ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 02:02:55

పిడికిలెత్తండి రైతులు కేంద్రంపై కన్నెర్ర చేయాలి

పిడికిలెత్తండి రైతులు కేంద్రంపై కన్నెర్ర చేయాలి

  • సన్నాలకు కేంద్రం ఎక్కువ ధర ఇవ్వనివ్వడం లేదు
  • అన్నదాతలు కండ్లు ఎర్రజేసి.. పిడికిలి బిగించాలె
  • మనం లేంది వాళ్లెక్కడున్నరనే వార్నింగ్‌ పంపాలే
  • అగ్వకు దొరికిండ్రా.. రైతుల పక్షాన ఎవరూ లేరనా
  • త్వరలోనే సమగ్ర భూసర్వే: ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • రైతు వేదికలకు ప్రారంభం.. కొడకండ్లలో భారీ సభ

సన్న వడ్లకు మద్దతు ధరకన్నా నూరో యాభయ్యో ఎక్కువ ఇద్దామంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఇయ్యనివ్వడం లేదు. ఒకవేళ ఎక్కువ ధర ఇస్తే మొత్తం వడ్లనే కొనడం బంద్‌చేస్తామని చెప్పింది. ఎఫ్‌సీఐ దీనిపై రాష్ర్టానికి లేఖరాసింది. ఇదేందో అర్థం కావడంలేదు. దీన్ని ఎట్లా అధిగమించాలో ఆలోచన చేయాలె.. అంటే కండ్లు ఎర్రజేసి..    పండ్లు పటపట కొరికి.. పిడికిలి ఎత్తాలె.. ఆ సమయం రావాలె.. కేంద్ర ప్రభుత్వం కండ్లు తెరిపించాలె. మేం లేంది మీరెక్కడున్నరు బిడ్డా అనే వార్నింగ్‌ పోవాలె.. ఆ వార్నింగ్‌ తెలంగాణ నుంచి కూడా పంపించాలె.. దీనికి తయారేనా? పంపుదామా? అట్ల జరిగే వరకు మన రైతుల్ని ఎవరూ చూడరు. పట్టించుకోరు.

                                  - సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతు వేదికలు ఆటంబాంబులని, రైతులను సంఘటితం చేసే శక్తి వాటికుందని, వీటి వల్ల రైతురాజ్యం వచ్చి తీరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఈ వేదికల ద్వారా రైతుల బతుకులు బంగారం అవుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని మండిపడ్డారు. సన్న వడ్లకు కేంద్రం ఎక్కువ ధర ఇవ్వదట.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానంటే ఇవ్వనివ్వడం లేదని ఆరోపించారు. శనివారం జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగాఏర్పాటుచేసిన బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. సన్నాలకు ఎక్కువిస్తే.. మొత్తానికి కొనమంటుండ్రుకొన్ని దేశాలు రైతులకు సబ్సిడీలిస్తాయి. కానీ మనదేశంలో అది కూడా లేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తానంటే కూడా కేంద్రం ఇవ్వనివ్వదు. పెద్ద భయంకరమైన కథ ఇది. ‘రైతులకు మీరు ఇవ్వొద్దు.. ఇస్తే గనుక మీ ధాన్యం కొనను అని ఆంక్షలు పెడుతుంది. ఒక్క మనకే కాదు దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఎఫ్‌సీఐ (ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ఆర్డర్‌ ఇచ్చింది. నా చేతిలోనే ఆ ఆర్డర్‌ కాపీ ఉన్నది. ఈ ఆర్డర్‌ ప్రకారం సన్న వైడ్లెనా, దొడ్డు వైడ్లెనా ఏవైనా సరే మీరు క్వింటాలుకు రూ.1888కే కొనాలే.. ఒకవేళ అంతకన్నా ఒక్క రూపాయి ఎక్కువ పెట్టినా మీ వడ్లు మేము తీసుకోం అని చెప్పింది. ఒకవేళ సన్న వడ్లకు నూరో.. యాభయ్యో రాష్ట్ర ప్రభుత్వం ఇద్దామంటే మీ వడ్లు తీసుకోవడమే బంజేస్తమని ఆర్డర్‌ ఇచ్చిండ్రు. దీంతో నేనేమన్నా చెప్పుదామన్నా.. ఆ రోజు నుంచి కేంద్రం మన వడ్లను తీసుకోవడం బంద్‌ పెడతది. ఇది మన దేశంలోని పరిస్థితి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వాలకు రైతుల మీద ఉన్న ప్రేమను రైతుబంధు మిత్రులు, రైతులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గమనించాలె.

