శనివారం 06 మార్చి 2021
Telangana - Jan 27, 2021 , 02:08:52

కొత్త సచివాలయం గడువులోగా

కొత్త సచివాలయం గడువులోగా

  • నిర్మాణ పనుల్లో రాజీ పడొద్దు.. వేగం పెంచండి
  • కాంక్రీట్‌ పనులు.. రోడ్లు ఒకేసారి చేపట్టాలి
  • మెటీరియల్‌ ముందే తెప్పించుకోండి
  • వర్క్‌ ఏజెన్సీ, అధికారులకు సీఎం ఆదేశం
  • కొత్త సచివాలయ నిర్మాణ పనుల పరిశీలన

హైదరాబాద్‌, జనవరి 26 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయ పనులు ఎట్టి పరిస్థితిలోనూ నిర్ణయించిన గడువులోగా పూర్తికావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. మంగళవారం ఆయన సచివాలయ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో కలియదిరుగుతూ.. నిర్మాణ సంస్థ ప్రతినిధులకు, అధికారులకు ఎక్కడికక్కడ ఆదేశాలిచ్చారు. ప్రధానగేటుతోపాటు, ఇతర గేట్లు, భవన సముదాయం నిర్మించే ప్రాంతాలను సందర్శించారు. డిజైన్లను పరిశీలించారు. పునాది, కాంక్రీట్‌, స్టీల్‌కు సంబంధించిన పనులను పర్యవేక్షించారు. అక్కడ ఉన్న ఇంజినీర్లు, వర్కింగ్‌ ఏజెన్సీ ప్రతినిధులతో మాట్లాడారు. 

 ఏ కారణం చేతనో నిర్మాణ పనులు ఆలస్యమవుతాయని.. గడువు పెంచాలని వర్క్‌ ఏజెన్సీలు కోరితే అంగీకరించేది లేదు. టెండర్‌ షెడ్యూల్‌ ప్రకారం నిర్ణయించిన గడువులోగా నూతన సచివాలయ భవన సముదాయం నిర్మించి అప్పగించాల్సిందే. ఏ రోజుకారోజు పనుల పురోగతిని అధికారులు పరిశీలిస్తూ తగిన ఆదేశాలు ఇవ్వాలి.

-సీఎం కేసీఆర్‌

కొత్త సచివాలయ నిర్మాణంలో పనుల వేగం పెంచాలి

కొత్త సచివాలయ నిర్మాణంలో పనుల వేగం పెంచాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఎక్కడా ఎలాంటి రాజీ పడకుండా అత్యంత నాణ్యతాప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. ప్రధాన భవన సముదాయ నిర్మాణంతోపాటు సమాంతరంగా రోడ్ల నిర్మాణం, ప్రహరీ నిర్మాణం, ఇతర పనులను కూడా చేపట్టాలన్నారు. ఒకదాని తరువాత మరొకటి చేస్తామంటే పనులు పూర్తికావని హెచ్చరించారు. మరోవైపు నిర్మాణ పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తికావాలంటే.. ముందుగానే మెటీరియల్‌ను తెప్పించుకోవాలని చెప్పారు. అవసరమైన వర్క్‌ షెడ్యూల్‌ను రూపొందించుకొని.. తదనుగుణంగా ముందుగానే మెటీరియల్‌ను నిర్మాణ స్థలానికి తెచ్చుకోవాలని పేర్కొన్నారు. ఏ కారణం చేతనో నిర్మాణ పనులు ఆలస్యమవుతాయని.. గడువు పెంచాలంటే అంగీకరించేది లేదని సీఎం కేసీఆర్‌ వర్కింగ్‌ ఏజెన్సీలకు స్పష్టంచేశారు. టెండర్‌ షెడ్యూల్‌ ప్రకారం నిర్ణయించిన గడువులోగా నూతన సచివాలయ భవన సముదాయం నిర్మించి అప్పగించాల్సిందేనని స్పష్టంచేశారు. ఏ రోజుకారోజు పనుల పురోగతిని పరిశీలిస్తూ తగిన ఆదేశాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. సీఎం వెంట మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి,  మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి,  రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, రోడ్లు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులున్నారు.


చార్ట్‌ ప్రకారం పనులు: మంత్రి వేముల 

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు సచివాలయం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను, నిర్మాణ సంస్థను ఆదేశించారు. మంగళవారం సీఎం కేసీఆర్‌ సచివాలయ పనులను పరిశీలించిన తరువాత తన అధికార నివాసంలో నూతన సచివాలయం, అమరవీరుల స్మారక చిహ్నం పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయం, అమరవీరుల మెమోరియల్‌ను గడువులోగా పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. అందరూ సమిష్టిగా, సమన్వయంతో పనిచేయాలని, అప్పుడే అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయని చెప్పారు. చారిత్రక నిర్మాణాల్లో భాగస్వాములవుతున్న అధికారులు ఎంతో బాధ్యతతో పనిచేయాలని సూచించారు. వర్క్‌చార్ట్‌ ప్రకారం పనుల్లో నాణ్యతపాటిస్తూ గడువులోగా నిర్మాణ పనులు పూర్తిచేయాలన్నారు. పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఈఎన్సీ గణపతిరెడ్డి, సచివాలయ ఎస్‌ఈలు సత్యనారాయణ, లింగారెడ్డి, పలువురు అధికారులు, వాస్తు నిపుణుడు సుధాకర్‌తేజ పాల్గొన్నారు.


VIDEOS

logo