శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 09:00:15

మ‌ధ్యాహ్నం రైతు వేదిక‌ల‌ను ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్‌

మ‌ధ్యాహ్నం రైతు వేదిక‌ల‌ను ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్‌

హైద‌రాబాద్‌: రాష్ట్ర ప‌్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన రైతువేదిక‌ల‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. జ‌న‌గామ జిల్లా కొడ‌కండ్ల‌లో ఇవాళ మ‌ధ్యాహ్నం 12.10 గంట‌ల‌కు రైతువేదిక‌ను ప్రారంభిస్తారు. అనంత‌రం కొడ‌కండ్ల‌ మార్కెట్ యార్డులో ఐదు వేల మంది రైతుల‌తో సీఎం స‌మావేశం కానున్నారు. ఈసంద‌ర్భంగా రైతువేదిక‌ల‌ను ప్ర‌భుత్వం ఎందుకు చేప‌ట్టింద‌నే విష‌యాల‌ను, భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల‌ను రైతుల‌కు వివ‌రించ‌నున్నారు. బేగంపేట నుంచి హెలికాప్ట‌ర్‌లో బ‌య‌లుదేరి 12 గంట‌ల‌కు కొడ‌కండ్ల గ్రామానికి చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం 12.20 గంట‌ల‌కు కొడ‌కండ్ల‌లోని ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాన్ని ప్రారంభించి ప‌రిశీలించ‌నున్నారు. అనంత‌రం కొడ‌కండ్ల మండ‌లంలోని రామ‌వ‌రం గ్రామంలో వైకుంఠ‌దామం, డంపింగ్ యార్డ్ ప‌నుల‌ను ప‌రిశీలిస్తారు.  

రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం 2601 రైతువేదిక‌ల‌ను నిర్మిస్తున్నారు. ఇందులో 1951 వేదిక‌ల నిర్మాణం ఇప్ప‌టికే పూర్తికాగా, మ‌రో 650 నిర్మాణాలు వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయి. వీటి నిర్మాణానికి ప్ర‌భుత్వం రూ.571 కోట్లు కేటాయించింది. సాంకేతిక ప‌రిజ్ఞానం, ఆన్‌లైన్ స‌మావేశాల స‌దుపాయాల‌తో నిర్మించిన రైతువేదిక‌లు ద‌శ‌ల‌వారీగా అందుబాటులోకి రానున్నాయి. ఐదు వేల ఎక‌రాల‌కు ఒక‌టి చొప్పున వ్య‌వ‌సాయ క్ల‌స్ట‌ర్ల వారీగా వేదిక‌ల‌ను నిర్మించారు. క్ల‌స్ట‌ర్ల‌లోని రైతులంతా ఒకేచోట చేరి పంట‌ల బాగోగులు, మార్కెట్ ధ‌‌‌ర‌లు స‌హా ప‌లు అంశాలు చ‌ర్చించుకునేలా ఏర్పాట్లు చేశారు.