రైతన్నను మార్చాలని ప్రతిజ్ఞ తీసుకున్నా.. 

ఉద్యమ సమయంలో జనగామ జిల్లా బచ్చన్నపేటలో మాట్లాడిన. ఆ మీటింగ్‌లో ఒక్క యువకుడు కూడా కనపడలేదు. అంతా ముసలోళ్లే ఉన్న రు. నేను ఆశ్చర్యపోయిన. యువకులంతా ఎటు పోయిండ్రు అని అడిగితే..  బతకపోయిండ్రు సార్‌ అని చెప్పిండ్రు. ఎందుకంటే వరుసగా ఏడేండ్లు కరువు. మంచినీళ్లు కూడా లేవు. నాలుగైదు కిలోమీటర్లు పోయి మంచినీళ్లు తెచ్చుకుంటున్నం.. నాలుగైదు రోజులకోసారి స్నానం చేస్తున్నం.. అంత కరువున్నది అని చెప్పిండ్రు. నేను కూడా రెండు కండ్ల నిండ ఏడ్చిన. మహబూబ్‌నగర్‌ జిల్లా నడిగడ్డ, నల్లగొండ జిల్లా  ఫ్ల్లోరైడ్‌ కావొచ్చు. రైతుల బాధలు, ఆత్మహత్యలు, ఉరితాళ్లకు వేలాడే పీనుగలు.. నేను కండ్లారా చూసి ఏడ్చిన. అందువల్ల రాష్ట్రం సాధించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత కఠిన నిర్ణయం తీసుకున్న. ఎంతదూరం పోయినా మంచిదే.. తెలంగాణ రైతాంగం భారతదేశంలోనే అగ్రగామి కావాలె, అద్భుతైమన రైతాంగాన్ని తయారుచేయాలని ప్రతిజ్ఞ తీసుకున్న. 

వేరే ఏ రాష్ట్రం ధాన్యం కొంటలేదు.. 

ఇదంతా టెక్నాలజీ యుగం.. మీరందరి చేతిలో స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌లు ఉన్నయి. ఏ మారుమూల పల్లెలో ఉన్నా వాస్తవాలు తెలుసుకోవచ్చు. ఎవడో ఏదో చెబితే నమ్మాల్సినవసరం లేదు. నేను చెప్పింది కూడా నమ్ముమని చెప్తలేను. వాస్తవాలు తెలుసుకోవాలె.. గ్రామాల్లో చర్చ జరుగాలె. రైతులోకం అంతా చర్చ చేయాలె. ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రం కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేదు. రైతుల దగ్గర నుంచి వారి గ్రామాల్లోనే కొనే ఏర్పాటుచేసిన ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ. వేరే ఏ రాష్ట్రం కూడా ధాన్యం కొనకుండా.. రైతులను గాలికి వదిలేసిండ్రు. రైతులకు మంచి ధర ఇద్దామంటే మెడ మీద కత్తిపెడతరు. ఆంక్షలు పెడతరు. కాబట్టి ఈ రకమైన చిక్కుల్లో మనం ఉన్నాం. ఈ దరిద్రం గొట్టు మహమ్మారి కరోనా ఇంకా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమున్నది. మార్కెట్లో ఒకే దగ్గర జమైతే లేని ప్రమాదం వచ్చే అవకాశమున్నది. ఇప్పుడిప్పుడే సెకండ్‌ వేవ్‌ కరోనా వస్తదని అంటుండ్రు. పది రూపాయలు పొయినా మంచిదే.. రైతుల పేరు మీద వెయ్యి కోట్ల రూపాయల నష్టం వచ్చినా మంచిదే కానీ గ్రామాల్లోనే ఏర్పాటుచేయాలని వ్యవసాయ మంత్రికి చెప్పిన. ఒక్క గింజ కూడా బయట అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడోళ్లు అక్కడే గ్రామాల్లో ధాన్యం విక్రయించుకోవచ్చు. ఈ రైతు వేదికను ప్రారంభించినందుకు చాలా చాలా గర్వపడుతున్న. నేను కూడా రైతు బిడ్డనే.. రైతునే.. దీన్ని ప్రారంభించినప్పుడు ఒక రాజ్యం గెలిచినంత సంతోషమైంది నాకు. 

