ఆ తర్వాత కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా పీవీకి అవకాశం వచ్చింది. అప్పటివరకు ఆ శాఖ ను విద్యాశాఖ అనేవారు. ఈ పేరు సరైంది కాదని దానిని హెచ్‌ఆర్డీ మంత్రిత్వశాఖగా మార్పించారు. ఆయన నిరంతర సంస్కరణశీలి కాబట్టి హెచ్‌ఆర్డీ మంత్రిగా దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఆయన తీసుకొచ్చిన గురుకుల విద్య.. నేడు విద్యావ్యవస్థకే తలమానికంగా ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం కూడా పీవీ ఆశయం కోసమే కొత్తగా 900 గురుకులాలను ఏర్పాటుచేసింది. అందులో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. బోర్డు పరీక్షల్లో 99.9%, కొన్ని చోట్ల 100% ఫలితాలు వస్తున్నాయి. ఇది పీవీ చూపించిన బాట. 

తన భూమి ఇచ్చి భూ సంస్కరణలకు బీజం

ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సంస్కరణలు చేపట్టే పీవీ.. ఉమ్మడి ఏపీ సీఎంగా అవకాశం రావడంతో భూ సంస్కరణలు అమలుచేశారు. వాటిని ఆయన తన కుటుంబంతోనే ప్రారంభించారు. అప్పటికే ఆయన  1200 ఎకరాల ఆసామి. తన కుటుంబానికి 100 నుంచి 200 ఎకరాల భూమి ఉంచుకొని మిగిలిన భూమిని ప్రభుత్వానికి అప్పగించిన మహోన్నత వ్యక్తి. ఇది మాములు విషయం కాదు. అదే ఈ రోజుల్లో అయితే మాయా మశ్చింద్ర చేసి ఓ పదెకరాలు ఇచ్చి తప్పించుకుంటరు. అందుకే పీవీ మన తెలంగాణ ఠీవీ అని అంటున్నా. జాగీర్దారు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలను ఆయన స్వయంగా చూశారు. దాని నుంచి నేర్చుకున్నారు. దీని ఫలితమే ఆయన చేపట్టిన భూ సంస్కరణలు. ఇది మన చరిత్ర, మన సొంత చరిత్ర, మన వంగర చరిత్ర, మన తెలంగాణ చరిత్ర.

పీవీకి సీఎం కేసీఆర్‌ నివాళి..

జ్ఞానభూమికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ నేరుగా పీవీ సమాధి వద్దకు వెళ్లి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత సమాధి చుట్టూ తిరిగి నివాళులు అర్పించా రు. పీవీకి నివాళులర్పించిన వారిలో శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌ కే కేశవరావు, స్పీకర్‌ పోచా రం, మంత్రులు కేటీఆర్‌, తలసాని, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు రమణాచారి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. తొలుత పీవీ ఆత్మకు శాంతి చేకూరేలా సర్వమత ప్రార్థనలు, సంకీర్తనలు నిర్వహించారు. 

వేదికపై ఐదుగురే

ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం మొత్తం కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు. వేదికపై కేవలం ఐదుగురికే స్థానం కల్పించారు. సీఎం కేసీఆర్‌తోపాటు స్పీకర్‌ పోచారం, ఉత్సవాల కమిటీ చైర్మన్‌ కేశవరావు, పీవీ కుమార్తె వాణీదేవి, కుమారుడు ప్రభాకర్‌రావు మాత్రమే వేదికపై కూర్చున్నారు.

కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమన్న పీవీ: పోచారం

తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని ఉద్యమ సమయంలోనే పీవీ చెప్పారని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ కు తొలి సీఎం కూడా కేసీఆరే అవుతారని చెప్పారన్నా రు. అంతటి గొప్ప వ్యక్తి జయంతి వేడుకలను ఘనం గా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

పీవీకి ఎంతచేసినా తక్కువే: కేకే

పీవీలాంటి మహోన్నత వ్యక్తికి ఎంత చేసినా తక్కువేనని  పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌, సభాధ్యక్షుడు కే కేశవరావు అన్నారు. పీవీని పూర్తిగా ఆవిష్కరించాలనేదే సీఎం కేసీఆర్‌ ఉద్దేశమని చెప్పారు. అందుకే దేశ విదేశాల్లో పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

భాషకు అందని వ్యక్తిత్వం: వాణి

‘భాషకు అందని వ్యక్తి త్వం మా బాపుది’ అని పీవీ కూతురు వాణీదేవి అన్నారు. తన తండ్రి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఉద్వేగానికి గురయ్యారు. తన తండ్రి శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు మాట్లాడుతూ..  తన  తండ్రిలో ఎన్నో కోణాలు ఉండేవన్నారు. 


logo