ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 12:54:41

హరితహారం : అల్లనేరేడు మొక్క నాటిన సీఎం కేసీఆర్‌

హరితహారం : అల్లనేరేడు మొక్క నాటిన సీఎం కేసీఆర్‌

మెదక్‌ : ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌లో అల్లనేరేడు మొక్కను నాటి ప్రారంభించారు. అలాగే నర్సాపూర్‌లో అర్బన్‌ ఫారెస్ట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 కోట్ల మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 34 శాఖల సమన్వయంతో రాష్ట్ర అటవీశాఖ ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికే ఎక్కడికక్కడ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామ గ్రామాన హరితహారం జోరుగా కొనసాగుతుంది.


నర్సాపూర్‌ అర్బన్‌పార్క్‌ విశిష్టతలు... 

నర్సాపూర్‌ అర్బన్‌పార్క్‌లో అనేక విశిష్టతలున్నాయి. ఇది ఐదు అటవీ కంపార్ట్‌మెంట్‌లలో 4,380 ఎకరాల అటవీ ప్రాంతం. 630 ఎకరాల్లో ఫారెస్ట్‌ పార్క్‌ ఉన్నది. ఇందుకోసం రూ.8 కోట్ల వ్యయంచేశారు. 15 కిలోమీటర్ల మేర రక్షణ ప్రహరీ (సీ త్రూ వాల్‌, చైన్‌ లింక్‌ ఫెన్సింగ్‌)తో నిర్మాణం జరిగింది. సహజసిద్ధమైన అడవులు, ఎత్తైన కొండలు, పక్షుల కిలకిలరావాలు.. ఎత్తైన వాచ్‌టవర్‌, ప్రత్యేక ముఖద్వారాలతో నర్సాపూర్‌ అర్బన్‌ పార్క్‌ ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తుంటుంది.

ఈ అటవీ ప్రాంతం 256 పక్షి జాతులకు నిలయంగా ఉన్నది. తెలంగాణలో 434 పక్షి జాతులుండగా.. అందులో 60 శాతం నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలోనే ఉండటం విశేషం. ఇక్కడ ఉండే 256 పక్షి జాతుల్లో 173 స్థానికమైనవి. మిగతా 83 రకాలు వలస పక్షులు. ఇవి వేసవి, శీతాకాలంలోనే ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటాయి.logo