ఎంత ఖర్చైనా సరే.. రైతు వేదికలు నిర్మించాల్సిందే

ఒక గొప్ప అద్భుతమైన పనికి శ్రీకారం చుట్టినం. ఇది మామూలు ఆషామాషీ పని కాదు. గత ప్రభుత్వాల్లో అగో అంటే అర్నెళ్లు.. మొదలు పెట్టి ఆడ పడేస్తరు. రైతు వేదికలపై పార్టీలో, క్యాబినెట్‌లో, మంత్రులు, ఎమ్మెల్యేలతో తీవ్రమైన చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నాం. డబ్బులు ఖర్చైతే అయినై.. కానీ రైతులు కూర్చొని మాట్లాడేందుకు జాగ కావాలె. అది లేకుండా వారిని ఐక్యం చేయలేమని, కచ్చితంగా రైతు వేదికలను నిర్మించాలని, ఎన్ని వందల కోట్లు అయినా ఖర్చు పెట్టాలని నిర్ణయించి ఈ రోజు వాటిని నిర్మాణం చేసినం. అవి ఒకటి రెండు కాదు 2601 రైతు వేదికలు నిర్మాణం జరుగుతున్నయి. 95శాతం పూర్తయినయి. దాదాపు రూ. 600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది ఒట్టిగనే పెట్టలే.. ఒక గొప్ప ఉద్దేశంతో, వ్యూహంతో ఒక పటిష్ఠమైన అవగాహనతో ఇవి కట్టినం.

రైతు వేదిక.. ఒక ఆటంబాంబు

రైతు సోదరులందరికీ దండం పెట్టి చెప్తున్నా.. ఆగమాగం.. అడివడివి కావద్దు.. ఈ రైతు వేదికలు కట్టించడం నా కల.. రైతాంగం ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాలె. చర్చ చేయాలె.. మంత్రి నిరంజన్‌రెడ్డి, నేను, ఇంకెవరో మిమ్మల్ని ఎందుకు నియంత్రించాలె? గవర్నమెంట్‌ మిమ్మల్ని ఎందుకు నియంత్రించాలె? మీకు మీరే నియంత్రించుకోవాలె. ఇందుకు రైతు వేదిక ఒక అవకాశం. రైతువేదిక ఒక ఆటంబాంబు.. అద్భుతమైన శక్తి. ఈ వేదికలు రైతును అద్భుతంగా తయారుచేసేవి కావాలి. రైతు సంఘటితమైతే గొప్ప విప్లవానికి శ్రీకారం చుట్టొచ్చు. ఆ సంఘటిత శక్తిలో పవర్‌ ఉంటుంది. 


