బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 01, 2020 , 02:08:40

భారీగా రోడ్ల నిర్మాణం చేపట్టాం

భారీగా రోడ్ల నిర్మాణం చేపట్టాం
  • రహదారులకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం
  • ‘దీర్ఘకాల వంతెనల నిర్మాణంపై’ వర్క్‌షాప్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో భారీఎత్తున రోడ్ల నిర్మాణాన్ని చేపట్టామని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌)లో దీర్ఘకాల వంతెనల నిర్మాణంపై నిర్వహించిన జాతీయ వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడా రు. రాష్ట్ర సత్వరాభివృద్ధికి రోడ్‌ నెట్‌వర్క్‌ కీలకమని భావించిన సీఎం కేసీఆర్‌ రోడ్ల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పా రు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 2014లో రూ.12 వేల కోట్లు కేటాయించామన్నారు. 


ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్‌ లేన్‌రోడ్ల నిర్మించాలని నిర్ణయించి నిధులు కేటాయించామని తెలిపారు. 459 మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్‌ లేన్‌ రోడ్లు వేశామని వివరించారు. రూ.7,915 కోట్లతో జిల్లా, రాష్ట్ర రహదారులను 5,595 కిలోమీటర్ల పొడవు నిర్మిస్తున్నామని చెప్పారు. రోడ్‌ నెట్‌వర్క్‌లో వాగులు, నదులపై వంతెనల నిర్మాణం కీలకమని, రూ.2,495 కోట్లతో 511 వంతెనల నిర్మాణం చేపట్టగా 400 వంతెనలు పూర్తయ్యాయ న్నారు. నాలుగున్నరేండ్లల్లో రోడ్లను రెండింతలు అభివృద్ధిచేశామని పేర్కొన్నారు. 


నాలుగున్నరేండ్లల్లో గోదావరిపై ఒక వంతెన, కృష్ణానదిపై ఒక వంతెన, మంజీరా నదికి మూడు వంతెనలు, మానేరు నదిపై నాలుగు వంతెనలు నిర్మించామన్నారు. వర్షపునీరు నిలిచి భూగర్భ జలాలు పెరిగేలా 184 ప్రదేశాల్లో వంతెనలతోపాటు చెక్‌ డ్యాంలు నిర్మించామని తెలిపారు. మానేరుపై కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం తుదిదశలో ఉన్నదని చెప్పారు. హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై రూ.220 కోట్లతో నిర్మిస్తున్న కేబుల్‌ బ్రిడ్జి పనులు తుదిదశలో ఉన్నాయని వివరించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఇంజినీర్లు శ్రమించి పనిచేస్తున్నారని, వారికి హృదయపూర్వగా అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. కార్యక్రమంలో సైంటిఫిక్‌ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ మహేశ్‌టండన్‌, ఐఏబీఎస్‌సీ ఇండియన్‌ నేషనల్‌ గ్రూప్‌ సెక్రటరీ బీకే సిన్హా,  ఐఆర్సీ సెక్రటరీ జనరల్‌ నిర్మల్‌, ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, సీఈ రవిప్రసాద్‌, న్యాక్‌ డీజీ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.


logo