రైతు వేదికలోకి పోతే.. బతుకు బంగారం అవుతది

రైతులమంతా ఆర్గనైజ్డ్‌గా లేము. ఎవరికి వాల్లే ఉన్నం. అందుకే మనకు విలువ లేదు, గౌరవం లేదు. అమ్మబోతే అడివి.. కొనబేతో కొరివి అనే సామెతలు పుట్టుకొచ్చినయ్‌. మేం సంఘటితం అవుతున్నాం అని తెలంగాణ రైతాంగం నిరూపణ చేయాలి. రైతు వేదికలోకిపోతే మాకేమొస్తదని అనుకోవద్దు. అందులోకి పోతే బంగారం వస్తది.. బతుకు బంగారం అయితది. రైతు వేదిక ద్వారా ఏ పంట పెట్టాలని రైతాంగం నిర్ణయించాలె. దేశంలో ఏది అమ్ముడుపోతదో నిర్ణయించాలె. ధర నిర్ణయించాలె. పండించిన పంటకు ధరను ఎవడో ఎల్లయ్య నిర్ణయించుడు కాదు.. మీ రైతుబంధు కమిటీలు నిర్ణయించాలె. రైతు సంఘాలు నిర్ణయించాలె. అందుకు ఈ వేదిక కావాలె. వ్యవసాయశాఖలో ప్రబలమైన మార్పులు తీసుకొస్తున్నం. మరో ఐఏఎస్‌ అధికారిని పెడుతున్నం. ఏయే దేశంలో ఏ పంటలు వేసిండ్రు. మనం ఏ పంట వేస్తే లాభం.. మన రైతులు ఏం చేయాలనే దానిపై ఒక శాఖ పెడుతున్నం. వాళ్లు దేశ విదేశాలు తిరిగి ఏ పంట వేస్తే బాగుంటదనేది పరిశీలిస్తరు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి దగ్గర కూడా ఓ అధికారి ఉంటడు. ఆయన కూడా అదే పనిచేస్తడు. రాజేశ్వర్‌రెడ్డి మన రాష్ర్టానికి పెద్ద కాపాయినే. నేను కూడా కాపోడినే. మన కాపోళ్లందరికీ ఆయన అధ్యక్షుడు. 

రాజ్యం జయించినంత ఆనందంగా ఉన్నది

ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది.. మొన్న మేడ్చల్‌లో ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినం.. ఇప్పుడు కొడకండ్లలో మరో కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నం. రైతులు తమ పంటలపై, సాధకబాధకాలు మాట్లాడుకొనేందుకు రైతువేదికలను నిర్మించుకున్నం. దేశంలో.. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో.. రైతులకు ఎక్కడా వేదికలు లేవు. అమెరికా, యూరప్‌ దేశాల్లో కూడా రైతులు నిరసన తెలియజేస్తనే ఉన్నరు. టన్నుల కొద్ది టమాటలు, అలుగడ్డలు తెచ్చి రోడ్లపై పడేస్తున్నరు. రైతులకు ఒక ఆర్గనైజేషన్‌ లేదు. రైతు చాలా పెద్దవాడు.. వినడానికి బాగానే ఉన్నది.. కానీ కూసొని మాట్లడుకునేందుకు జాగ లేదు. ఆగమాగం.. జగన్నాథం.. మార్కెట్‌కు ధాన్యం తీసుకపోవడం, విత్తనాలు వేసుకోవడం, పంటలో అవలంబించాల్సిన మెళకువలు గానీ ఉత్తమమైన పంటలు పండించే విధానాలపై రైతులు ఒకతాడ కూసొని మాట్లాడుకునే వ్యవస్థ లేదు. ఈ వేదికలను ఒట్టిగనే కట్టలేదు. ధరణి పోర్టల్‌ వట్టిగనే తేలేదు.. రైతుబీమా, రైతుబంధు కూడా వట్టిగనే పెట్టలేదు. రైతాంగం సంఘటిత శక్తిగా కావాలె. చేతికి ఐదు వేళ్లున్నయి.. ఒక్క ఏలుతో కొడితే దెబ్బతగుల్తదా?? అదే పిడికిలి బిగించి గుద్దితే మొఖం పచ్చడైతది. రైతాంగం పిడికిలి కావాలని నేను కోరుతున్నా. అమ్మేటోనికి లాభం లేదు.. కొనేటోనికి లాభం లేదు. ఇట్లా అన్ని కూరగాయలు, ధాన్యం ధరలపై జిమ్మిక్కులు చేసి దళారులు దోచేస్తుండ్రు. దీనికి నివారణ రావాలంటే.. ఈ బాధ పోవాలంటే మన రైతు వేదికలే ప్రధాన భూమిక పోషిస్తయి. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపడే రోజు వస్తది. నాడు నేను తెలంగాణ వస్తదని చెప్పితే ఎవరైనా నమ్మిండ్రా.. రాలేదా తెలంగాణ. నీళ్లు, కరెంట్‌ రాలే? కాళేశ్వరం ఖతంగాలే? రైతుబంధు రాలే? ఎట్లా వచ్చినయ్‌ ఇవన్నీ.. సంకల్పం, ధైర్యం కావాలె అప్పుడు అన్నీ వస్తయ్‌. నిండు మనసుతో చెప్తున్నా.. రైతుగా.. కాపోనిగా హృదయపూర్వకంగా దేవునికి దండం పెట్టి చెప్తున్నా.. నేను కలగన్న ఈ రైతువేదిక ద్వారా రైతురాజ్యం వచ్చి తీరుతది.

వేదికలో కూర్చొని వినాలె..


మీ అందరి దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉన్నయి. అంతా రైతు వేదికలో కూర్చోండి. ముఖ్యమంత్రి మాట్లాడుతడు, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, కార్యదర్శి జనార్దన్‌రెడ్డి లేదా సీఎస్‌ మాట్లాడుతడు.. పంటల సాగుపై ఒక సందేశం ఇస్తరు. వందల మంది రైతులు ఆ రైతు వేదికలో కూర్చొని వాటిని వినాలె. మన వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, శాస్త్రవేత్తలు ఉన్నరు. వాళ్లు పాఠాలు చెప్తరు. వరి పంట వేస్తే ఏం చేయాలె, మక్క పంటలో ఏం చేయాలే, అల్లం వేస్తే ఏం చేయాలె.. సూచనలు ఇస్తరు. ప్రతి రైతువేదికలో కొద్దిరోజుల్లోనే టీవీలను పెడతం. ఒక దగ్గర నుంచి మాట్లాడితే అన్ని వేదికల్లో అధికారులు మాట్లాడేది కనిపించేలా ఏర్పాట్లు చేస్తం. 

ఛత్తీస్‌గఢ్‌లో రైతులు.. 

నేను ఓసారి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లిన. అక్కడ ఐదువేల మంది రైతులు ఒక సొసైటీ పెట్టుకున్నరు. ఒక్కో రకం పంట గురించి ఆ హాల్‌లో జమై చర్చిస్తున్నరు. నువ్వేం ఇత్తునం పెట్టినవ్‌.. నువ్వేం చేయాలె. నీకెన్ని టన్నులు పండింది. నాకు తక్కువెందుకు వచ్చింది.. ఇలా ఒకరి అనుభవాలు ఒకరు పంచుకున్నరు. దాంతో మేలైన పంటలు పండిస్తున్నరు. లాభాలు బాగా వస్తున్నయ్‌. వాళ్లే ధర నిర్ణయిస్తరు. వ్యాపారి వస్తే బాజాప్తాగా ధర అడుగుతరు. మా ఊళ్లో వంద ట్రాక్టర్లు వస్తది ఏం ధర ఇస్తవు అని అడుగుతరు. ఎరువులు కూడా చిల్లర దుకాణాలకు వెళ్లి కొనరు. సొసైటీ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా కంపెనీ ఎండీతో మాట్లాడుతరు. కల్తీలేని ఎరువులు వాళ్ల ఇండ్లకచ్చి దించిపోతరు. అందరికన్నా ఓ రూ. 20కే తక్కువ ధరకే ఇస్తరు. ఇలా ఐక్యమత్యంగా ఉంటే అనేక లాభాలు ఉన్నాయి. 

కండ్లు ఎర్రజేసి.. 

కేంద్రం రైతులపై చూపుతున్న వివక్షను ఎట్లా అధిగమించాలో ఆలోచన చేయాలె.. అంటే రైతాంగం పోరాటానికి సిద్ధం కావాలె.  కండ్లు ఎర్రజేసి.. పండ్లు పటపట కొరికి పిడికిలి ఎత్తాలె. కేంద్ర ప్రభుత్వం కండ్లు తెరిపించాలె. మేం లేనిది మీరెక్కడున్నరు బిడ్డా అనే వార్నింగ్‌ పోవాలె.. ఆ వార్నింగ్‌ తెలంగాణ నుంచి కూడా పంపించాలె.. అట్ల జరిగే వరకు మన రైతులను ఎవరూ చూడరు. పట్టించుకోరు.

రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాన్ని చూసి సీఎం సంబురంపాలకుర్తి రూరల్‌/కొడకండ్ల: జనగామ జిల్లా కొడకండ్లలో నిర్మించిన రైతు వేదిక, ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనాన్ని చూసి సీఎం కేసీఆర్‌ సంబురపడ్డారు. రైతు వేదిక ఎదురుగా ఉన్న రైతు ఎడ్లబండి చిత్రాన్ని చూసి ఆనందం వ్యక్తంచేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రైతుల పాలిట దేవాలయమైన రైతు వేదికను ప్రారంభిస్తుంటే సీఎం కేసీఆర్‌లో చెప్పలేనంత సంతోషం, భావోద్వేగం కనిపించింది. ఇవి కేవలం రైతు వేదికలు కావు.. రైతుల సంఘటితానికి నిలయాలని అన్నారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించినప్పుడు కలిగిన సంతోషాన్ని ఆయన నిండు సభలో పంచుకున్నారు.  గుట్ట మీద ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని చూస్తే ఎక్కడ లేనంత ఆనందం కలిగిందన్నారు. పల్లె ప్రగతిలో సర్పంచ్‌లు, అధికారుల పాత్ర మరవలేనిదని సీఎం కేసీఆర్‌ కొనియాడారు.

ఆపుకుంటం కానీ ఆగమాగం అమ్మం

ఎవలకు వాళ్లే ఉంటే ఆగమాగం అయితం. ఇష్టమొచ్చినట్టు ఆడుకుంటరు. అందరం ఒక్కటిగా ఉంటే గిట్టుబాటు ధరలు వస్తయి. నేను కర్బూజ పండిచ్చిన. బ్యారకాడు వచ్చిండు.. ఏం ధర అని అడిగితే ఏడు రూపాయలన్నడు. నేను మార్కెట్లో తెలుసుకుంటే రూ.40 కొంటున్నమని చెప్పిన్రు. అమ్మేటోనికేమో ఏడు.. కొనేటోనికేమో 40.. మరి ఈ 33 ఎటుపాయె. ఏ దళారోనికిపాయె. అటు వినియోగదారునికి.. ఇటు రైతుకు లాభం లేదు. ఇట్లా కూరగాయలు, ధాన్యం ధరల్లో మధ్య దళారీలు దోచేస్తున్నరు. దీనిని నివారించాలంటే మన రైతు వేదికలే ప్రధాన భూమిక అయితయి. ప్రపంచమంతా ఆశ్చర్యపడే పరిస్థితి వస్తది. ధరలను రాష్ట్ర రైతుబంధు కమిటీ నిర్ణయిస్తుంది. సపోజ్‌ మనం గోబీపూలు పండించినం. రాష్ట్ర రైతుబంధు కమిటీ చెప్పినట్టు రూ.15 ఇస్తేనే మార్కెట్‌కు తీసుకొస్తం. అవసరమైతే పెంటల పోస్తం తప్ప తక్కువకు ఇయ్యం అనే శక్తి రైతాంగానికి రావాలె. ఆపుకుంటం కానీ ఆగమాగం అమ్మం అనే శక్తి రైతాంగానికి వస్తే ఆటోమెటిక్‌గా గొప్పగా గిట్టుబాటు ధరలు వస్తయి. 

అనుభవాలు పంచుకునే వేదిక

పంట పెట్టిన కాడి నుంచి కూసోని చర్చించుకోవడానికి, అనుభవాలు పంచుకోవడానికి ఇదొక వేదిక. 2,600 మంది అధికారులు మీకున్నరు. నేను సీఎం అయ్యేనాటికి వ్యవసాయశాఖను సంపేశిన్రు. మాట్లాడేటోడు లేకుండే. ఈనాడు ప్రిన్సిపల్‌ సెక్రటరీ జనార్దన్‌రెడ్డి నాయకత్వంలో అన్ని పోస్టులను నింపినం. మీ క్లస్టర్‌ ఆఫీసర్‌, మీ ఏఈవో మీకున్నరు. వాళ్లందరికీ ఐప్యాడ్‌లు ఇచ్చినం. ఏ ఎకరంల ఎంత పంట వస్తదో రికార్డు చేయమని చెప్పినం. ఈ వేదికలు వృథాకావొద్దు. జీవంతో ఉండాలె. ఇదేదో ఎలక్షను, ఓట్ల పంచాయతీ, చిల్లర పంచాయతీ కాదు. దాదాపు 60 లక్షల కుటుంబాలు అంటే 2 కోట్ల మంది 50-60 శాతం మంది ప్రజల బతుకుదెరువు. వ్యవసాయదారులే కాదు వారిపై ఆధారపడి బతికే అనుబంధ వృత్తులవారికి కూడా సంబంధించిన విషయం. 

రైతు వేదిక ఒక బ్రహ్మాస్త్రం

క్లస్టర్‌ రైతులందరినీ రైతు వేదికల దగ్గర జమ చేయాలె. ఇవాళ ప్రభుత్వంలో అవకాశం ఉన్న మేరకు, నిధుల లభ్యత మేరకు సుమారు రూ.600 కోట్లు ఖర్చు పెట్టి వీటిని కట్టించిన. ఈ రోజు నేను చెబుతున్న కేసీఆర్‌ మాట.. రేపు వీటిని బ్రహ్మాండమైన సిమెంట్‌ బంగ్లాలుగా మీరే కట్టుకుంటరు. అద్భుతమైన రైతు నిలయాలుగా అవి తయారవుతాయ్‌. ఇవాళ నేను 200 నుంచి 450 రైతుల కోసం కట్టించినా.. కానీ రేపు నాలుగువేల మంది రైతులు వచ్చేలా మీరే విస్తరించుకుంటరు. ఆ శక్తి.. పవర్‌ మీకు తెలిస్తే బ్రహ్మాండంగా ముందుకుపోతరు. రైతుబంధు నాయకులను నేను కోరుకునేది ఒక్కటే.. మీరు ఇక్కడ పోషించేది ఒక చారిత్రాత్మక పాత్ర. కేవలం రాజకీయ పాత్ర కాదు. ఎన్నికలు వస్తే ఏ గవర్నమెంట్‌ రావాలో మీరే నిర్ణయించవచ్చు. రైతులందరూ ఒక పట్టుపడితే వాళ్లు కోరిన ప్రభుత్వం వస్తది. ఇవాళ ఆ భయం ఎవరికీ లేదు కాబట్టే మీతో ఆటలు ఆడుతున్నరు. మీకు ఐక్యత లేదు కాబట్టి, ఒక్కకాడికి రాలేరు కాబట్టి వాళ్లు ధరల విషయంలో గానీ, ఇతర విషయాల్లో గానీ ఇష్టం ఉన్నట్లు ఆటలు ఆడుతున్నరు. వాటన్నింటికీ నివారణ బ్రహ్మాస్త్రం మన రైతు వేదిక. మంత్రి నిరంజన్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను ఒక రైతుబిడ్డగా నేను ఒక్కటే కోరుతున్నా.. దయచేసి మీరు ఒకనెల రెండునెలలు మీ నియోజకవర్గాలు మరచిపోవాలె. అవకాశం ఉన్న వరకు నేను కూడా తిరుగుత. అన్ని జిల్లాల్లో రైతువేదికల వద్ద మీటింగ్‌ పెట్టి మాట్లాడాలె. నేను ఏదైతే ఇప్పటిదాకా మొత్తుకున్ననో ఈ విషయాలన్నీ రైతులకు చెప్పాలె. తప్పకుండా వారిలో చైతన్యం తీసుకురావాలె. ఎన్నికలు వస్తే ఎట్లా కొట్లాడుతమో అంతకన్న రెట్టింపు కొట్లాడాలె.